Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరంతర గజల్ తృష్ణ గల బిక్కి కృష్ణ తాజా గజల్ గ్రంథం ''శిథిల వసంతం''. గతంలో వీరు వల్లరి, సాంత్వన, గజళ్ళ సంపుటాలు వెలువరించి వున్నారు.
ప్రేమతత్త్వం, సౌందర్య దృష్టి, విరహం, వియోగం, తాత్త్విక భావుకత, కోమలత్వం, ప్రణయం, దారులు దాటుకొంటూ... సందేశం, సాంఘిక చైతన్యం, సామాజికాంశాలు కూడా వస్తువులై... మానవత్వం కేంద్ర బిందువుగా కూడా గజళ్ళు వెలువడుతూ పాఠకుల్ని కదిలిస్తున్నాయి. భోగతత్త్వానికి గాలిబ్, సూఫీ తత్త్వానికి అమీర్ ఖుస్రో, భోగ - రాజ తత్త్వానికి ఉమర్ ఖయ్యూం లాంటి వారు మన ముందు మెదులుతారు. దాదాపు 45 గజళ్ళ ఈ పుస్తకంలో తన భావ, శిల్ప, నిర్మాణశైలి ఏమిటో పాఠక శ్రోతల ముందు ఉంచారు బిక్కి కృష్ణ. ఇప్పటికే అనేక మంది గజల్ కవుల గజళ్ళను సాధికారిక విశ్లేషణ చేసి పుస్తకంగా కూడా తెచ్చారు. అన్ని కవితలూ విశ్లేషించే స్థాయిలో ఉన్నా, స్థలాభావంతో, 2, 3 పరిశీలిద్దాం!!
ప్రపంచీకరణ మనిషిలో కోర్కెలు - ఆశలు - మార్కెట్ వస్తు వ్యామోహం విపరీతంగా పెంచింది. దీన్నే కృష్ణ ఓ గజల్లో ఇలా అంటారు.
''పచ్చనోట్ల ముందు ఆత్మ చచ్చిపోయె కృష్ణ! / పిచ్చి మనసులో కోర్కెలు తీరనివి ఎన్నెన్నో!!'' (పేజీ 18) అంటారు. బుద్ధీజం ఓ గజల్లో అప్రయత్నంగా చెప్పాడా అనిపిస్తుంది ఈ కింది చరణాలు చూస్తే! ''ఇంద్రియాల చర్యలన్నీ క్షణిక సుఖాల దాగిన దు:ఖాలే! / కృష్ణ! రుషులే ప్రేమికులని ధ్యానం సాధించాకే తెలిసింది!'' (పేజీ 28)
ఖగోళ శాస్త్రాంశాల్ని గజల్లో ప్రశ్నిస్తారు ఈ కింది గజల్లో (పేజీ 39)
మహాశబ్ధ ప్రేలుడుతో విశ్వమేర్పడిందంటారె కృష్ణా
బాధకు ప్రేమ ప్రేలదేల? ఏ శాస్త్రమైనా చెప్పగలదా? అంటారు.
స్వసుఖం చూసుకొనే నేటి కాల పరిస్థితుల్ని గజల్ భావంలో ఒదిగించారు ఓ చోట!
''తన సుఖమె ముఖ్యమనే వ్యక్తులున్న చోట
కృష్ణా! త్యాగాల కన్నీటి ఊట కదా జీవితం!!'' (పేజీ 49) అంటారు. అలాగే ప్రేమ గురించి ఓ గజల్లో ఇలా రాసారు.
''ప్రేమ నది నీవైతే తాను పూల పడవై కదిలొచ్చే కృష్ణా!
ప్రణయ స్వర్గం దరిని చేరితే మీ జంటకందం వస్తుంది'' (పేజీ 48).
ప్రేమ, మానవీయ విలువలు.. తాత్త్వికాంశాలు.. ప్రకృతి, పర్యావరణం, ప్రణయం లాంటి అంశాలు గజల్స్లో బలంగా పలికించిన బిక్కి కృష్ణ కృషి పద ప్రయోగాలు అభినందనీయం.
శిథిల వసంతం
కవి : కళారత్న బిక్కి కృష్ణ
పేజీలు : 64, వెల : రూ. 100/-,
ప్రతులకు : బిక్కి కృష్ణ, ఫ్లాట్ నెం.3,
హెచ్ఐజీ - 2, బ్లాక్ - 12,
బాగ్ లింగంపల్లి, హైదరాబాద్ - 44.
సెల్ : 8374439053
- తంగిరాల చక్రవర్తి , 9393804472