Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎ.సి. గది
డిమ్ లైట్
గోడ మీద గడియారం
ఓ పక్కన మంచం
దాని మీద మెత్తటి పరుపు.
ఆ పరుపుపై మహామంత్రి లత్కోర్.
రాత్రి రెండు కొట్టింది. ఎంతకీ అతనికి నిద్ర పట్టడం లేదు. మహామంత్రికి నిద్రపట్టడం లేదని గడియారం ముల్లు తిరక్కుండా ఊరుకుంటుందా? దాని మానాన అది తిరుగుతూనే ఉంది. గుండె ఆగితే ఊపిరాడదు. గడియారం చెడితే ముల్లు తిరగదు. అది తిరిగినా తిరగకున్నా కాలం మాత్రం ఆగదు. అది నడుస్తూనే ఉంటుంది.
ఫలానా మహాముని ఆగు అనగానే కాలం ఆగిపోయింది.
ఫలానా పతివ్రతా శిరోమణి పాట పాడగానే కాలం నిలిచిపోయింది. ఇలాంటివి పురాణ కతల్లో ఉన్నాయి. ఆ కతలు లత్కోర్‌కు గుర్తుకొచ్చాయి.
నేనేం తక్కువా అని అతను కాలాన్ని ఆగమన్నాడు. కాలం అతని మాట వినలేదు. మాటతో ఫాయిదా లేకుండా పోయింది. పాటతో చెప్పి చూస్తానని అతను అనుకున్నాడు. అనుకుని 'రుక్ జా ఓ జానే వాలి రుక్ జా' అంటూ పాటందుకున్నాడు. పాటను కూడా కాలం పెడచెవిన పెట్టింది. కాలం ఆగితే అతనికేం లాభమంటే లాభమే మరి. ఎల్లకాలం అతనే మహామంత్రిగా ఉండొచ్చు.
'అన్ని దాహాలను మించినది అధికార దాహం'
ఎందుకన్నా మంచిది ఈ సారి రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలి. నాకత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేలలో ఎవర్నో ఒకర్ని తన స్థానాన్ని నాకనుకూలంగా వదులుకోమని చెప్పాలి. అలా చేస్తే ఎమ్మెల్సీని చేస్తానని హామీ ఇవ్వాలి. నా మనుషులకే ఎమ్మెల్యే టిక్కెట్లు వచ్చేలా చూడాలి. మా బొచ్చెపార్టీలో కొందరు ముఖ్యంగా పార్టీ అధ్యక్షునికి మహామంత్రి పదవిపై కన్ను పడింది. అతని కన్ను ఎలా చిదిమేయాలి?
ఈ సారి ఎక్కడ నుంచి దంగలకు దిగాలి.
ఏ పథకాలను ఎరగా వేసి జెనాలను బోనులో పెట్టాలి.
ఏ మాటల మామిడి పళ్లతో మాయచెయ్యాలి.
ఎలాంటి మందు బుడ్డీలిచ్చి నిప్పుల్లోకి దించాలి.
ఏం చేసి మళ్లీ మిద్దెనెక్కాలి?
ఇలాంటి ఆలోచనల్లో లత్కోర్ మునిగాడు.
ఒక పక్క కాలమే కాదు, మరో పక్క మహామంత్రి ఆలోచనలూ ఆగలేదు. ఆగని ఈ రెండు రైళ్ల మధ్య అతను నలిగాడు. నలిగి, నలిగి ఆఖరికి రెండు పెగ్గులు దివ్యౌషుదం సేవించి నిద్రలోకి జారాడు.
పేరు : పేనయ్య
ఊరు : ఉత్తలూరు
చదువు : అంతంత మాత్రం
వృత్తి : ప్రజాసేవ
అతను బొచ్చెపార్టీ నాయకుడు. మనసుపడి లక్ష్మీదేవి అతని దగ్గరే ఉండిపోయింది.
ఆ నియోజకవర్గంలో అతనికి పలుకుబడి ఉంది. అతను తగవులు తీరుస్తుంటాడు. పైరవీలు చేస్తుంటాడు. అవే అతను చేసే ప్రజాసేవ. ఈ సారి కూడా తమ పార్టీయే అధికారంలోకి వస్తుందనే నమ్మకం అతనికుంది. నమ్మకమంటే అలాంటి ఇలాంటి నమ్మకం కాదు. వెయ్యి సుత్తులతో కొట్టినా పగలని నమ్మకం.
పేనయ్య గ్రామ సర్పంచి కావాలనుకుంటే సులభంగా అయ్యేవాడు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయ్యే ఉద్దేశమే ఉంటే ఛారు తాగినంత తేలిగ్గా ఆ పదవి కొట్టేసేవాడు. అతి సులభంగా జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాడు. కానీ వాటిమీద అతనికి మోజులేదు. ఒక్కో మెట్టు ఎక్కడానికి అతను వ్యతిరేకం. కింది మెట్టు ఎక్కకుండానే పై మెట్టు ఎక్కడమే అతని లక్ష్యం. అంచెలంచలుగా ఎదగకుండా ఏకంగా ఎమ్మెల్యే కావడానికి అతను ప్రయత్నిస్తుంటాడు. ఎమ్మెల్యే కాకుండా మంత్రి లేదా మహామంత్రి అయ్యే అవకాశముంటే మంత్రి పదవి కోసం అతను ప్రయత్నించే వాడు కాదు. డైరెక్టుగా మహామంత్రి పదవి కోసమే బరిలో దిగేవాడు.
