Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుప్పల్లి శ్రీరాములు.... ఈ పేరు ఇవ్వాళ్ళ బాల సాహిత్యం రాస్తున్న కొందరికి కొత్తగా అనిపించొచ్చు... మరి కొందరికి తెలియక పోవచ్చు. కానీ పిల్లల కోసం... వాళ్ళ సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం తపించే 'తాత' దుప్పల్లి శ్రీరాములు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం దుప్పల్లిలో 1942లో శ్రీరాములు పుట్టారు. శ్రీమతి నారాయణమ్మ, శ్రీ ఈశ్వరయ్యలు తల్తిదండ్రులు. అయిదవ తరగతి వరకు చదువుకున్న శ్రీరాములు కవి, రచయిత, రంగస్థల నటులు, నాటకకర్త. వ్యాసాలు, కీర్తనలు, మంగళ హారతులు, బాలల నాటికలు రాశారు.
ధార్మిక చింతన, ఆధ్యాత్మిక భావన, జాతీయ చేతన ప్రధానంగా కార్యక్రమాలు, పనులు, రచనలు చేసిన శ్రీరాములు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రసిద్ధులు. శ్రీసరస్వతీ విధ్యా పీఠం శారాధాధామంతో ప్రత్యక్ష సంబంధంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధర్మప్రచార పరిషత్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శుభప్రదం వంటి కార్యక్రమాల్లో వీరి భాగస్వామ్యం ఉంది. ముఖ్యంగా కోలాటం, చెక్క భజనలు, తాళం వంటివి వీరికి యిష్టమైన కళా రూపాలు.
మూసి మొదలుకుని అక్షరాంజలి వరకు వివిధ పత్రికల్లో అనేక అంశాలపైన వ్యాసాలు రాశారు. వందలాది కార్యక్రమాల్లో వక్తగా, ధార్మిక ప్రసంగకర్తగా పాల్గొన్నారు. 'పాలమూరు జిల్లా నాటక కళా వైభవము', 'నేటి పౌరాణిక నాటక దుస్థితి' వంటివి వీరి రచనలు. నాటకకర్తగానే కాక రంగస్థల నటునిగా అనేక ప్రదర్శనలిచ్చిన శ్రీరాములు 1977 నుండి నేటివరకు సాగిని వీరి నట ప్రస్థానంలో శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యంలో అస్థాన నటులుగా, మహా మహా నటుల సరసన వికర్ణుడుగా, భువన విజయ రూపకంలో భట్టుమూర్తిగా, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి ద్రౌపదిగా నటించిన నాటకంలో శ్రీకృష్ణుడిగా, చింతామణి నాటకంలో బిల్వమంగళుడిగా, పోతనగా, అన్నమయ్య తండ్రిగా, గోవింద భగవత్పాదులుగా, బెజ్జమహాదేవి నాటకంలో మరుళయ్యగా, శతరూపలో మహామంత్రి తిమ్మరుసుగా... ఇలా అనేక పాత్రలను లబ్దప్రతిష్టులైన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, దూళిపాళ సీతారామ శాస్త్రి, పీసపాటి నర్సిహ్మమూర్తి వంటి వారి సరసన నటించి మెప్పును పొందారు. నటులుగా తెలుగు విశ్వవిద్యాలయం అందించే పైడి లక్ష్మయ్య ఉత్తమ నటనా కీర్తి పురస్కారం అందుకున్నారు. తెలుగు నాటకరంగ దినోత్సవాన కందుకూరి వీరేశలింగం పంతులు పురస్కారం, గధ్వాల బాల భవన పురస్కారం వంటివి అందుకున్నారు దుప్పల్లి శ్రీరాములు. వీరి ఆధ్యాత్మిక, ధార్మిక సేవలకు 'హిందూరత్న' బిరుదుతో సత్కరించారు.
