Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ ప్రచురించిన ఈ కథా సంపుటిలో 15 కథలున్నాయి. 'కథరాయడం ఆమెకు సహజాతం' అంటూ ప్రముఖ కవి, విమర్శకులు సీతారాం చక్కటి ముందుమాట రాసారు. 6వ శతాబ్ధంలో 'నాచీ' దగ్గర నుంచి 13వ శతాబ్ధంలోని మొల్ల దాకా... ఎందరో కవయిత్రులు ఈ గడ్డపై అద్భుత సాహిత్యం సృజించారు. తెలుగు కథ పుట్టి 120 సం|| దాటింది. 'ధన త్రయోదశి' కథతో అచ్చమాంబ (1904) తొలి తెలుగు కథకురాలిగా ఖ్యాతినొందారు.
కథా రచనలో కోట్ల వనజాత చేయి తిరిగిన రచయిత్రి. గతంలో 'ఇత్తు' కథా సంపుటి తెచ్చారు. ఇది ద్వితీయ ప్రయత్నమైనా అద్వితీయమైన కథలు అందించారు. ప్రపంచీకరణ రక్కసి గ్రామీణ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. మార్కెట్ మాయాజాలం మూడు పంటలు పండే భూముల్ని కాంక్రీట్ జంగిల్‌గా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేసింది. నీరు లేకున్నా కన్నీరు పారించి ఇక్కడి రైతు సేద్యం సాగించాడు. గోసపడ్డాడు. ఇతర భాషల్లోకి అనువదించాల్సిన మంచి కథ 'నాలుకతో హత్య' (పేజీ . 123) మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న ప్రగాఢ సత్యాన్ని అద్భుతంగా కథీకరించారు. రచయిత్రి ఈ కథలో. అధికారియైనా... అటెండర్ అయినా... 'డబ్బు' దెబ్బకు ఎలా ఒరుగుతారో చక్కగా చెప్పారు. డిప్యూటీ సెక్రటరీ రజనీకాంత్ అతని భార్య సరయు కొడుకు రోషన్లది ఓ చిన్న కుటుంబం. రజనీకాంత్ పై అధికారి కర్ణ ఆయనకూ ఒక్కడే కొడుకు. తన ఆఫీసు అమ్మాయి మాయతో కొడుకు పెళ్ళి జరగడం, వున్న ఇల్లు తాకట్టు పెట్టి కొడుకుతో వ్యాపారం చేయించమనడం , లేకుంటే కాపురం చేయనని కోడలు మాయ షరతులు.. తెచ్చిన బ్యాంకు లోను కట్టని కొడుకు వల్ల వాలంటరీ రిటైర్మెంట్తో బాకీలు తీర్చి భార్య 'చారు'తో కర్ణ సుఖంగా వుండబోతాడు. వారి ఆఫీసులోని సరళ తండ్రి ద్వారా ఉద్యోగం పొంది వికలాంగ తమ్ముని, తండ్రిని సరిగా చూడకపోవడంతో వాళ్లు ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. ఇది రజనీకాంత్‌ను బాగా బాధపెడుతుంది. తన సారు కర్ణకు రివాల్వర్ లైసెన్స్, బుల్లెట్ల కోసం ప్రయత్నిస్తాడు. ఇల్లు తన పేరు పెట్టాలన్న కోడలు షరతులు.. కొన్నాళ్లకు అవుట్ హౌస్‌లో ఉండమని హుకుం జారీ చేయడం, మనవణ్ని ముట్టుకోనివ్వని కోడలి తంతుతో విసిగి పోయి తన గ్రామం తోటలో వున్న ఇంటికి కర్ణ చేరి, రక్షణకై తుపాకీ లైసెన్స్ కోరతాడు. కోడలు మాయ తోటనూ కోరుతుంది. తట్టుకోలేని కర్ణ చారూ మేడం నాలుక కోసుకుని ఆత్మహత్య చేసుకోవటం, కొన్నాళ్ళకు తన వూరిలోని పశువుల శాలలో 'కర్ణ'ను రజనీ కలుస్తాడు. ఆయన ఇచ్చిన డబ్బుతో సరయు దగ్గరకొస్తాడు. 4 రోజుల తర్వాత కర్ణసార్ ఆత్మహత్య వార్త చదువుతాడు రజనీకాంత్... ఎక్కడ ప్రారంభం అయిందో మళ్ళీ అక్కడే కథ ముగింపు చేయడం చాలా బాగుంది. అటెండర్ యాదయ్య ఆత్మహత్యకు, కర్ణ సర్ ఆత్మహత్యకు 'డబ్బు - నిరాదరణే' కారణం అన్న అంశాల్ని బలంగా చెప్పడం, చివరిదాకా చదివింపజేయడం ఉత్తమ కథ లక్షణం.
