Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో నేటి బాలల కథకుల్లో గుర్తుకువచ్చే పేర్లలో పైడిమర్రి రామకృష్ణ ఒకరు. మిమిక్రీ కళాకారుడిగా, మైమ్ కళాకారుడిగా, చిత్రకారుడిగా, రేడియో కళాకారుడిగా సుపరిచితులు. బాల సాహిత్య పరిషత్ బాధ్యుల్లో ఒకడిగానే కాక వందలాది మంది తెలుగు బాల సాహితీవేత్తల్ని 'బాల సాహితీ శిల్పులు'గా పరిచయం చేస్తున్న బాల కథా శిల్పి. పైడిమర్రి రాకృష్ణ జులై 18, 1973న ఖమ్మంలో జన్మించాడు. తల్లితండ్రులు హేమలత, నరసింహమూర్తి.
మార్కెటింగ్‌లో ఎం.బి.ఏ పూర్తిచేసి, టర్మినెక్స్ ఎస్.ఐ.ఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రీజనల్ కీ ఎకౌంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. చిన్నతనం నుంచే కథల రచనపై ఆసక్తితో ఏడవ తరగతి చదివినప్పుడే బాలల పత్రిక బాలమిత్రకు 150కి పైగా కథలు రాసారు. పిల్లల కోసం వాళ్ళ భాషలో రచనలు చేసే రామకృష్ణ కథల్లో జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా ఉంటాయి.
పిల్లల కోసం నాలుగు వందల యాభైకి పైగా కథలు రాసిన రామకృష్ణ వాటిలోని మేలిమి కథలను 'మామయ్య డాట్‌కామ్', 'అనగనగా ఒక అడవి', 'రంగుల రాట్నం', 'చింటుగాడి కథలు', 'మృగరాజు తీర్పు' పేరుతో సంపుటాలుగా తెచ్చారు. ఇటీవల తెచ్చిన పుస్తకం 'గుడ్డేలుగు బల్గం' బాలల కథా సంపుటి.
రామకృష్ణ చేసిన మరో మంచిపని, తన సమకాలీన తెలుగు బాల సాహితీవేత్తలను ఒక ప్రముఖ పత్రికలో ధారావాహికంగా 'బాల సాహితీ శిల్పులు' పేరున పరిచయం చేయడం. తరువాత అదే పేరుతో దానిని పుస్తకంగా ప్రచురించారు కూడా. అది కొత్త హంగులు, రూపురేఖలతో మళ్ళీ రాబోతోంది. తన సమకాలీన రచయితలను పరిచయం చేయడానికి ఆసక్తి, అభిరుచి ఉండాలి. బోల్డు సమయాన్ని ఖర్చు చేయాలి. వివిధ అంశాలు, విషయాలు సేకరించాలి, తరువాత వాటిని బతుకమ్మ లాగా పేర్చాలి. అప్పుడే ఆ వ్యాసం సంపూర్ణంగా రూపొందుతుంది. దానికి తోడు సహృదయత కావాలి, అది పుష్కలంగా ఉంది కనుకనే రామకృష్ణ ఈ పని చేయగలిగాడు. కేవలం బాల సాహితీవేత్తల్నే కాక 'కథా కిరణాలు' పేరుతో తెలుగు కథా రచయితల పరిచయాలను కూడా పుస్తకంగా ప్రచురించాడు రామకృష్ణ.
రామకృష్ణ బాలల కథలు దాదాపు అన్ని తెలుగు బాలల పత్రికల్లో, వివిధ పత్రికల్లోని బాలల విభాగంలో అచ్చయ్యాయి. 1987లో బాలల మాస పత్రిక 'చిన్నారి' లో ఈయన మొదటి కథ 'బుద్ధికుశలత' వచ్చింది. ఈ బాలల మిత్రుని ఎక్కువ కథలు 'బాలమిత్ర' లో అచ్చు కావడం విశేషం. రచయితగా గుర్తింపునే కాక వివిధ పురస్కారాలు, రివార్డులు అందుకున్నాడు పైడిమర్రి. వాటిలో 2000లో 'ఖమ్మం జిల్లా యువజన పురస్కారం', బాల సాహిత్యం విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం వారి 'అంగల కుదుటి సుందరాచారి కీర్తి పురస్కారం', చింటుగాడి కథలు పుస్తకానికి 'తెలుగు విశ్వవిద్యాలయం బాల సాహిత్య పురస్కారం', 'చొక్కాపు వెంకట రమణ బాలసాహిత్య పురస్కారం, 'కొలసాని-చక్రపాణి బాల సాహిత్య పురస్కారం', 'వాసాల నరసయ్య బాల సాహిత్య పురస్కారం', 'బాల గోకులం వారి 'బాలనేస్తం' పురస్కారం, బాల సాహిత్య పరిషత్ నుండి 'బాల సాహితీ ప్రవీణ' 'బాల సాహితీ రత్న' పురస్కారాలతో పాటు జాతీయ సాహిత్య పరిషత్ సిద్ధిపేట నుంచి 'సంటి అనిల్ కుమార్ బాలసాహిత్య పురస్కారం', ఇటీవల 'నారంశెట్టి ఉమా మహేశ్వరరావు బాలసాహిత్య పురస్కారం' అందుకున్నారు.
కథలు బాలల వికాసం, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడంలో మిక్కిలి మేటి పాత్ర వహిస్తాయని నమ్మే పైడిమర్రి పిల్లలకు జంతువుల పాత్రలతో చెబితే సులభంగా అర్థ మవ్వడమే కాక ఆకర్శిస్తాయని, కథలను ఆ దిశగానే రాస్తాడు. 'గుడ్డేలుగు బల్గం' కథా సంపుటి ఇరవై తొమ్మిది కతల వయ్యి. ఈ పుస్తకానికి పేరు పెట్టిన 'గుడ్డేలుగు బల్గం' కథను రచయిత రామకృష్ణ తెలంగాణ భాషలో కూర్చాడు. అడవికి రాజు అనగానే మనకు సింహం అని తెలుసు. అయితే పిల్లలకు ప్రజాస్వామ్యాన్ని, దాని మహత్వ్తాన్ని చక్కగా పరిచయం చేయడానికి జంతువులను వాహకంగా ఎన్నుకుంటే బాగుంటుందనుకున్న రచయిత సింహానికి బదులుగా అడవికి గుడ్డెలుగు రాజుగా ఎన్నికలతో కావడాన్ని చూపిస్తాడు. ఇంకా ఇందులోని 'ఒంటరి కోతి', 'కొంగ బిడ్డ పుట్టినరోజు', 'ఆనందం' వంటి కథలు ఆలోచింపజేయగా, 'బుద్దొచ్చిన కాకి', 'హృదయానందం', 'బుజ్జి ఏనుగు-బుల్లి కోతి' వంటివి సరదాగా సాగే పిల్లల కథలు. గతంలో 'చింటుగాడి' పాత్రద్వారా పిల్లలకు నచ్చే మెచ్చే విషయాలు రచయిత ఎలా చెప్పాడో, ఆ విధంగానే ఇందులో జంతువుల పాత్రలతో చెప్పిస్తాడు పైడిమర్రి రామకృష్ణ. బాలల కోసం కథలను ఒక ఉద్యమంగా రాస్తున్న కథల పిల్లల కథల పెద్దమర్రి పైడిమర్రి రామకృష్ణ. జయహో! బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548