Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ దేశంలో చాలా ప్రాంతాలలో స్త్రీ కేవలం పురుషుల అవసరాలు తీర్చడానికి పనికి వచ్చే సరుకుగానే ఎంచబడుతుంది అని చెప్పినప్పుడు చాలా మంది ఆధునిక పురుషులు అంగీకరించరు. జీవితం పట్ల, స్త్రీ ఆత్మాభిమానం, వ్యక్తి స్వాతంత్య్రం, మానవ కర్తవ్యం పట్ల కనీస అవగాహన లేకుండా జీవిస్తున్న ప్రస్తుత ఆధునిక స్త్రీలలోని ఓ సమూహాన్ని మాత్రమే గమనిస్తున్న కొందరు పురుషులు ఇటువంటి గంభీరమైన విషయాలను ప్రస్తావించిన ప్రతి సందర్భంలోనూ అవహేళనగా మాట్లాడడం అందరకీ అనుభవమే. ఆధునిక ప్రపంచంలో విలువల పట్ల మారుతున్న స్త్రీల దృక్పధాన్ని గమనిస్తున్న వ్యక్తులుగా స్త్రీ సమస్యల పట్ల తేలిక భావాన్ని చూపే పురుషుల అనుభవ రాహిత్యాన్ని అర్ధం చేసుకోగలం. స్త్రీ జీవన సంఘర్షణ పట్ల, పురుషాధిక్య సమాజంలో ఆధునికత దిశగా జరిగిన స్త్రీ ప్రయాణం వెనుక ఉన్న కోట్లాది స్త్రీల సంక్షోభం, పోరాటం అర్ధం చేసుకోలేని స్త్రీ సమాజం పట్లే వ్యక్తిగతంగా నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. థామస్ గ్రే అన్నట్లు MEN ARE FROM MARS WOMAN ARE FROM VENUS. రెండు విభిన్న గ్రహాలకు చెందిన స్త్రీ పురుషులు. ఒకరిని మరొకరు అదే స్థాయిలో అర్ధం చేసుకోగలడం, గౌరవించుకో గలగడం, ముఖ్యంగా 'అధికారం' పునాదిగా ఏర్పడుతున్న మానవ సంబంధాల మధ్య అతి కష్టమైన విషయం. అయితే ఒకే గ్రహానికి చెందిన స్త్రీలు తమ జీవితాల పట్లగానీ ప్రపంచంలోని ఇతర స్త్రీల జీవన ప్రమాణల పట్లగానీ కనీస అవగాహన లేకుండా మిగిలిపోవడం బాధ కలిగిస్తుంది. ఆర్ధికంగా ఉన్నత వర్గానికి చెందిన ఒక వర్గపు స్త్రీలు తమ మిడిమిడి వాదనలతో, పోకడలతో సమస్త స్త్రీ అస్థిత్వ పోరాటానికి ఎంతగా నష్టం కలుగజేస్తున్నారో తెలియ చెప్పవలసిన అవసరం ప్రస్తుతం బలంగా ఉందని నా నమ్మకం.
భారతదేశంలో వివిధ కారణాలకు స్త్రీ అనాదిగా అమ్ముడవుతూనే ఉంది. ఇది చాలా మంది ఒప్పుకోని వాస్తవం. ముప్పై సంవత్సరాల క్రితం, ''ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'' రిపోర్టర్‌గా పని చేస్తున్న అశ్విని సారిన్, ఈ విషయాన్ని నమ్మని సమాజానికి జవాబు కొత్త పద్ధతిలో చెప్పాలనుకున్నాడు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు కలిసే చోట ధోల్‌పుర్ అనే ఒక ఊరు ఉంది. అక్కడ స్త్రీలను బాహాటంగా అమ్ముతారని అశ్వినికి తెలుసు. అతను ఆ ఊరికి వెళ్ళి కమల అనే ఓ స్త్రీని నిజంగానే మార్కెట్లో కొన్నాడు. ఆమెను ఏప్రిల్ 1981న డిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రవేశపెట్టాడు. అప్పుడు అశ్విన్ వయసు 29 సంవత్సరాలు. అతనికి వివాహం అయ్యింది. డాక్టరుగా ఆ ఊరికి వెళ్ళి ఆక్కడి వారి నమ్మకాన్ని సంపాదించి ఓ మధ్య వయసు స్త్రీని 2,300 రూపాయలకు కొనుగోలు చేసాడు. ఈమె శివపురి అనే ఊరికి చెందినది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పంజాబ్‌లో ఓ బర్రెగొడ్డు ఖరీదు కన్నా సగం ధరకే తాను ఓ స్త్రీని కొనుక్కుని వచ్చానని ప్రకటించాడు. అతన్ని ప్రశించిన వారికి ఆ ప్రాంతాలలో స్త్రీలను అమ్ముతున్నారని తనకు తెలిసిందని, అన్ని వయసుల వారిని అమ్ముతారని, పని వారిగా, వేశ్యలుగా వీరు అమ్ముడ య్యాక కొన్నవారి అవసరాలకు అనుగుణంగా మార్చ బడతారని చెపుతూ, కమలను కొనడానికి ఎవరూ ఆసక్తీ చూపకపోతే ఆమెను తాను కొన్నానని చెప్పాడు.
