Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1972 నుంచి తెలుగు సాహిత్యంతో, సాహితీ సాంస్కృతిక సంఘాలతో, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పనిచేసిన ఖాజామైనద్దీన్ సీనియర్ కవి, కథకులు. వీరి అర్ధ శతాబ్ది అక్షర కృషికి వీరి పుస్తకాలే నిదర్శనాలు. చెమట ప్రవాహమై పారినా (2016), ఆమె మార్పు ఎజెండా (2022), చల్లారని నిప్పు రవ్వలు (2022), మండుతున్న సూర్యులు, కలాలు సజీవమే లాంటి పుస్తకాల్ని వెలువరించారు. అభ్యుదయ ప్రగతిశీల దృక్పథంతో రచనలు చేసే ఖాజామైనద్దీన్ తెలంగాణ సాహితి ముఖ్య నాయకులు...
బతుకుపుస్తకంలో కులం లేని / అధ్యాయం ఎప్పుడు చేరుతుంది? పశువులకిచ్చిన విలువ / మనిషికివ్వని సంస్కృతి / రాజకీయ మనుధర్మ మంత్రం ! అంటూ అసమాన వ్యవస్థను సూటిగా ప్రశ్నించే ఈ కవి... సావిత్రీ బాయిఫూలే స్ఫూర్తిగా 'ఆమె మార్పు ఎజెండా' అనే కవితా సంకలనాన్ని 2023లో విడుదల చేయనున్నారు. వివిధ పత్రికల్లో పలు సాహిత్య వేదికలపై చదివి ప్రశంసలు, ప్రచురణలు పొందిన కవితలతో 'చల్లారని నిప్పు రవ్వలు' అనే కవిత్వ సంపుటాన్ని 2023లో ఆవిష్కరణ జరుపుకునే ఖాజామైనద్దీన్ నిబద్ధత, నిమగత గల వామపక్ష శ్రేయోభిలాష గల కవి.
స్వాభిమానజండా ఎగరేస్తం / వీరభాషకు గొంతుకలం / క్రాంతి పంచే పాటకు ప్రాణాలం / అని నినదించిన జనం పోరు / ఉద్యమాల చరిత్రకు మొదటిపాఠం' అని చల్లారని అక్షర నిప్పురవ్వలు మండించే ఖాజా కవిత్వం అట్టడుగు శ్రమజీవులకు ఓ భరోసాగా ఉంటుంది.
నేలతల్లి ప్రేమను కోరతాం / ముసాఫిరాలా జీవిస్తాం / ఎక్కడ ఏ అలజడులు జరిగినా / మాపై శీతకన్ను ! ఈ సిల్సిలా ఎంత వరకు ? అని ప్రశ్నించే ఖాజా అన్ని సమాజ రుగ్మతలపై కలంతో కాలంపై అక్షరనిప్పులు కురిపిస్తారు. బలమైన అభివ్యక్తి వీరి కలం సొంతం..
వీరి కవిత్వాన్ని జనజ్వాల, పరిమళ్, వల్లభాపురం జనార్థన లాంటి సాహితీ పెద్దలు శ్లాఘించి ప్రోత్సహించారు. అమృతోత్సవ భారతంలో ఆకలి చావుల్ని, మైనార్టీలపై దాడుల్ని అతివలపై అత్యాచారాల్ని ప్రశ్నించి నిలదీస్తాడు. ''కవి ఉన్నాడు అంటే ఆ రాజ్యంలో రెండో ప్రభుత్వం ఉన్నట్టే'' అంటాడు చలం. ఇంకా వర్తమాన కాలంలోని రుగ్మతలపై కవులు బలంగా ఎంతో రాయాల్సి వుంది. నేడు సెక్యులర్ భారతిలో మతం ముసుగులో సాగే విభజనపై సాహితీ - సాంస్కృతిక యుద్ధంలో 'ఖాజా' ముందుండాలని.. భావ ప్రకటనా పతాకం చేబూని... అభ్యుదయ సాహిత్యోద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించాలని, సాహితీ కార్యకర్తగా, కావ్యకర్తగా ప్రయాణించాలి అని ఆశిస్తూ కవికి అభినందనలతో...
చల్లారని నిప్పురవ్వలు (కవిత్వం)
రచయిత : మహమ్మద్ ఖాజామైనద్దీన్,
పేజీలు : 104, వెల : రూ.50/-
ఆమె మార్పు ఎజండా (కవిత్వం)
పేజీలు : 110, వెల : రూ. 50/-
ప్రతులకు : తెలంగాణ సాహితి ఆఫీసు, ఇం.నెం. 1-10-85/18, షాషాబ్ గుట్ట, మహబూబ్ నగర్, తెలంగాణ రాష్ట్రం.
సెల్ : 9396626276;
నవతెలంగాణ బుక్ హౌస్ అన్ని బ్రాంచీలలో..
- తంగిరాల చక్రవర్తి , 9393804472