Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక స్కూలు. ఒక క్లాస్ రూం. క్లాస్ రూంలో అదో బెంచీ. ఆ బెంచీ మీద ఇద్దరు. ఒకటి పేరు సూర్య, మరొకడు చంద్ర. చంద్ర ముఖం చంద్రుడిలా లేదు. ముఖం మీద ఒక్క మచ్చ కూడా లేదు. సూర్య ముఖం ఉదయపు సూర్యుడిలా ఎర్రగానూ, మధ్యాహ్నపు సూర్యుడిలా తెల్లగానూ లేదు. నలుపు సూర్యుడయితేనేం ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించేది ముక్కే. సన్నగా పొడుగ్గా ఆ ముఖానికదో ప్రత్యేకమైనదిగా ఉంది.
సూటి ముక్కు ఉన్న సూర్యకు చిన్నప్పటి నుంచీ సూటిగా మాట్లాడ్డం అలవాటు. ఉన్నది ఉన్నట్టు మనసులో అనుకున్నది అనుకున్నట్టు మాట్లాడ్డం అందరికీ చాతవదు. సూర్యకుమాత్రం అవుతంది.
మచ్చలేని చంద్రుడిలా ఉన్న చంద్రకు చిన్నప్పట్నించీ డొంక తిరుగుడుగా మాట్లాడ్డం అలవాటు. ఉన్నది లేనట్టు మనసులో అనుకున్నది కాక మరోలా మాట్లాడ్డం చాతయ్యే వాళ్ళు కొందరుంటారు. చంద్రకు యిది ఎవరూ నేర్పని విద్య.
మనుషులకి కొన్ని లక్షణాలు చిన్న నాటి నుంచే మొక్కలుగా మొదలయి పెద్దయ్యేప్పటికి వృక్షాలవుతయి. సూర్యచంద్రల లక్షణాలు స్కూలు రోజుల్లోనే పురుడు పోసుకున్నవి.
మాష్టారు పాఠం అంతా చెప్పి అర్థమయిందా అనడుగుతాడు. దాదాపు అందరూ అర్థమైంది అంటారు. కొందరు భయపడి, కొందరు నిజంగానే అర్థమయి. కాని సూర్యం మాత్రం నిర్మొహమాటంగా, సూటిగా అర్థంకాలేదు అని అరుస్తాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా ఉండలేడు మరి. చంద్ర ఇందుకు పూర్తిగావ్యతిరేకం. పాఠం ఒక్క ముక్క క్కూడా బుర్రలో చోటు యివ్వలేకపోయినా పూర్తిగా అర్థమైంది అంటాడు. అందరు టీచర్లనీ పొగుడ్తాడు. ఎవరికి వారు వాడి మాటలు విని తాము బ్రహ్మాండంగా పాఠాలు చెబుతున్నామని, ఉత్తమ ఉపాధ్యాయులమని మురిసిపోతారు. ఒకళ్ళకు తెలీకుండా మరొకళ్ళను మునగ చెట్టు ఎక్కించే చంద్ర అంటే అందరికీ ప్రత్యేక అభిమానం. అందుకే మార్కులు బహుమానం.
సూర్యంటే ఎందుకో మార్కులకి కోపం. ప్రొగ్రెస్ కార్డులో ఎర్ర గీతలు ఎక్కువై పోయేవి. మంచోడు అనిపించుకున్న చంద్రుడూ పోరంబోకు అనిపించుకున్న సూర్యుడూ స్కూలు నుంచి కాలేజికి కలిసి ప్రయాణంచేరు. ఒకరివి అత్తెసరు మార్కులు. మరొకరివి మంచి మార్కులు. ఒకరంటే అందరికీ అభిమానం. ఒకరంటే అందరికీ తలనొప్పి, చిరాకు.
చదువయ్యాక చంద్రుడు వాళ్ళనీ వీళ్ళనీ కాకాపట్టీ ఓ ప్రైవేటు కంపెనీలో మ్యానేజర్ అయ్యేడు. ఖర్మకాలి అదే కంపెనీలో సూర్యం గుమస్తా అయ్యేడు. చంద్రం చేసే వన్నీ చేస్తూ యజమానికి దగ్గరయ్యేడు. సూర్యం ముక్కుసూటిగా పనిచేస్తూ ఎవరినీ ఆకట్టుకోలేకపోయేడు. ఉన్నది ఉన్నట్టుగా మాటాడ్డం, ఖచ్చితత్వాన్ని పాటించడం స్వంత అభిప్రాయాలు కలిగి ఉండటం వాటినే వ్యక్తం చెయ్యడం సరియైనది కాదని అతనెప్పుడూ అనుకోలేదు. తనని తాను లోకానికి సరిపోయేట్టుగా మార్చుకునే ప్రయత్నమూ చెయ్యలేదు.
అందుకే ఓ నాడు యజమానితో గొడవపడ్డాడు. లెక్కల్లో తప్పులు బయట పెట్టాడు. మేనేజర్ కంపనీని మోసం చేస్తున్నాడని వాదించేడు. ముఖస్తుతికి, చెక్క భజనకీ లొంగిపోయే యజమాని సూర్యం తలపొగరును భరించలేకపోయాడు. నిజాలన్నీ అబద్ధాలనుకున్నాడు. అబద్ధాన్ని ఆలింగనం చేసుకున్నాడు. నిజాన్ని కాలుతో తన్నాడు. ఉద్యోగం ఊడి సూర్యం రోడ్డున పడ్డాడు.