'పోయినసారి పప్పేశ్వర్ మా నియోజక వర్గం నుంచి మా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసాడు. కానీ ఓడిపోయాడు. ఈసారి అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే సూచనలు లేవు. ప్రయత్నిస్తే నాకు టికెట్ దొరుకుతుంది. దాని కోసం పార్టీ ఆఫీసుకు వెళ్లాలి. ఒక్కణ్నే వెళితే కాదు. లారీల్లో జనాన్ని తీసుకుని వెళ్లాలి' అని పేనయ్య అనుకున్నాడు.
ఐదు లారీల్ని అతను కిరాయికి తీసుకున్నాడు.
చుట్టుపక్కల గ్రామాల్లోని కూలీలను పిలిపించాడు.
తలా ఐదు వందలిచ్చాడు.
రూపాయలే కాకుండా బిర్యానీ పొట్లాలు పంచాడు.
తలా ఒక క్వార్టర్ బాటిల్ ఇచ్చాడు.
అందరి మెళ్లో పార్టీ కండువా వేసాడు.
లారీల ముందు పార్టీ జెండాలు కట్టించాడు.
అందర్నీ వెంటబెట్టుకుని అమ్మో నగరంలోని పార్టీ ఆఫీస్‌కు వెళ్లాడు.
వెంట వచ్చిన జెనాలు 'జిందాబాద్' అని నినాదాలు చేస్తుండగా పేనయ్య పార్టీ ఆఫీస్‌లోకి అడుగు పెట్టాడు. బొచ్చెపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనందరావు దగ్గరకు వెళ్లాడు.
''నమస్తే అన్నా!'' అని అన్నాడు.
''నమస్తే ఏమిటిలా వొచ్చావు'' అని నవ్వుతూ ఆనందరావు అడిగాడు.
''నేను ఎందుకొచ్చిననో మీకు ఎర్కలేదా?''
అతనెందుకొచ్చాడో తెలిసినా తెలియనట్లే నటిస్తూ-
''నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది?''
అగ్గిపెట్టెకొచ్చి సిగరెట్ దాచడమెందుకని -
''ఎమ్మెల్యే టికెట్ కోసం'' అని పేనయ్య చెప్పాడు.
''నీకు టికెట్ ఎందుకయ్యా?''
''జెనంకు సేవ జేసెతంద్కు''
''ఇప్పుడు నువ్వు ప్రజా సేవ చేయడం లేదా?''
''చేస్తున్న''
''చేస్తుంటే ఎమ్మెల్యే టికెట్ ఎందుకు?''
''గిప్పటికన్న ఎక్వ ప్రజా సేవ జేసెతంద్కు''
''ఓట్లు కొనడానికి నీ దగ్గర కోట్లు ఉన్నాయా?''
''ఉన్నరు''
''రిగ్గింగ్ చెయ్యడానికి మనుషులున్నారా?''
''నా ఎన్క ఎంతో మంది గూండగాల్లు, రౌడిలున్నరు''
''నీ మీద ఏమైనా కేసులున్నాయా?''
''రొండు మర్డర్ కేసులున్నరు''
''ఎప్పుడైనా జైలుకెళ్లావా?''
''మస్తు సార్లు బోయిన''
''శభాష్. నిశ్చింతగా ఉండు. నీకు తప్పకుండా టికెట్ ఇప్పిస్తాను.''
''మీరు ఇప్పిస్త అని అన్నరంటే నాకు టికెట్ వొచ్చినట్లే. నన్ను ప్రచారం జేస్కోమంటరా?'' అని పేనయ్య అడిగాడు.
''అది కూడా అడగాలా?''
పేనయ్య మొహం న్యూస్ పేపరంతయ్యింది. నీటి మీది పడవలా తేలిపోతూ పార్టీ ఆఫీస్ నుంచి అతను బయటపడ్డడు. బొటనవేలు పైకెత్తి పని అయినట్లు సైగ చేసాడు. దాంతో అతని వెంట వచ్చిన జనం 'పేనయ్య జిందాబాద్' అంటూ హోరెత్తారు.
అతను పదవిరాక ముందు నాయకుడు. వచ్చేక వినాయకుడు. అతనే బొచ్చో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. పేరు బాకారావు. అతను ఏ నాయకునికి ఆ బాకా ఊదుతుంటాడు. లత్కోర్ ఏ పని చేసినా ఆహా ఓహో అంటాడు. అంతరిక్షానికి ఎత్తేస్తాడు. మందంగా మస్కా పూస్తాడు. ఆ కారణంగా అతను మహామంత్రికి దగ్గరివాడయ్యాడు. ఎంత దగ్గరి వాడయ్యాడంటే ఏ పని చెయ్యాలన్నా లత్కోర్ అతని సలహా తీసుకుంటాడు. లత్కోర్తో పనిబడ్డ వాళ్లు ముందుగా అతణ్నే కలుస్తారు. అతను ఎంత అడిగితే అంత ముట్టజెప్తారు. దాంట్లో మహామంత్రికి కొంతిచ్చి మిగతాది అతను నొక్కేస్తుంటాడు
- తెలిదేవర భానుమూర్తి
99591 50491
తరువాయి వచ్చేవారం...