కమలను ముందు అశ్విని న్యూ ఢిల్లీలోని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ అశ్విని భార్యను చూసి ఆమె ''నిన్ను ఎంతకు కొన్నాడు ఆయన'' అని ప్రశ్నించిందట. పైగా ''నన్ను కొనేగా తీసుకువచ్చాడు మనమిద్దరం ఇక్కడే ఎందుకు కలిసి ఉండకూడదు'' అని అడిగిందట. స్త్రీని పురుషుడు కొనుక్కునే ఇంట ఉంచుకుంటాడని ఆమె అమా యకంగా నమ్మి వేసిన ఆ ప్రశ్న, ఆ ప్రాంతాలలోని స్త్రీల జీవితాలను బైటపెడుతుంది. అయితే ఇది జరిగిన తరువాత ఓ మనిషిని బాహాటంగా కొన్నాడనే నెపంతో అశ్విని సారిన్ పై 1981లో ప్రభుత్వం కేసు పెట్టింది. అప్పటికే కమల ఓ నారీ కేంద్రానికి పంపబడింది. అయితే ఆమెను సాక్షిగా ప్రశ్నించాలని, ఆమెకు రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులు ఆమెను అక్కడి నుండి తరలించారు. అశ్విని సారిన్ ''ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పని చేసినప్పుడు ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా అరుణ్ షోరి ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం సత్యాన్ని వెలికితీసే ప్రయత్నంలో చట్టాన్ని అత్రిక్రమించడం ఎంత వరకు సబబు అనే వీషయంపై చాలా చర్చ జరిగింది. ఈ మధ్య ట్రిబ్యూన్ పత్రికా విలేకరి ఒకరు, ఒక మిలియన్ భారతదేశ ప్రజల ఆధార్ వివరాలను కేవలం ఐదు వందల రూపాయలకే సంపాదించడం వెనుక స్కాంను ఇలాగే స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి స్వయంగా చేసి చూపించినప్పుడు, అతనిపై కేసు పెట్టిన ప్రభుత్వ వైఖరిపై రేగిన చర్చ తరువాత జరిగిన డిబేట్లో కమల విషయం మళ్ళీ ప్రస్తావనకు వచ్చింది.
జర్నలిజం, నైతికత అనే విషయాల గురించి చర్చ వదిలి మరో కోణంలో విషయాన్ని గమనిస్తే కమల కేసు ఈ సమాజంలో స్త్రీల స్థితికి ప్రతీకగా నిలుస్తుంది. ఆనాటి నుంచి నేటి ఆధునిక సమాజంలో సరోగసీ విధానం వరకు గమనిస్తే స్త్రీలపై జరుగుతున్న వ్యాపార స్థాయిలలో మార్పు, విధానాలలో మార్పులు కనిపిస్తాయి తప్ప, స్త్రీని సరుకుగా చూసే పురుష దృక్పధంలో పెద్దగా వచ్చిన మార్పు ఏమీ లేదు.
