Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామెత తత్వాన్ని బట్టి సూటిగా కొట్టినట్టు చెప్పేది. ఒకరి పని తత్వాన్ని గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే వానికి 'గడియ పురుసత్ లేదు గవ్వ రాకడ లేదు' అనే సామెతను వాడుతారు. ఇక్కడ గడియ అంటే కాలం ఇరవైనాలుగు నిమిషాలకు ఒక గడియ అంటారు. పురుసత్ అంటే విశ్రాంతి అని ఆర్థం.అంటే అర్థగంట కూడా తీరిక లేదు అని. గవ్వ రాకడ లేదు అంటే పైకం. తీరిక లేకుండా తిరుగుతుండు. ఒక్క పైస కూడా వస్త లేదు అన్నట్టు. పల్లెటూర్లలో పనిలేకుండా వాళ్ల వీళ్ల దగ్గరికి తిరిగి పంచాయితీలు చెప్పడం కొందరు చేస్తుంటారు. వాళ్లకు ఎవరూ పైసలివ్వరు కానీ ఎప్పుడు చూసినా బిజీగా కన్పిస్తరు. ఇప్పటి కాలంలో కూడా కొందరు పని లేకుండా తిని తిరిగే వారుంటారు. వీళ్లకు ఈ సామెత కరెక్ట్‌గా సరిపోతుంది.
చేసిన చేతులు శీగ బారుతయి..
చెయ్యని చేతులు చెదలు పడుతయి
పల్లెలో గానీ ఎక్కడైనా గానీ పనిచేసేవాళ్లకే గౌరవం. నిరంతరం ఏదో పనిలో లీనమైన వాళ్లే ఎక్కువ ఉంటారు. అందరూ పనిచేయాలి. తోటబాయి పని, ఇంటిపని ఎన్నో పనుల్లో కలిసిపోతున్నవాళ్లు ఎక్కడికి పోయిన ఏచుట్టూ పోయినా గొడ్డలి ఉంటే కట్టెలు కొడుతరు. అక్కడ ఇల్లు కడుతాంటే నీళ్లు కొడుతరు. ఆడవాళ్ల చేతులైతే ఎక్కడా ఆగవు.పనిచేస్తనే ఉంటయి. ఇలా పనిని ప్రేమించడం కొరకు 'చేసిన చేతలు శీగ బారుతయి' అంటరు. శీగబారుడు అంటే అసలు చెట్లు మాత్రమే శీగ బారుతయి. అంటే గట్టిగా అవడం అన్నమాట. చేతులు పని చేస్తేనే బలంగా ఉంటాయనే దాన్ని బలంగా చెప్పడం. అట్లనే 'చెయ్యని చేతులు చెదలు పడతయి' అంటే పనికి దూరమైన శిశ్రాంతి చేతలు చెదలు పట్టడం. అంటే మట్టి పరుగులు పట్టి చెదలు పట్టి పోవడం అన్నట్టు. ఇక్కడ 'శీగబారటం చెదలు పట్టడం'ను చాలా సింబాలిక్‌గా చెప్పారు. శ్రమను గౌరవించడం శ్రమకు దూరం అయిన వాళ్లను ఇలా చెదలు పట్టడంతో ప్రజలే పోల్చుకున్నారు. జనం జ్ఞానవంతలు.గొప్ప గొప్ప వాక్యాల సృష్టికర్తలు.
- అన్నవరం దేవేందర్