ఆధ్యాత్మికంగా, పౌరాణికంగా అగ్రశ్రేణిలో వెలుగొందు తూనే అనేక ధార్యిక సంస్థలతో సన్నిహిత సంబంధాలతో పాటు అనేక ధార్యికోత్సవాల్లో భాగస్వాములైన వీరు పిల్లల కోసం పౌరాణికాలతోపాటు అనేక అంశాలతో 'బాలల నాటికలు' రాయడం విశేషం. ఇది 2013లో వెలువడింది. నిజానికి పిల్లల కోసం అన్ని ప్రక్రియలు, రూపాల్లో రచనలు వస్తున్నప్పటికీ నాటికలు, నాటకాలు తక్కువనే చెప్పాలి. తెలంగాణలో నేడు డా.అమృతలత, మధిర బాబ్లానాయక్ వంటి నలుగురైదుగురు మాత్రమే మనకు కనిపిస్తున్నారు. ఆ కోవలో పిల్లల నాటికలు రాసిన బాలల నాటకకర్త మన దుప్పల్లి శ్రీరాములు.
వీరి 'బాల నాటికలు' విలక్షణమైన సంపుటి. రెండువందల పుటల ఈ పుస్తకంలో 22 రెండు పౌరాణిక నాటికలు, 13 చారిత్రక నాటికలు, 12 సాంఘిక నాటికలతో పాటు నవరత్నాలు పేరుతో పిల్లలకు సంబంధించిన వివిధ అంశాలపై తొమ్మిది నాటికలున్నాయి. ఇవేకాక మరో 20 ఏకపాత్రలు ఉన్నాయి. పౌరాణికాల్లో 'భారత ధరణీస్తుతి', 'మాతృదేవో భవ', 'భక్తమార్కండేయ' వంటి నాటికలు పిల్లల్లో స్ఫూర్తి కలిగించాలన్న సంకల్పంతో రాశారు. ఇవేకాక భగవద్గీత, దానవీరము, భక్త శభరి, రాజదర్బారు వంటివి చక్కని నాటికలు. చారిత్రకాల్లో విగ్రహారాధన మూఢనమ్మకం కారాదని 'వివేక విజయం', పరస్త్రీలను ఎలా గౌరవించాలో తెలియాలనేది 'శివాజీ సౌశీల్యము', శత్రువును సైతం క్షమించే గుణాన్ని అలవరచుకోవాలని 'శ్రీ మాతృమూర్తి తీర్పు' అనే నాటికలో రాస్తారు. పిల్లల కోసం రాసిన సాంఘికాల్లో 'సత్యమేవజయతే', 'బడిలో తెలుగుభాష', 'ఆడినమాట తప్పిన ఫలము', 'అమ్మ మాటపై నమ్మకము' వంటివి పిల్లలను ఆలోచింప జేస్తాయి. 'నవరత్నాలు' వీరి నాటికల్లో విలక్షణమైనవి. 'విద్యార్థులు-విద్య ప్రయోజనము', 'విద్యార్థులు-సస్త్రధారణ', 'విద్యార్థులు-క్రమశిక్షణ', 'విద్యార్థులు-సినిమా ప్రభావము', 'విద్యార్థులు-టివి ప్రభావము', 'విద్యార్థులు -మాతృమూర్తుల ప్రభావం', 'విద్యార్థులు-తల్లితండ్రుల ప్రభావం', 'విద్యార్థులు-ఉపాధ్యాయుల ప్రభావం', 'విద్యార్థులు-పోషక ఆహారం' వంటివి ఇందులోని నాటికలు. ఈ పేర్లతోనే ఇందులోని విషయం మనకు అర్థమవుతోంది. పిల్లలతో గడుపుతూ వాళ్ళతో ఈ నాటికలను ప్రదర్శింపజేస్తూ బాలల వికాసానికి కృషిచేస్తున్న పెద్దలు దుప్పల్లి శ్రీరాములు 'తాత' ధన్యులు. జయహో!దుప్పల్లి.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548