ఇదే విషయాన్ని తీసుకుని ఏ మార్పూ లేకుండా ఓ నాటకంగా రాసారు విజరు టెండుల్కర్. ఆ నాటకాన్ని ఆధారం చేసుకుని ''కమల'' అనే పేరుతో సినిమాగా 1985లో జగ్మోహన్ ముంద్రా తెరకు ఎక్కించారు. ఈ సినిమాలో మార్క్ జుబెర్, షబానా అజ్మీ, దీప్తి నావల్, ఏ.కే హంగల్లు ప్రధాన పాత్రలు పోషించారు. జైసింగ్ జాధవ్ అనే జర్నలిస్ట్ పాత్ర పేరు మాత్రం మార్చుకుంది కాని పూర్తిగా అశ్విని సారిన్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తుంది. ఈ పాత్రను మార్క్ జుబేర్ పోషించారు. అతని భార్య సరితా జాధవ్ పాత్రను షబానా అజ్మీ పోషించారు. ఇక నిజ జీవితంలో కమల పాత్రను ఈ సినిమాలో కమలగా దీప్తీ నావల్ పోషించారు.
పైన ప్రస్తావించిన సంఘటనను సినిమాగా మలచిన విధానాన్ని గమనిస్తే కథ రాసుకున్న విజరు టెండుల్కర్ని అభినందించకుండా ఉండలేం. సినిమాలో కమల ప్రధాన పాత్ర అయినా జర్నలిస్ట్ భార్యగా, ఉన్నత వర్గానికి చెందిన స్త్రీగా తన అస్థిత్వం గురించి ఆలోచించి మధనపడే భార్య సరితా జాధవ్ పాత్రలో షబానా అజ్మీ నటన మరచిపోలేం. ముఖ్యంగా కమల, సరితల మధ్య జరిగే సంభాషణ ఒక్కటి చాలు ఈ సినిమాను ట్రీట్ చేసి విషయాన్ని సున్నితంగా చర్చకు పెట్టిన రచయిత సామాజిక భాద్యతను ప్రస్తావించుకోవడానికి. కేన్ ఊయలలో కూర్చుని ఆలోచిస్తున్న సరిత గదిలోకి బెదురిగా వచ్చే కమలను చూసి దగ్గరకు పిలుస్తుంది. ఆమెను పైన కూర్చోమని సరిత చెప్పినా కమల కింద కూర్చుని ఆమెతో సాటి స్త్రీగా సంభాషణ మొదలెడుతుంది. కమల దృష్టిలో స్త్రీలందరూ పురుషుడు కొన్నుక్కునే సరుకులే. అందుకని ఆమె నిన్ను ఎంతకు కొన్నారని సరితను ప్రశ్నిస్తుంది. సరిత కొన్ని వేలకు కొన్నాడని బదులిస్తే, ''నిన్ను అంత ఎక్కువగా కొన్నాడా, అయినా అతనికి నువ్వు పిల్లలను ఇవ్వలేకపోయావు. పర్లేదులే నేను ఇంట ఉండి అతని పనులు చూసుకుంటూ పిల్లల్ని కంటాను. నువ్వు అతనితో బైటకు వెళుతూ అతని అవసరాలు తీర్చుదువు కాని'' అంటూ నెలలో ఎన్ని రోజులు ఇద్దరు అతని పక్కన చేరాలో కూడా ఆమె అమాయ కంగా చెబుతున్నపుడు ఆ ఇద్దరి స్త్రీల ముఖాలపై భావా లను కెమెరా పట్టుకున్న తీరు చాలా బావుంటుంది. తరు వాత ఓ లాంగ్ షాట్లో ఇద్దరిని కలిపి చూపిన సీన్ ఇంకా బావుం టుంది. సరిత కమల కోసం కుర్చీ దిగి కింద కూర్చుని ఆమెతో మాట్లా డుతూ ఉంటుంది. ఇద్దరూ వేష భాషలలో తప్ప ఒకేలా కనిపిస్తారు ప్రేక్షకులకు. సరిత కూర్చున్న ఆ కుర్చీ అనే స్థాన భేధం లేకపోతే స్త్రీల పరిస్థితి పురుష సమాజంలో ఒకటే కదా అని చూసేవారికి అనిపిం చక మానదు. పైగా వారు కూర్చున్న గదిలో పెద్ద పెద్ద ఫొటోలలో సరిత డిగ్రీ తీసుకున్న ఫొటోలు ఆమె వివాహానికి పూర్వం నేర్చుకున్న విద్యలను సూచించే ఎన్నో ఫొటోలు దూరంగా కనిపిస్తూ ఉంటాయి. కాని భార్య స్థానంలోకి మారిన తరువాత ఆమెకు, కమలకు మధ్య తేడా పెద్దగా ఉన్నట్లు అనిపించదు. ఈ షాట్, దర్శకులు జగన్మోహన్ ముంద్ర, రచయిత విజరు టెండుల్కర్లు రేపిన ప్రశ్నలతో ప్రేక్షకులలో అలజడి పుట్టిస్తుంది.
