Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకరు ఒక రంగంలో ప్రతిభావంతులై నిలవడం, ఆ రంగంలో అంచులు ముట్టడం చూస్తాం. మరి కొందరు వివిధ రంగాల్లో తమదైన ఆసక్తితో వెలగడమేగాక అన్నింటిని సమానంగా చేపట్టి రాణిస్తారు. ఈ కోవలోనే మనకు రచయిత్రి, కవయిత్రి, విమర్శకురాలు, బాల సాహితీవేత్తగా డాక్టర్ అమరవాది నీరజ కనిపిస్తుంది. 31 జులై 1966 న వరంగల్‌లో పుట్టిన నీరజ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. అమ్మానాన్నలు హైమవతి, డాక్టర్ ఎ.సి.ఎమ్.ఎల్. ప్రసాద్. బాల్యమంత హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయం సమీపంలోని చిక్కడపల్లిలో గడపడం వల్ల అక్కడి పుస్తకాలతో సాన్నిహిత్యం ఒకవైపు, ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మ చెప్పిన కథలు మరోవైపు బాల్యం నుండే నీరజలో సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించాయి. తొలికథ విద్యార్థినిగా ఉన్న ఆంధ్ర మహిళా సభ కళాశాల సంచికలో అచ్చయ్యింది.
బాల సాహిత్యాన్ని ఎంత నిబద్ధతతో రాస్తుందో అదే విధంగా విమర్శను, ఇతర సాహిత్య ప్రక్రియలను చేపట్టి సఫలం అయ్యింది అమరవాది నీరజ. కవిత్వం, గేయాలు, కథలు, వ్యాసాలు, నాటికలు రాసి మెప్పించిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి చేశారు. నీరజ ఆధునిక సాహిత్యంతో పాటు సంప్రదాయ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన నీరజ పొన్నెగంటి తెలగన అచ్చతెలుగు కృతి 'యయాతి చరిత్రలో తత్సమ, తద్భవాలు' అంశంపై ఎం.ఫిల్ పరిశోధన చేసింది. తరువాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనే 'ప్రతిభ-ఇమాజి నేషన్, తులనాత్మక పరిశీలన' అంశంపై సాధికారిక పిహెచ్.డి పరిశోధన చేసింది.
చందాల కేశవదాపు, బాపు రమణలతో పాటు చలం, శ్రీశ్రీలకు నేను శిష్యురాలిని అని గర్వంగా చెప్పుకునే విస్తృత చదువరి అమరవాది నీరజ. తన చిన్నారి కూతురుకు అనేక సంఘటనలను కథలుగా బాల్యం నుండి వినిపిస్తూ వచ్చిన నీరజ ఇప్పుడు వేలాది మంది బాలబాలికల కోసం రాస్తోంది. బాలల విద్య విషయంలో ప్రపంచమంతా అంగీకరిచి ఆచరిస్తున్న విధానం మాంటిసోరి. నీరజ ఆసక్తితో 'మాంటిసోరి ట్రైనింగ్' పూర్తిచేశారు. తాను అమెరికాలో నివాసమున్న కాలంలో అక్కడి తెలుగు పిల్లలు, ఇతరులకు మాంటిసోరి ఫిలాసఫీ నేపథ్యంగా కథలు చెప్పి, తరువాత బాలల కోసం పుస్తక రూపంలో తెచ్చింది. బి.ఎడ్ చదివి విద్యా మనస్తత్వ్త శాస్రం అధ్యయనం కూడా చేసింది. అవన్నీ తన రచనలకు మూల భూమికగా పరుచుకుని బాలల కోసం చక్కని కథల కానుకలను అందించింది. బాలగోకులం 'బాలనేస్తం', 'అంగలకుదుటి సుందరాచారి జాతీయ పురస్కారం', 'మంచిపల్లి సత్యవతి కథా బహుమతి', సహాయ ఫౌండేషన్ లక్ష్మీదేవి అవార్డు వంటివి నీరజకు లభించిన పురస్కారాలు.
పిల్లల కోసం నీరజ చెప్పిన కథలు 'తేనె చినుకులు'గా పిల్లలకు అందాయి. ఈ తేనె చినుకులన్నీ బాలల మనస్తత్వానికి, ఆలోచనలకు, హాయిగా చదువుకునేందుకు రాసిన కథలు. నీతికన్నా బాలలకు ఆనందాన్నివ్వడమే బాల సాహిత్య ప్రధాన లక్ష్యమని నమ్మిన వాళ్ళలో నీరజ ఒకరు. అందుకే ఆమె కథలు ఆ కోవలోనే నడుస్తాయి. బాల సాహితీవేత్తగా పిల్లలకు నీరజ అందించిన రెండవ కానుక 'చిరుకానుక'. ఇందులోని కథలన్నీ అచ్చంగా బాలలకు కానుకలే. ఈ పుస్తకాన్ని 2014లో అంతర్జాతీయ బాలికల సంవత్సరం సందర్భంగా తీసుకు వచ్చారు రచయిత్రి. ఇదే సంవత్సరం మలాలాకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పనిచేస్తున్న కైలస్ సత్యార్థిలకు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. వీటన్నిటి సందర్భంగా బాలలకు 'అక్షరాభ్యాస కానుక' తన చిరుకానుక అని చెప్పిన నీరజ బాలలకు కథా సాహిత్యాన్ని అందుబాటులో ఉంచితు భాష నేర్చుకుంటారని నమ్ముతుంది. ఒక రకంగా ఈ సృజన కార్యం భాషా సేవే అంటారామె. తన కథలో వివిధ అంశాలను పిల్లలకు పరిచయం చేయడం నీరజకు తెలిసిన విద్య. ఒక కథలో వేరుశెనగలు, చిక్కుడుగింజలు ఉదాహరణగా భూమి లోపల పండే శనగలు, పైన పండే చిక్కుడు పోషకాల విషయంలో ఒకటే అని తెలిపితే, మరో కథలో బయటి పని, ఇంట్లో చేసే పని సమానమే అంటారు. ముఖ్యంగా వైకల్యం ఉన్నవారిని ఎలా చూడాలో చెబుతూ స్పీచ్‌థెరపీ విధానాన్ని పరిచయం చేస్తూ ఒక కథ రాసింది నీరజ. అంతేకాకా ఆన్లైన్ మోసాల నుండి డ్రగ్ మాఫఙయా వరకు అన్నింటిని పిల్లలకు తెలిసే విధంగా చెబుతుంది నీరజ. కథే కాదు బాల గేయాల రచనల లోనూ నీరజది అందెవేసినచేయి. 'అమ్మ జోలపాటల రాగాలు మాకోసమే/ ...తాత పోగోట్టుకున్న బాల్యం నేనే' అంటూ రాసిన నీరజ బాలలను ఒక గేయంలో 'జ్ఞానసూర్యులు' అంటుంది. పలు ప్రక్రియల్లో రచనలు చేసినా బాలల కోసం కథ, గేయం, నాటిక రాసిన నీరజ త్వరలో 'ఏడు రంగుల జండా'ను బాల కథల కానుకగా అందించనుంది. బాలల భవిత బంగారు మయం కావాలని నిరంతరం తపించే ఆశావాది డా. నీరజ అమరవాది.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548