Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వచ్చే వచ్చే రైలూ బండీ-బండీలోనా మామా వచ్చే / వచ్చిన మామా టీవీ తెచ్చే-టీవీలోనా బొమ్మ వచ్చే/ బొమ్మా పేరు అచ్చమ్మ - నా పేరు బుచ్చమ్మ' అన్న గేయం బాల గేయాల్ని వింటున్న, చదువుతున్న వాళ్ళకు ఈ పాట బాగా పరిచయం. మన ఇంట్లో, బడుల్లో చిన్న పిల్లలు తమ బుజ్జి పలుకులతో పాడుతుంటే విన్న, వీడియోల్లో చూసిన జ్ఞాపకం. దీనిని రాసింది నిరంతర బోధకుడు, గత మూడు దశాబ్ధాలుగా కోయ, గొండీ భాషల్లో బాల సాహిత్య సృజనను ఒక పనిగా చేపట్టి ఆయా భాషల వారితో పనిచేస్తున్న వ్యక్తి, బాల సాహిత్య, వికాస కార్యకర్త గంగదేవు యాదయ్య.
పిల్లల కోసం పనిచేస్తున్న యాదయ్య అరవై ఒక్క సంవత్సరాల కింద నేటి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గొల్నేపల్లిలో పుట్టిండు. అమ్మా యాన్నలు పెంటమ్మ, రాజయ్య. తొలి చదువు ఊరిలో స్వగ్రామంలో సాగింది. దానికి కూరెళ్ళ విఠలాచార్య ప్రాపకం దొరికింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందిండు. గత ఇరవై ఐదేండ్లుగా పిల్లల కోసం సృజనశాలలు నిర్వహిస్తూ పాటలు రాసున్న యాదయ్య, తన సగం వయసును విద్యా గంధం నోచుకోని అడవి బిడ్డల కోసం వెచ్చించి వాళ్ళు సులువుగా చదువుకునేం దుకు ఎన్నో ప్రయోగాలు చేసాడు. ఒక విద్యా సంవత్సరంలోనే రాయడం, చదవడం నేర్పి వారిని పదవ తరగతిలో ప్రవేశం కల్పించేట్టు చేయడం మామూలు విషయం కాదు. సమాజాన్ని ప్రతి నిత్యం లోతుగా అధ్యయనం చేస్తున్న యాదయ్య బాలల కోసం వందలాది గేయాలు రాశారు.
బాల సాహిత్యమేకాక యాదయ్య ఇతర అనేక గిరిజన భాషాకారులతో పనిచేశాడు. ఆ సందర్భంగా వచ్చిన పుస్తకాలలో వీరి భాగస్వామ్యం, భూమిక ఉంది. వాటిలో 'మూడు తెలుగు వాచకాలు', తెలుగు లిపితో కోయ భాషలో రెండు పిల్లల కథల పుస్తకాలు, ఇరవై రెండు గేయాల పుస్తకాలు వచ్చాయి. ఇవేకాక ఇదే పద్ధతిలో ఇరవై రెండు పొడుపు కథలు, కొండరెడ్ల మాండలికంలో తెలుగు లిపిలో కథలు, గేయాలు, పొడుపు కథల మూడు పుస్తకాలు తెచ్చారు. తొలినాళ్ళ నుంచి యాదయ్య వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తూ వస్తున్నారు.
గంగదేవు యాదయ్య తన పాటలను మనోవికాసంతో పాటు వైజ్ఞానిక చేతనను కలిగించేందుకు ఒక వాహికగా మలచుకుని అందుకు తగినట్టుగా మలు స్తాడు. పిల్లలకు బోధించాల్సిన అనేక అంశాలు ఈయన పాటల్లో అనేకం చూడోచ్చు. బడికి వచ్చే పిల్లలకు మొదట ఆటపాటలు నేర్పి బడి పట్ల ఆసక్తిని కలిగించాలన్నది యాదయ్య తపన. ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నాల ఫలితమే 'ఉయ్యాలా జంపాలా'. పిల్లల మనస్తత్వానికి దగ్గరగా, ఆసక్తి కలిగించే లయతో సాగడం యాదయ్య పాటల్లోని జీవగుణం.