ఏడాది కిందట నవతెలంగాణలో ప్రచురితమైన కథే 'నూర్జ హాన్నీరజ' (పేజీ . 70) రాంప్రసాద్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ప్రేమలో పడిన నీరజ గర్భం దాల్చి బిడ్డను కని... ఉపాధి కోసం పోలీస్ స్టేషన్ ముందు టీ కొట్టు నడుపుతుంది. రాంప్రసాద్ మోజు తీరాక వదిలేసాడు అని, ఖాజాబీ సాయంతో ఇలా నిలబడ్డాననీ, తానూ ఇంజనీరింగ్ చదివానని, సర్టిఫికెట్స్ ఇప్పించని సి.ఐ. గార్ని కోరి... తన కథ సి.ఐ. కూతురు శాన్వీకి చెపుతుంది. సి.ఐ. ఆదుకుంటాడు. శాన్వీ తన లవ్ నుంచి బైటకొచ్చి గోల్డ్ మెడల్ సాధించి మంచి ఉద్యోగంలో చేరి నూర్జహాన్నీరజకు జాబ్ ఇప్పిస్తుంది. సి.ఐ. భార్య సుమతి పోయిన తన కొడుకు వరుణ్‌ను నీరజ కొడుకులో చూసుకుంటుంది. రాంప్రసాద్‌ను రప్పించి అతనిలో మార్పు తెచ్చే పనిలో సి.ఐ. తన కారు డ్రైవర్‌గా పెట్టుకుంటాడు. సంపుటికి శీర్షికగా పెట్టిన కథ 'మైదాకు వసంతం'. ఇద్దరు అన్నదమ్ములు పొలం పంపకాలు, వ్యవసాయం వద్దు అనే అన్న మురళీ, తన వాటా భూమితో వ్యవసాయం చేయాలనే తమ్ముడు శీనయ్య ఉద్దేశాన్ని మిత్రుడు రామకృష్ణ అర్థం చేసుకుని వారి గాధ విన్నాడు. పిడుగుపడి చింతచెట్టు కాలిపోవడం తన తల్లిదండ్రుల మృతి మళ్ళీ చిగురించే చెట్టు చూపిస్తాడు శీనయ్య. తమ పొలంలో ఎన్నో పూలమొక్కలు, కూరగాయ మొక్కలు పెంచాలన్న భార్య వసంత కోరికను అన్న మురళికి, మిత్రుడు రామకృష్ణకు చెప్తాడు. శీనయ్యకు రామకృష్ణ పొలం చూపించి... మొక్కల పెంపకం, ఆర్గానిక్ సేద్యం చెపుతాడు. తన ఇంటి ముందు మైదాకు చెట్టు అందరికీ సంబురం చేస్తుందని శీనయ్య భావన. తన పొలంలోనూ పంటలు, పూల మొక్కలు వెయ్యాలని దృఢ సంకల్పానికి వస్తాడు. మిత్రుని రామకృష్ణ పొలం పంటలు చూసిన శీనయ్య స్నేహితుని ఇద్దరి కొడుకులు అమెరికాలో సెటిల్ కావడం ఇద్దరికీ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై ప్రేమ, పచ్చని పంట, ఆకుకూరలు, పూల మొక్కలు, గోవుల పెంపకం ప్రాధాన్యత తెల్పుతుంది 'మైదాకు వసంతం' కథ. 'కుక్కను కొడితే' కథలో గ్రామీణ పేద రైతాంగాన్ని దళారులు పాస్‌బుక్‌లు ఇప్పిస్తాం అని... లంచాలు కాజేయడం.. వార్ని జలగల్లా పీడించే వైనాన్ని ఈ కథలో చెప్పారు రచయిత్రి.
స్త్రీ వ్యామోహపరుడైన ఆఫీసర్... మగువ గొంతు మాటలు విని డబ్బు చెక్కు రూపంలో పంపడం, సెల్‌ఫోను ల్యాండ్లైనులో రమణి పేరుతో మోసగించడం ఆఫీసర్ భార్య చెల్లెలు కొడుకు గోపి ద్వారా 'వెంకట రమణ' పేరుతో ఎదురుగా డాబా మీద అద్దెకున్న నిరుద్యోగులు అన్న విషయం తేలుతుంది. డబ్బు తీసుకున్నా, మా చెల్లెలు వూరి నుంచి వస్తే మీ ఆయన నీళ్ళు చల్లడం, సైగలు చేయడం, వాకింగ్‌కు డాబాపైకొచ్చి వికృతంగా ప్రవర్తించడం చేయడం ఏమనాలి అని వెంకటరమణ సదరు ఆఫీసర్ భార్యను ప్రశ్నిస్తాడు. వేధించే ఆఫీసర్ కొడుకే పోలీస్ ఇన్స్పెక్టర్ అంటాడు గోపి. మేం వెళ్ళి లొంగిపోతాం అంటాడు వెంకటరమణ. ఇంటికొచ్చి భర్తకు చీపురుతో పూజ చేస్తుంది. వయసు మీద పడినా 'శృంగార చేష్టలు వదలని వృద్ధ ఆఫీసర్‌పై రాసిన హాస్య భరిత కథే వెంకటరమణీయం.
కార్పొరేటర్ కాకి, మైసమ్య బండ, కాళిక, రెక్కల న్యాయం లాంటి కథలు పాఠకుల్ని ఆలోచింపజేస్తాయి. చాలా కథలు పత్రికల్లో ప్రచురణై ప్రజాధరణ పొందిననవే.
సీతారాం ముందుమాటలో చెప్పినట్లుగా సమాజంలోని వెతలు, వాస్తవాలు, నిజాలు, నిష్ఠుర సత్యాలు మనుషులుగా ఎటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలో నిర్దేశింపజేసేవే అన్ని కథలు. వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని చెప్తాయి కొన్ని కథలు. ప్రపంచీకరణ విధ్వంసాన్ని వివరించే ఈ కథలు. తెలంగాణ బతుకమ్మ లందరికీ ఈ 'మైదాకు' అంకితం ఇవ్వడం బాగుంది. వీరి లేఖిని నుంచి మరిన్ని మంచి సామాజికాంశంతో గల కథలు రావాలని ఆశిద్దాం!
మైదాకు వసంతం
రచయిత్రి : కోట్ల వనజాత, పేజీలు : 132, వెల : రూ. 125/-, ప్రతులకు : తెలంగాణ సారస్వత పరిషత్, బొగ్గులకుంట, అబిడ్స్, హైదరాబాద్ - 01; అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
- తంగిరాల చక్రవర్తి , 9393804472