ఇక సినిమాలో మరో కోణాన్ని కూడా గమనించాలి. ఆ ఇంట్లో పెద్ద దిక్కుగా కాకా సాహెబ్ అనే వ్యక్తి ఊరి నుండి వచ్చి ఉంటాడు. కమలను జైసింగ్ కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చి నప్పటి నుంచి అతను అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఇతను పాత్రికేయుడు, సరితకు బంధువు. ఓ చిన్న పత్రికను తన పంథాలో నడిపిస్తూ ఉంటాడు. తాను నమ్మిన ఆ పాత విలువలకు కట్టుబడి పని చేస్తూ ఉంటాడు. తన పత్రిక ముద్రణ కోసం అవసరమయిన కాగితం సప్లై కోసం అతను డిల్లీ వస్తాడు. అతి క్లిష్టమైన పరిస్థితులలో అతను తన పని చేసు కుంటూ ఉన్నాడు. జర్నలిజం పేరున జరుగుతున్న ఈ ఆధునిక ప్రయోగాల పట్ల అతనిలో ఎన్నో ప్రశ్నలు. నిజాన్ని బలంగా వినిపించాలంటే ఈ పద్ధతి తప్ప మరొకటి ప్రస్తుతం పని చేయదని అతనితో వాదనకు దిగుతాడు జైసింగ్. జైసింగ్ చేస్తున్న పని వెనుక ప్రయోజనం ప్రజా సంక్షేమమే కాని దానికి అతను ఎన్నుకున్న దారి పట్ల కాకా సాహెబ్‌లో ఎన్నో అనుమానాలుంటాయి. కాని ప్రస్తుత వ్యవస్థను గమనిస్తూ అతను ఎటూ చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. జైసింగ్‌ను సమర్ధించలేడు, అతన్ని విమర్శించనూ లేడు. ఈ స్ట్రింగ్ ఆపరేషన్ వెనుక జైసింగ్ చొరవ, నిబద్దతను ప్రశ్నించలేడు. కాని అందులో మరో కోణంలో, వత్తిలో గెలవాలనే తపన జైసింగ్‌లో బలంగా కనిపిస్తుంది. తన తోటి జర్నలిస్టులందరిలో తాను ముందు నిలవాలనే కాంక్ష కూడా ఉంది. ఈ కాంక్ష వ్యక్తిని విచక్షణ కోల్పోయేలా చేస్తుందని కాకా సాహెబ్‌కు తెలుసు. జైసింగ్‌లో ఆ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. కమలను అతను కూడా తన ఉద్యోగ నిర్వహణలో ఓ వస్తువుగా చూడడాన్ని సరిత, కాకాసాహెబ్లు గమనిస్తారు.
