Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరుడు కురిసిన వెన్నెలనీ, ఆ వెన్నెలలోని చల్లదనాన్ని ఇప్పుడు ఆత్మీయంగా మనకు అందిస్తున్నారు ప్రముఖ రచయిత జిల్లేళ్ళ బాలాజీ. ప్రొటాగొనిస్ట్స్ (వైతాళికులు) ఎప్పుడూ, సమూహంలో ఉంటూనే ఆ ఆలోచనలకు భిన్నంగా ఆలోచిస్తూ వుంటాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లు- 'ఇవ్వాళ ఏదీ కూడా సాధారణంగా లేవు(దు). నశించిపోతున్న విలువలు, యాంత్రికమైన జీవన విధానాలు, కనుమరుగవుతున్న మానవ సంబంధాలు మనిషిని పతనావస్థ వైపు తీసుకువెళ్తున్నాయి. సమాజంలో జరుగుతున్న సంఘటనలు, దృశ్యాలు, పాత పోకడలు మనసును బాధించినపుడు వాటిని కథలుగా రాయటానికి ప్రయత్నిస్తుంటాను'' - అంటారు జిలెళ్ల. అవును ఇతని కథల్లో విలక్షణత ఉంటుంది. సమాజపు 'మూస' ఆలోచనలకు భిన్నంగా ఉండే నిర్ణయాత్మక కథలు రాస్తాడు. ఎదురయ్యే ప్రతి ప్రతికూలతను అనుకూలతగా మార్చుకునే నైపుణ్యం ఈ రచయితకు ఉంది.అందులోనుంచి పుట్టుకొచ్చినదే 'నిరుడు కురిసిన వెన్నెల'.
తమిళనాడులోని తిరుత్తణిలో ఉండాల్సిన అగత్యం ఏర్పడినపుడు, తమిళం నేర్చుకు న్నాడు. తమిళ పత్రికలు సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఫలితంగా ప్రసిద్ధ తమిళ రచయిత జయకాంతన్ నవలలను తెలుగులోకి అనువదించి, అటు మూల రచయిత ప్రశంసను, ఇటు తెలుగు పాఠకులే కాదు, సాహిత్య అకాడమీ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. 'ఇట్స్ నాట్ ఏ ట్రాన్స్లేషన్... ఇట్స్ ఏ ట్రాన్స్‌క్రియేషన్' అనిపించుకున్నాడు రచయిత అంతేకాదు, ఉత్తమ అనువాదకుడిగా ''నల్లి - దిశై ఎట్టుం'' పత్రికా అవార్డును కూడా అందుకున్నాడు బాలాజీ.ప్రస్తుత కథా సంపుటి 'నిరుడు కురిసిన వెన్నెల'లో పదిహేను కథలున్నాయి. తన అంతరంగాన్ని, ఆలోచనల్ని పంచుకోవటానికై రెండు ప్రముఖ సంస్థలకిచ్చిన ఇంటర్వ్యూలను కూడా ఇచ్చారు.వీటిలో తాను తన రచనల్లో, ప్రత్యక్షంగా చెప్పుకోలేనివి, చెప్పాలనుకున్నవి ఇవ్వటం చాలా బాగుంది. తాను ఏ ప్రయోజనాన్ని ఆశించి రచనలు చెయ్యనంటూనే (పేజీ 88) సంపుటిలో ఇచ్చిన ప్రతి కథ వెనుక నిస్తేజం కాని నిర్ణయాలు ఇస్తూ, పాఠకులను ఆలోచనలలో పడవేశాడు.
అనవసర వర్ణనలు ప్రతీకాత్మతలతో కాలయాపన చేయకుండా సరాసరి చెప్పదలుచుకున్న విషయంలోకి దిగటం, క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పి ముగించటం బాలాజీ ప్రత్యేకత. 'ఆధారం' కథ (పేజీ 27-29) లో చిత్రహింసలు పెట్టిన భర్త చనిపోతే పుట్టుకతో వచ్చిన పూలుగాజులు, కుంకుమ తీసేయాలని తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తే... ఆ ఆలోచన ఎంతటి అనాగరికమైనదో కొడుకు రాఘవ వివరిస్తుంటే తల్లి జానకి హృదయమే కాదు, చదివిన అందరి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతాయి. ఇలాంటిదే మరో కథ 'ఉమ్మెత్తపూలు'. భర్త చనిపోయిన కమల లోకం దృష్టిలో ఆమె లేనట్టే లెక్క. భర్తతో పాటు దిగిన ఆ దంపతుల ఫొటోకు దండ వేసి ఉంటుంది. 'అయ్యగారితో పాటు మీకూ ఎందుకేశారమ్మా పూలమాల?'' (పేజి. 9) అని ప్రశ్నిస్తూ, తన అయ్య చనిపోతే మరో మనువు చేసుకున్నాడని అమాయకంగా ప్రశ్నిస్తుంది. చదువుకున్న కమల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ 'లాజికల్'గా ఆలోచించి, కమల కళ్ళు తెరిపించి వెళ్తుంది ఆ పదేళ్ళ చిన్నారి. ఈ కథలో మరో సందేశం ఉందనిపిస్తుంది. పెరిగిన కొద్దీ మనుషులు కట్టుబాట్లకు కట్టుబానిసలవుతారు. కట్టుబాట్ల జాడ్యం అంటని పసి మనసులే, పల్లెటూరి మనుషులే నాగరీకులమనుకునే మన కంటే మెరుగ్గా ఆలోచిస్తారన్న సందేశం ఇవ్వబడింది. అన్యాయం జరిగితే బేరుమనకుండా ప్రతీకారం తీర్చుకోవాలని మరో కథ చెబుతుంది. బోల్డ్‌గా ఉంటేనే బతకగలమన్న సంగతి 'మార్పు రా(కా)వాలి' కథ వివరిస్తుంది.1988 నుంచి 2000 సంవత్సరం వరకు వివిధ పత్రికల్లో అచ్చయిన మంచి కథల్ని ఏర్చికూర్చి అందించాడు రచయిత. నిరుడు కురిసినదైనా, నేడు కురుస్తున్నదైనా వెన్నెల ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. రచయితకు అభినందనలు.
నిరుడు కురిసిన వెన్నెల
రచయిత : జిల్లేళ్ల బాలాజీ
పేజీలు : 108
వెల : రూ. 110/-
ప్రతులకు : జిల్లేళ్ల బాలాజీ, ఇం.నెం. 9-535, ఓంశక్తి గుడి పక్క సందులో, లింగేశ్వర నగర్, బైరాగి పట్టెడ, తిరుపతి - 517501
సెల్ : 7382008979, 9866628639
- కూర చిదంబరం, 8639338675