'ఎల్లిపాయె ఉల్లిపాయ/ మా మామ ఎల్లిపాయె/ మా అత్త మల్లిపాయె / మా తాత మురిసిపాయె/ పిచ్చికుక్క కరిసి పాయె/ దవాఖానాకు ఉరుకుడాయె/ బొడ్డు చుట్టు సూదులాయె' ఇది గంగదేవు యాదయ్య ఎత్తుగడ. ఇందులోని పదాలన్నీ మనకు తెలిసినవే. లేలేత మనసుగల చిన్నారి బాలబాలికల మీద బలవంతంగా దేనిని రుద్ధకూడదు, అది చదువైనా, మరోటైనా అనేది యాదయ్యకు బాగా తెలుసు. పిల్లలకు వాళ్ళకు తెలిసిన వాటిని గేయంగా వాళ్ళకు నచ్చినట్టు చెబితే వింటా రని ఆశ. 'రాజులు' పాట అటువంటిదే. 'ఆశకు నక్క రాజు/ పొగరుకు పులిరాజు/ వగరుకు వక్క రాజు/ వాగుడుకు వస రాజు/ పులుపుకు చింతరాజు/ తీపికి తేనె రాజు/ రుచికి ఉప్పు రాజు/ బలానికి పప్పు రాజు/ పగటికి సూర్యుండు రాజు/ రాత్రికి చంద్రుండు రాజు/ ఈ పద్యానికి నేనే రాజు.. నేనే.. రాజు'. పిల్లలకు అర్థం కాని పదం కాని విషయం కానీ ఈ పాటలో లేదు. అవును మరి, మంచిమాటలను, విషయాలను పిల్లలకు నేరుగా చెప్పటం కంటే గేయంగానో, కథగానో, పాటగానో, చిత్రంగానో చెబితే వెంటనే వారి బుర్రల్లోకి ఎక్కడమే కాక ఎప్పటికీ యాదికుంటాయి. యాదయ్య చేసింది, చేస్తున్నది ఇదే మరి. తమచుట్టూ ఉండే పరిసరాలను, వాతా వరణాన్ని, విజ్ఞానాంశాల్ని పాటలుగా పరి చయం చేసే యాదయ్య నిరంతరం పిల్లలతో మమేకమయ్యేవాడు. 'లేలేత మొగ్గ / విచ్చితే పువ్వు / కాసితే కాయ / మక్కితే పండు / తింటే తియ్యన / నీకింత ఇయ్యనా' వంటివి అందుకు ఉదాహ రణలు. పాఠాలను పాటలుగా చెప్పడం అనేది ఒక రసవిద్య. అందులోనూ విజ్ఞాన శాస్త్రాంశాల్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పడం మరీ కష్టం. దానిని, 'భూమి ఎంతో పెద్దదీ/ చుక్క ఎంతో చిన్నదీ/ చుక్క వరకు వెళ్లి చూస్తే/ చుక్క ఎంతో పెద్దది/ భూమి ఎంతో చిన్నది' దీనిని ఇంతకు సులభంగా చెప్పడం ఏ శాస్త్రవేత్తకూ సాధ్యం కాదేమో మరి. ఇటు వంటిదే ఇందులోని మరో పాట 'చారెడు కండ్లు'. మనకు తెలిసిన సామెతలు, విషయాలను పాటలుగా పరిచయం చేయడం కూడా యాదయ్యకు తెలుసు. 'ఇల్లూ ఇల్లూ తిరుగు / ఇడ్సీ ఇడ్సీ మొరుగు / వాడా యాదయ్య పాటలు పిల్లగాలుల్లా అనిపించినా మార్పును కోరుకుని వీచే కొండగాలి లాంటివాడు. అది ఆయన పాటల్లో తెలుస్తుంది. పద్మశ్రీ శాంతా సిన్హా 'ఉయ్యాలా.. జంపాలా'ను 'ఒక్కసారికాదు.. వందసార్లు, వెయ్యిసార్లు చదవండి... చదివించండి' అంటారు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548