ప్రెస్ కాన్ఫరెన్స్‌కి కమలను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకువెళతాడు జైసింగ్. కమల దగ్గర ఒంటి మీద ఉన్న చీర తప్ప మార్చుకోవడానికి మరొకటి లేదు. తనను జైసింగ్ కొన్నాడని తెలిసి అతని బండి వెనుక పరుగెత్తుకుంటూ వస్తుంది కమల. కొన్నవాడి సరసన అమ్ముడుపోయిన స్త్రీకి కూర్చునే హక్కు లేదనే సాంప్రదాయంలో ఆమె జీవించింది. అలా ఢిల్లీ చేరిన కమల చీర మట్టికొట్టుకుని, కొన్ని చోట్ల చిరిగి ఉంటుంది. ఆమె స్థితి చూసి ఓ శుభ్రమైన చీరను ఇస్తుంది సరిత. కాని అందుకు జైసింగ్ సరితను తిడతాడు. అదే మాసిన బట్టల్లో కమల ప్రెస్ కాన్ఫరెన్స్‌కి రావాలని పట్టుపడతాడు. అప్పుడే ఆమె స్థితి పట్ల జనంలో జాలి కలుగుతుందని వాదిస్తాడు. అది అన్యాయం అని ప్రశ్నించిన సరితను అవమానకరంగా తిడతాడు. వారిద్దరి మధ్య జరుగుతున్న వాదనను వింటున్న కమల మౌనంగా చీర మార్చుకుని వచ్చి ''మన యజమాని ఎలా చెబితే అలా మనం నడుచుకోవాలి'' అని విప్పిన చీరను తీసుకుని వచ్చి సరితకు ఇస్తుంది. ఇద్దరికీ యజమానిగా మారిన జైసింగ్లోని అధికార నైజాన్ని మౌనంగా చూస్తూ ఉంటుంది సరిత. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కమలతో వెకిలిగా మాట్లాడి అవమానకరమైన ప్రశ్నలు వేసిన తోటి జర్నలిస్టుల నైజాన్ని సరిత హర్షించలేకపోతుంది. అది తన భర్త విజయం అని ఆమె అనుకోలేకపోతుంది. అందులోని అమానవీయత జైసింగ్‌కు ఎందుకు అర్థం కావట్లేదని ఆమె భాధపడుతుంది. తాను జైసింగ్ అధికారాన్ని ప్రశ్నించాలని, తన అస్థిత్వాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుంటుంది.
కాని నారీ కేంద్రానికి పంపిన కమలను ప్రత్యర్ధులు మాయం చేసి, ఆ సంఘటనే అబద్దం అని జైసింగ్ పేరు కోసం చేసిన కుట్ర అని నిరూపిస్తారు. తాను ఎంతో కష్టపడి కమల ద్వారా స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను బైటపెట్టలని ప్రయత్నిస్తే, తననే పావుగా చేసారని తెలిసి జైసింగ్ మానసికంగా కృంగిపోతాడు. మోసపూరితమైన వ్యవ్యస్థలో మోసంతో ఆ వ్యవస్థను ఎదిరించాలంటే ప్రతిసారి విజయం కలగదని, అదే మోసం మనపై ప్రత్యర్ధులు జరిపితే తట్టుకునే నైతిక సామర్ధ్యాన్ని కూడా మనం కోల్పోవలసి వస్తుందని, జైసింగ్ పాత్ర ద్వారా దర్శకులు చూపించారా అనిపిస్తుంది. చివరకు అతనికి చేదోడుగా సరితే నిలిచి అతనికి నైతిక మద్దతు ఇస్తూ భార్యగా తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సిద్ధపడడంతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా ముగింపు పట్ల కొంత అసహనం చూపిన విమర్శకులు ఉన్నా చాలా గంభీరమైన విషయాలను, జవాబు లేని ప్రశ్నలను సంధిస్తూ మరోలా సినిమాను ముగించడం కష్టం అనిపిస్తుంది. జైసింగ్ చేసిన పని ఎంత వరకు సబబు అన్నది ఓ పెద్ద ప్రశ్న. కమల జీవితం పట్ల ఎన్నో ప్రశ్నలు, సరిత అస్థిత్వం పట్ల ఎన్నో అనుమానాలు, కాకా సాహెబ్ వంటి నిబద్దత గల పాత్రికేయుల పరిస్థితి, నిస్సహాయత పట్ల అసహనం, న్యాయం కోసం నైతికత సూత్రాలను అతిక్రమించ వలసిన పరిస్థితిని కల్పించిన సమాజం పట్ల కోపం, ఇవన్నీ ఈ సినిమాను చూసిన ప్రేక్షకుల ఆలోచనలను ఆక్రమించి తీరుతాయి. అందుకే 'కమల' సినిమా చాలా మందికి గుర్తుండి పోతుంది. ఎనభైలలో సామాజిక దృక్పధంతో గొప్ప చిత్రాలు భారతీయ భాషలలో వచ్చాయి. ఆ సమయంలో సమాజంలో జరుగుతున్న మేధో మధనానికి ఇవి ప్రతీకలుగా నిలిచాయి. ప్రస్తుతం ఈ స్థాయిలో సినిమాలు తీసే వ్యక్తులు లేని లోటు యువత ఆలోచనా విధానంపై చాలా ప్రభావం చూపుతుందన్న మాట మాత్రం నిజం.
- పి.జ్యోతి, 9885384740