ఇలా సూర్యం రోడ్డున పడటానికి ముందు ఓ సంఘటన జరిగింది. ప్రతిమనిషి జీవితమూ సంఘటనల సమాహారమే. సూర్యం జీవితం కూడా. గుమాస్తాగా చేరిన కొన్నాళ్ళకే పెళ్ళికొడుకయ్యేడు సూర్యం. కొత్తలో ఇద్దరికీ కొత్తే కదా. ఆ తర్వాత ఇద్దరిలో పాతా బయటకు తన్నుకుంటూ వచ్చేయి. సూర్యం పద్ధతి ఆమెకస్సలు నచ్చలేదు. ఏ మాట పడితే ఆ మాట ముఖం మీదే అనేయడం అన్నీ పద్ధతి ప్రకారం జరగాలనడం ఆమెకు చిరాకు తెప్పించింది. ముఖ్యంగా ఆమె సెల్ఫోన్ ఉపయోగించడమ్మీద సూర్యం చేసిన ప్రసంగంతో ఆమె అగ్గి మీద గుగ్గిలం అయ్యింది.
సూర్యం సంపాదన సంసారం విలాసవంతంగా గడవడానిక్కాదు. అదో మాదిరిగా కూడా నడవడానికి సరిపోదని ఆమె విసుక్కోసాగింది. అతను పని చేసే కంపెనీ మానేజర్ తింటున్న లంచాల్లో భాగం అడగమని, యజమానికి మంచి చేసుకుంటే జీతం పెంచుతాడని హితబోధ చేసింది. అవేవీ సూర్యం చెవులు దాటి లోపలికి పోలేదు. సిద్ధాంతాలూ, విలువలూ, పద్ధతులూ ముక్కుసూటి తనం ఈకాలంలో ఎందుకూ పనికిరావని ఆమె చెప్పినా సూర్యం వినడు కదా. ఓ రోజున ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. సూర్య భార్యనీ ఆమె తల్లిదండ్రుల్నీ ఆ వెనుక తరాల్ని దుమ్మెత్తి పోశాడు. బలహీనతలు, లోపాలు, వికారపు చేష్టలు, దుర్మార్గం మనుషుల్లో ఉండటం సహజం. కానీ వాటిని ఎత్తి చూపటం అసహజం. సహించరాని నేరం. సూర్యం భార్య బ్యాగు సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఉద్యోగం ఊడి రోడ్డున పడ్డ సూర్య ఇప్పుడు ఒంటరివాడు. చేయడానికి పనేమీ లేకపోవడంతో రికామీగా తిరగసాగాడు. ఉన్నప్పుడు తింటూ లేనప్పుడు కుళాయి నీళ్ళు తాగుతూ, జీవితం అన్నాక మనిషికి తెలియని మలుపులు ఉంటయి. తెల్సిన వాడొకడు ఓ పార్టీలో పరపతి ఉన్నవాడు సూర్యాన్ని ఆ పార్టీ కార్యకర్తగా చేశాడు. పార్టీ సభల్లో 'హలో హలో మైక్ టెస్టింగ్'తో మొదలైన అతని రాజకీయ అరంగ్రేటం ఉపన్యాసాలు యిచ్చే స్థాయికి ఎదిగింది. వేడిగా, వాడిగా నిర్భయంగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే సూర్య పార్టీ తరుపున అసెంబ్లీలో ఉంటే అధికార పార్టీకి చుక్కలు చూపించగలడని భావించి ప్రతిపక్ష పార్టీ ఎన్నికల అభ్యర్థిగా ఓ సీటు ఇచ్చింది. మలుపు తిరిగే దాకా తెలీదు కదా. ఎక్కడ్నించో దూసుకువచ్చిన చంద్ర అధికార పార్టీ నుంచి ఎన్నికలలో బరిలోకి దిగేడు అదీ సూర్యకు వ్యతిరేకంగా.
అబద్ధపు హామీలు యిచ్చేది లేదని, మంచి వాడనిపించిన వాడిని న్యాయంగా ఎన్నుకోవాలని ఓట్లు కొనడం దారుణమని అవతలి పార్టీ వాళ్ళ డబ్బుకు ఆశపడి ఓటు వేసేవాడు నరకానికి పోతాడని సూర్య సభల్లో చెప్పటం విని జనం నవ్వుకున్నారు. అనేక పథకాలు అమలు చేస్తానని ఇళ్ళూ నీళ్ళూ ఉద్యోగాలు యివ్వడమే కాక ఓటుకింత చొప్పున యిస్తానని ఇచ్చిన చంద్రం అధిక మెజారిటీ ఓట్లతో సూర్యాన్ని ఓడించాడు. ఈ పార్టీ కాకపోతే మరోకటి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మారి మళ్ళీ మళ్ళీ మంత్రి అయ్యే సత్తా వుంది, పైకి ఏ మచ్చా కనిపించని చంద్రకి.
సూర్య మళ్ళీ రోడ్డు మీద పడి ముక్కుసూటిగా నడవసాగాడు. లోపలా బయటా ఒకే ముఖం ఉన్నవాడు సూర్య. అసలు ముఖం ఏదో కనిపించనీయని వాడు చంద్ర.
- చింతపట్ల సుదర్శన్, 9299809212