Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధిపేట కేంద్రంగా ఇవ్వాళ్ళ తెలంగాణలో బాల సాహిత్య వికాసం విరివిగా జరుగుతోంది. విద్వత్కవి శ్రీమాన్ వేముగంటి వారు మొదలుకుని బుడిబుడి అడుగుల శ్రీజ వరకు ఈ వికాసోద్యమం సాగుతోంది. బాల సాహిత్యానికి పెట్టని కోట సిద్ధిపేట అన్నది నిజం. బాల సాహిత్య రచన, వికాసంతోపాటు విలక్షణ కార్యక్రమాల నిర్వహణ, తోటి బాల సాహితీవేత్తలను సముచిత రీతిలో సత్కరించే సహృదయత వెరిసి బాల సాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు.
పెందోట వెంకటేశ్వర్లు నేటి సిద్ధిపేట జిల్లా బద్దిపడగలో 11 నవంబర్, 1965న పుట్టారు. అనసూయ, ఆనందయాచారి వీరి అమ్మా నాన్నలు. బాల్యం, విద్యాభాస్యం బద్ధిపడగలో సాగగా, ఉన్నత విద్య సిద్ధిపేటలో, ఎం.ఏ తెలుగు కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి, టీచర్ ట్రైనింగ్ శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేశారు. పద్యం, గేయం, వచన కవిత, కథ, సాహిత్య విమర్శతో పాటు బాల సాహిత్య పరామర్శ పెందోట సాహిత్య సృజనలో ఉన్నాయి. నలబై ఒక్క రచనలు చేసిన పెందోట బాల సాహిత్యాన్ని ఎంతగా రాశారో అంతే ఇతర ప్రక్రియలు రూపాల్లోనూ రాశి పోశారు. 2010 నుంచి నేటి వరకు పదకొండ వచన కవితా సంపుటాలు తెచ్చారు, అవి, 'ఆశల పరువళ్ళు, మానవ కెటాలు, కవితా ప్రభంజనం, పాలపిట్ట పదాలు, అడుగుజాడలు, మధుర ఫలాలు, రామాయణ పాత్రల విశిష్టత, మూడు ముళ్ళు, తెలంగాణ వైభవం. విజ్ఞాన పుష్పాలు, చేదబావి మొదలైనవి. పద్యంలో పెందోటది చేయి తిరిగిన కలం, 'వేంకటేశ శతకం, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, విశ్వబాల శతకం, సిద్ధిపేట శతకం, విజయాలతోట శతకం, జయగణేశ శతకం, బద్దిపడగ శతకం' వీరి రచనల్లో ఉన్నాయి.
బాలసాహిత్య రచనలోనూ పెందటది పెద్ద భాగస్వామ్యం, బంగారం పని చేసే నేపథ్యం నుండి వచ్చిన కవి కథా, బాలలకు బంగారమసోంటి పుస్తకాలను కానుకలుగా అందించాడాయన. వాటిలో కథా సంపుటాలు, విమర్శ, గేయాలతో పాటు ఇతర రూపాల్లో రాసిన రచనలు ఉన్నాయి. 'చిలుక స్నేహం, విచిత్ర స్నేహం, విచిత్ర స్నేహం, చీమ-ఉడత కథా సంపుటాలు. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర, కొమురం భీమ్ జీవిత చరిత్ర బాలల కోసం పెందోట వెంకటేశర్లు రాసిన జీవిత కథలు. 'బాల సాహిత్య వైశిష్ట్యం' ఈయన రాసిన బాల సాహిత్య, బాలసాహితీవేత్తల పరిచయాల విశేష వ్యాసాల సంపుటి. ఇంకా 'చిన్న బాలశిక్ష', 'సూక్తుల తోరణం' వంటివి వీరి రచనలు.
బాల గేయాల రచనలోనూ పెందోట తనదైన ముద్రను వేశారు. ఇప్పటికి పది గేయ సంపుటాలు అచ్చయ్యాయి, మరో నాలుగు సిద్ధంగాఆ న్నాయి. 'వెన్నెల చినుకులు, ప్రభాత కిరణాలు, ఆట-పాట, విజయ పథం, అమృతధారలు, ఇంద్ర ధనస్సు, బాల చైతన్యం, సృజన చెలిమి, చక్కర గోలీలు, బాల సూర్యులు' వీరి గేయ సంపుటాలు. పేందోట బాల సాహితీ వేత్తలు, వికాసకారులు ఎవ్వరూ చేయని ఒక గొప్పపని తన ప్రతి పుస్తకంలో చేస్తాడు, అది తన ప్రతి రచనల సంపుటిలో తన బడిలో, లేదా ఊరిలోని కొందరు బడి పిల్లల రచనలు అచ్చువేయడం. ఇది సాదారణమైన విషయం ఏమీ కాదు. గొప్ప సంస్కృతికి, సహృదయతకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ స్ఫూÛర్తితో ఎందరో బాలల రచయితలు, కవులుగా తమ రచనలు చేస్తున్నారు.
బాల వికాసకారునిగా పిల్లల కోసం పలు సృజనాత్మక రచనా కార్యశాలలు నిర్వహించిన పెందోట బాలల రచనల సంకలనాలు అచ్చువేశారు సంపాదకులుగా. వాలిలో ప్రధానమైనవి, 'చిట్టి కలాలు, చిన్ని గళాలు', 'మర్కూక్ మాణిక్యాలు' కథా మందారాలు'. తన చేసిన పనులకు ఉత్తమ సాహితీవేత్త పురస్కారం, దాశరథి పురస్కారం, గురజాడ ఫౌండూషన్, కృషి కవిత వారి సాహిత్య పురస్కారం, హరితహార సాహిత్య పురస్కారం, మెదక్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వంటివి అందుకున్నారు.
'ముసిరె ముసిరె మబ్బులు ముసిరె' అంటూ వానను, వాన మబ్బులను వర్ణించిన పెందోట పిల్లల కోసం సరళసుదరంగా గేయాలు కూరుస్తారు. 'విద్యార్థీ మేలుకో/ కాలాన్నే పట్టుకో' అంటూ హితం పలుకుతాడు. తాను ఉపాధ్యాయుడు కదా, పిల్లల కోసం ఆ గురువుల గురించి చక్కని గేయం రాశారు. 'గురువుల సన్నిధి/ విజ్ఞానాల పెన్నిధి / ఆచరణే గొప్పది / విజయాలకు పునాది' అంటారు. 'పిల్లలం బడి పిల్లలం / ఆటలాడే వారలం / అల్లని చేసే వారలం... / మేం పుస్తకాలనే చదివేస్తాం / పరీక్షలల్లో నెగ్గేస్తాం' అంటూనే'.. భావి గురువుల మవుతాం' అంటూ ఎంతో చక్కగా ఆశాభావాన్ని వ్యక్తం చేయిస్తారు. పిల్లల కోసం వందలాది గేయాలు, పొడుపు కథలు, పాటలు, వ్యాసాలు, నాటికలు, కథలు రాసిన పెందోట పిల్లల కోసం రాసే వారికి పేందోట బాల సాహిత్య పురస్కారంతో పాటు మరి కొఇ్న పురస్కారాలిచ్చి గౌరవిస్తారు. సిద్ధిపేట బాలల పూదోటకు అభినందనలు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548