Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కాలిబాటలు' పేరిట విడుదల చేసిన ఈ పుస్తకం చాలా విలువైనది, వెల కట్టలేనిది. డా|| బి.వి.ఎన్. స్వామి తెలంగాణలో గొప్ప కథకులు, కథా సమీక్షకులు, విమర్శకులు, పరిశోధకులు. 'ఉత్తర తెలంగాణ కథా సాహిత్య పరిశీలన' అనే అంశంపై పి.హెచ్.డి. తీసుకున్నారు. డాక్టరేట్‌తో ఆగిపోకుండా కథలు రాయడం, సమీక్షించడం, విమర్శను పరామర్శగా మల్చుకోవడం, కశప (కథా శతక పద్యం) అనే 117 కథలతో సంకలనం తెచ్చారు. 224 మంది కథకుల్ని 'అందుబాటు'లో తెచ్చిన కథా రచన, కథా విమర్శ, కథా పరిశోధన, కథా ప్రయోగం, కథా సంపాదకత్వం నెరపుతున్న కథా ఋషి స్వామి... కథా సాహిత్యంతో జీవితాన్ని పెనవేసుకున్నారు.
ఈ పుస్తకంలో తెలంగాణ వికాసం విస్తృతి నుంచి అనువాద కథల దాకా 14 అంశాలతో పరిశోధనాంశాలు లోతుగా చర్చించారు. రైతు కథ, కార్మిక కథ, కార్మిక కథ, ఆదివాసి కథ, స్త్రీవాద కథ, దళిత కథ, బహుజన కథ, ముస్లింవాద కథ, ప్రాంతీయవాద కథ, ప్రపంచీకరణ కథ, మానవతావాద కథ, బాలల కథ అనే పలు విభాగాలుగా ఎంచుకుని రాసారు. కాలాన్ని నమోదు చేసే కథా సాహిత్యాంసాల సమాహారంగా ఈ రచన సాగింది.
బాలల కథల వర్గీకరణ (5 ఏండ్ల పిల్లలు - ఐదు నుంచి పది ఏండ్లు, పది నుంచి 16 ఏండ్లు వయసు దాకా) బాలల కథా రకాలు, జానపద, సాహస, వీర గాధలు, శాస్త్రీయ కథలు, పురాణ, పంచతంత్ర, సాంఘిక, బేతాళ కథలు, పర్యావరణ కథలు ఇలా 15 రకాల కథలు, వాటి పరమార్థం, కథా వస్తు ఎంపిక, సృజనాత్మకత, వర్ణన, వాస్తవాలు లేని స్థితిగతుల సవిశ్లేషణగా చర్చించారు. కథలు, బాల కథా రచయితల గురించి కూడా క్లుప్తంగా రాస్తే సమగ్రత సంతరించుకునేది. ఇది విమర్శ కాదు, సూచన మాత్రమే. (మలి ముద్రణలో ఆలోచన చేయగలరు) కొండను అద్దంలో చూసినట్లుగా 125 ఏండ్ల కథా సాహిత్య చరిత్ర 133 పేజీల్లో చెప్పి ఒప్పించారు స్వామి. అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, నలిమెల భాస్కర్, ముక్తవరం పార్థసారథి, జి.లక్ష్మి, విశ్వనాథల కథల విశ్లేషణ బాగుంది. వస్తు శిల్పాల సమన్వయమే కథ.
కథ శీర్షిక ప్రారంభాల తరువాత, లోతుల్లోకి వెళ్ళే కథలో స్థలం, కాలం, పాత్రలు, వర్ణనలు, దృష్టి కోణం, భాష, క్లుప్తత, అనుభూతి ఐక్యత, ఉన్నది ఉన్నట్లుగా (ఉత్తమ పురుషలో) చెప్పడం, సమస్యలకు చక్కటి పరిష్కార ముగింపు అందించి పాఠకుల్ని కదిలించే గొప్ప సాహిత్య ప్రక్రియ కథ.
భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఏదో ఒక కాలంలోగాని, ఏకకాలంలో అన్నింటిలోకాని కథ రాయొచ్చు. అంటారు (పేజీ. 121)
ఈ పుస్తకం చివర ఉపయుక్త కథా సంకలనాలు, పుస్తకాల పట్టిక ఇవ్వడం కథకులకో దారిదీపం లాంటిది. మానవత, మత సామరస్యం, సామాజిక అంతరాలు, కొందరు మనుషుల్లో డొల్లతనం, మానవ సంబంధాలు, ప్రేమలు, విశ్వాసాలు, మత ఘర్షణ, పర్యావరణం, ప్రపంచీకరణ విధ్వంసం, పల్లె సంస్కృతి, పట్నం గాగరికతల ప్రభావాలు, స్త్రీల సమస్యలు, అణగారిన పేదలపై పెత్తందార్ల దౌష్ట్యం, పోరాట గాధలు, పలు ఉద్యమాలు... కథా వస్తువులై బలమైన సాహిత్య సృజనకు తెలంగాణ కథ ఎలా కేంద్ర బిందువుగా ఉండో ఈ చిన్న పుస్తకంలో పెద్ద సందేశంగా అక్షరీకరించిన స్వామి కృషి బహు ప్రశంసనీయం.
1892 భండారి అచ్చమాంబ 'గుణవతియగు స్త్రీ' నుంచి కథ మొదలు పెట్టి మాడపాటి హన్మంతరావు, భాగ్యరెడ్డి వర్మ, నెల్లూరి కేశవస్వామి, ఇల్లెందుల సరస్వతి, బిఎన్ శాస్త్రి, ఆదిరాజు వీరభద్రరావు, పి.వి.నర్సింహారావు, బిఎన్‌రెడ్డి, సురవరం, ఎల్లా ప్రగడ సీతాకుమారి, భాస్కరభట్ల కృష్ణారావు, కాళోజి, కాంచనపల్లి చినవెంకట రామారావు, హీరాలాల్, జాతశ్రీ పొట్టపల్లి రామారావు, ఇలివెంటి కృష్ణమూర్తి, దాశరథి, ప్వేరాం జగన్నాథం, వట్టికోట, తాడిగిరి పోతరాజు లాంటి ఆనాటి కథకుల నుంచి నేటి తరం యువ రచయితల కథల దాకా... కథల విశ్లేషణ ఓ చిన్న పాఠ్య గ్రంథంలా రాసారు స్వామి. వీరి కృషి అభినందనీయం. కాబోయే కథా రచయితలకు చక్కటి కరదీపిక.
- తంగిరాల చక్రవర్తి , 9393804472
'కాలిబాటలు'
రచన : డా|| బి.వి.ఎన్.స్వామి
పేజలు : 133, వెల : రూ. 150/-,
ప్రతులకు : తెలంగాణ పబ్లికేషన్స్
మొదటి అంతస్తు, ఇ.నెం. 1-1-80/15,
ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదారాబాద్ - 020
సెల్ : 8639972160