Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తెలుగు మట్టి వాసన వెదజల్లే కథలు'' అంటూ డా|| నందమూరి లక్ష్మీపార్వతి (అధ్యక్షులు, తెలుగు - సంస్కృత అకాడమీ) చక్కటి ముందుమాట రాసారు. డా|| ఎల్. ఆర్.స్వామి కథలపై విశ్లేషణ బాగుంది. విశాఖ - శ్రీకాకుళం మాండలికాల గుబాళింపులు, సామాన్య జనం వారి జీవితంలోని ఘటనలు, సంఘటనలు... కరోనా రోజులు, మధ్య తరగతి జీవితాల చిత్రణ ఈ కథల్లో వుంది. చాలా పత్రికలు ఈ కథలు ప్రచురించబడి పాఠకాదరణ పొందినవే! 15 కథలూ పాఠకుల్ని చివరి పేజీ దాకా చదివిస్తాయి. ఈ కథల్లో వాడిన యాస పదాలకు అర్థాలు, వాడుక పదాలు చివర ఇవ్వడం బాగుంది.
తమ్మునిపై అక్క మమకారం, సొంత కొడుకును మేనమామ చూసి రమ్మని పంపే అక్క మనస్తత్వం, వారంలో ఆదివారం మామయ్యను చూసే శ్రీను... అత్తమ్మ కుటుంబ బాధ్యతలు, చివరి రోజులు గడిపే పెద్దాయనకు నోట్టో గంజి పోయడం... లాంటి సన్నివేశాల బలంతో ఓ మధ్య తరగతి జీవితాల్ని కథీకరించే చిన్న కథే 'బాల్కనీ' (పేజీ 18)
రెక్కల కష్టం చేసుకొని బతికే కోటేశ్వరరావు, పోలమ్మలు పెండ్లి చేసుకొంటారు. ఆలుమగల కొట్లాటలు... విడిపోవడాలు.. ఇద్దరు పిల్లలతో ఇంటి పన్లు చేసుకొని బతికే పోలమ్మకు రెండొందలే నెలకు అందించే భర్త, పేదరికం అనుభవించే శ్రమజీవుల వ్యతలు కథలుగా రాయడం గొప్ప విషయం.
ఒకనాటి పల్లెటూళ్లలో లోగిలి ఇండ్లు వుండేవి. ఇప్పుడు సినిమాల్లో చూస్తాం. నాలుగు వేపులా వరండా వుంటుంది. గదులూ ఉంటాయి. మధ్యలో ఖాళీగా గచ్చుంటుంది. అక్కడే అష్టాచెమ్మా, పిల్లల ఆటలు... కురిసే వర్షం, తాతయ్య చెప్పే కథలూ! వర్షాలు లేక రైతు పడే బాధలు, కృత్రిమంగా ఆ వరండాలో వర్షం కురిపించి తాతయ్యను ఆనందింపజేసే సన్నివేశ బలం గల కథ 'మొలిచింది'లో చూడగలం. (పేజీ 102). వర్షం కోసం తాతయ్య కలవరించే స్థితి అద్భుతంగా చెప్పారు.
నేనింకా బతికే ఉన్నా / మందు / మనసే మూలం / దివిటి / రైలెల్లి పోనాది / నడక ఆగింది లాంటి కథలు విశాఖ పరిసర ప్రాంతాలకు, మాండలిక భాషకు అద్దంగా నిలుస్తాయి. శ్రమజీవుల్ని మధ్య తగరతి కుటుంబాల్ని ఈ 15 కథల్లో మళ్ల జ్యోతిర్మయి చక్కగా అక్షరీకరించారు. వస్తువు, శిల్పం, భాష, ముప్పేటగా అల్లిక ప్రతి కథలోనూ కనిపిస్తుంది. కుటుంబ నేపథ్యాన్ని అద్భుతంగా ముఖ్యంగా పిల్లలకు ఆలోచన, ఆనందం, అవగాహన కల్పించే కథలుగా ఇవి వున్నాయి.
జ్యోతిర్మయి కథలు
రచయిత్రి : జ్యోతిర్మయి మళ్ళ,
పేజీలు : 120, వెల : రూ.120/-,
ప్రతులకు : మళ్ళ ప్రభాకరరావు,
ఇం.నెం. 5-155/9, సుజాతా నగర్,
వైజాగ్ - 530051. (ఆం.ప్ర)
సెల్ : 9296356220
- తంగిరాల చక్రవర్తి , 9393804472