Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓరుగల్లు నుండి ఇటీవల పిల్లల కోసం రాస్తున్నవారిలో శ్రీమతి మాదరపు వాణిశ్రీ ఒకరు. బాలల కోసం కథ, నవల, గేయం, కవిత వంటివి రాయడమే కాకుండా ఒకే రోజు ఒకే వేదిక మీద ఆరు పుస్తకాలను ఆవిష్కరించుకున్న రికార్డు వాణిశ్రీది. మాదరపు వాణిశ్రీ కరీంనగర్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 2, 1965న పుట్టింది. రావికంటి శ్యామల- సాంబయ్య అమ్మానాన్నలు. మెట్టినిల్లు హనుమకొండలో మూడున్నర దశాబ్దాలుగా ఉంటున్నారు. మాగెటో థెరపిలో డిప్లమా, పొలిటికల్ సైన్స్‌లో ఎం.ఏ చదివారు.
కథ, కవిత్వంతో పాటు ఇతర సాహితీ రూపాలు, ప్రక్రియల్లో రచనలు చేసిన వాణిశ్రీ ఆధ్యాత్మిక రచనలు కూడా చేశారు. పుస్తకంగా అచ్చయిన వీరి తొలి రచన ఆధ్యాత్మిక రచనయే. అది, 'శ్రీ లక్ష్మీనారాయణస్వామి భజన గీతం'. ఇది పుస్తకంగానే కాక ఆడియో సి.డి రూపంలోనూ వెలువడింది. ఇది అష్టోత్తర శత వాక్య గీతం. 'మనసు పలికే...' మాదరపు వాణిశ్రీ వచన కవితా సంపుటి. కథలను 'పదనిసలు' పేరుతో సంపుటిటా తెచ్చారు. తెలంగాణ ప్రజల పెద్ద పండుగైన బతుకమ్మకు వీరు వెలువరించిన బతుకమ్మ పాటల పుస్తకం 'మా తల్లీ బతుకమ్మ'. ఇందులో హాయిగా పాడుకుంటూ, బతుకమ్మ ఆడుకునేందుకు చక్కని పాటలు ఉన్నాయి.
బాల సాహితీవేత్తగా బాలల కోసం వివిధ రచనలు చేసిన వాణిశ్రీ తిరునగరి వేదాంతసూరి ప్రోత్సాహంతో మొలకలో పిల్లల కోసం 'సరదాగా కాసేపు...' పేరుతో వివిధ రచనలు చేశారు. ఇందులో బాలల మెదడుకు మేతను పెట్టే ప్రహేళికలు, సరదా అయిన సామెతలు, బుద్దులు చెప్పే మంచిమాటలు, లోచింపజేసే తికమకమ ప్రశ్నలు వంటివి ఇందులో రాశారు. బాలలకు ఒక చోట అందించేందుకు వీటన్నింటిని అదే పేరుతో పుస్తకంగా తెచ్చారు వాణిశ్రీ. ప్రస్తుతం కూడా ఈ శీర్షికను యిదే పత్రికల్లో నిర్వహిస్తున్నారు.
బాలల కోసం, వారి బాగుకోసం... సరదాగా పిల్లలు చదువుకుని ఆనందించడం కోసం రాసిన బాలల కథలను 'చిచ్చుబుడ్లు' పేరుతో పుస్తకంగా తెచ్చారు. ఇందులోని కథల చిచ్చుబుడ్లు బాలల మనస్తత్వాలకు అద్దం పట్టడమేకాక ఆనందాన్నిస్తాయి. ఇందులో పిల్లలు ఆనందంగా, సరదాగా చదువుకునే కథలేకాక, పిల్లలను అపహరించే మాఫియా గురించి రాస్తుంది రచయిత్రి. అంతేకాదు బాలలకు చిన్నప్పుడే అన్ని విషయాల అవగాహన కలిగేందుకు విదేశాల్లో ఉండే పిల్లల కోసం పల్లెల్లో ఒంటరిగా తపించే తల్లి తండ్రుల తండ్లాటను కూడా తన కథలో చూపిస్తారు. బాల్యం నుండే భారతీయ జీవనమూలాలకు ఆధ్యమైన భారతం, భాగవతం, రామాయణం వంటివాటిని పిల్లల కుపరిచయం చేయాలన్న తపన, తండ్లాట కూడా వీరి కథల్లో మనకు కనిపిస్తుంది. బాలల కథల పుస్తకాన్ని తన కుమారునికి అంకితం చేయడం రచయిత్రి ఔచిత్యానికి తార్కాణం. అంతేకాదు ఇందులో బాలల దినోత్సవం వంటి వాటి గురించి కూడా ఈ సంపుటిలో ఉన్నాయి. 'తెలివైన గడుగ్గారు', 'మందబుద్ది', 'చిచ్చుబుడ్లు', 'పరుగు' వంటి కథలు సామాజిక స్పృహకు అద్దంపట్టగా, ఇతర కథలన్నీ పిల్లలను సరదాగ చదివిస్తాయి.
పిల్లల కోసం రాసిన వీరి నవల 'సెలవుల్లో పట్నం పిల్లలు'. పట్నం పిల్లలు సెలవుల్లో అమ్మమ్మింటికి వచ్చి అక్కడ జరిగే ఒక ట్రెజర్ హంట్‌లో పాల్గొం టారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పట్ల అవగాహనతో పిల్లలు ఈ గేమ్‌లో విజయం సాధించడం చూపిస్తారు. బాల్యంలోనే బాలలకు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తే కలిగే ఉపయోగాన్ని చెబుతూ సాగుతుందీ బాలల నవల. ఇంకా నీతి నిజాయితీ, మంచితనం వంటివి పిల్లలకు పరిచయం చేస్తారీ నవలలో రచయిత్రి.
రచయిత్రిగా ప్రపంచ తెలుగు మహాసభల సత్కారం మొదలుకుని విశ్వశాంతి సేవా సమితి పురస్కారం, జాగృతి కవితాంజలి పురస్కారం, తెలుగు రక్షణ వేదిక వంటి మరికొన్ని సంస్థల సత్కారాన్ని అందుకున్న వాణిశ్రీ కథలు, నవలలే కాకా పిల్లల కోసం చక్కని బాల గేయాలను కూడా రచించారు. వివిధ పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వీరి బాల గేయాలు వచ్చాయి. 'చిట్టి పొట్టి పాపాలు / చిన్నారి బాలలు' అంటూ వారిని 'పాపపుణ్యాలు తెలియని / పవిత్ర హృదయాలు' అంటూ చెబుతారు. బాలల కోసం చక్కని రచనలు చేస్తున్న ఈ ఓరుగల్లు హరివిల్లు భవిషత్తులో మరిన్ని బాలల రచనలు తెస్తుందని ఆశిద్దాం. జయహో! బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548