Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరి స్వభావాలు గమ్మతి ఉంటయి. మనమేదో సహాయం చేస్తాం అనుకుంటాం. పాపం ఆపదలో ఉన్నడు గదా అని ఏదైనా చేతనైన పని లేదా అవసరమైన రీతిగ ఆదుకుంటాం. దీనిని ఆసర చేసికొని తన పని తాను చేసుకోకుండా మన పనిలో వేలు పెడుతడు లేదా మనమీదనే ఆధిపత్యం చలాయిస్తడు. తనకు సహాయం చేసిన దానికి కృతజ్ఞతపూర్వకంగా కూడా ఉండకుండా ఇదంతా నాదే అట్ల కాదు ఇట్ల చేయాలి అని మనలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళను 'ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నట్టు' వ్యవహరిస్తున్నడు అనే సామెత వాడతరు. ఒక్క సామెతతోనే ఎదుటి వాళ్ళ మనస్తత్వం పూర్తి చెప్తది. ఇట్లాంటోల్లను చూస్తే ఇంకెవ్వరికీ సహాయం చేయబుద్దిగాని పరిస్థితి వస్తుంది. అంటే ఇట్ల అందరు ఉండరు. అక్కడక్కడ అందరికి తారపడుతరు. అట్లని ఎవరికి ఎవరం ఆపతి సంపతిల సహాయం చేసుకోకుండా ఉండలేదు కదా! ఇట్లాంటోల్లే మరికొందరు ఉంటరు. వాళ్ళు మనతోటే ఉంటరు మన సహకారంతోనే జీవనం కొనసాగిస్తరు. ఆఖరుకు మనకే ఎసరుపెట్టే పనులు చేస్తరు. ఇటువంటి వాళ్ళను 'తిన్నింటి వాసాలు లెక్కపెడుతడు' అని అంటరు. అంటే ఈ ఇంట్లనే అన్నం దింటడు. ఇంటి వాసాలు అంటే పైకప్పు అన్నట్టు పై కప్పులో ఎన్ని కట్టెలు ఉన్నయి ఎట్లా కన్నం వేయాలి అనే లెక్క చూస్తడు అనే అర్థంలో వాడుతరు. లేదా పై గూనకప్పు విప్పుకొని లోపలికి దునికి దొంగతనం చేసేవాళ్లు. అంటే ఆ ఇల్లు సంగతి సదరు దొంగకు పూర్తిగ తెలియ లేకుంటే కుదరదు. పగటిపూట రకరకాల వేశాలు వేసుకొని ఇంటి ముందట వాకిట్లో ఇంటి ఆవరణ చూస్తరు. అక్కడే ఆకలి అయితే అన్నం అడుక్కొని తింటరు. వచ్చిందే రాత్రి దొంగ తనంకు రెక్కి నిర్వహి స్తడు. అందుకే ఇటు వంటి వాళ్ల ను వీడు తిన్నింటి వాసాలు లెక్క పెడతడు అని వ్యవహరిస్తారు. ఇదే ఇల్లుకు సంబంధించి మరో సామెత 'ఇల్లు కాలి ఒకడు ఏడుస్తాంటే సుట్టకు అగ్గి కావాలన్నట్టు' అంటరు. సుట్టకు అగ్గి కోసం కాలిన ఇంట్లనే నిప్పులు ఏరుకుంటరు. ఇంక మరో విధంగా కూడా అంటరు. ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయి బాధలో ఇంటివాళ్లు ఏడుస్తుంటే ఇంకో ఆయన ఆ బాధలో పాలుపంచుకోకుండా అరే సుట్ట తాగేందుకు నిప్పులే దొనరతయి అని సంబరపడితే ఎట్లా ఉంటది. పూర్వం అగ్గిపెట్టెలు లేని కాలంలో చుట్టలు బీడీలు అంటుపెట్టుకునేందుకు ఎవరింటికైననా వెళ్ళి నిప్పులు తెచ్చుకునేది. ఏ సందర్భం సమయం లేకుండా తన స్వార్థమే చూసుకునేవాళ్ళను ఇల్లుకాలి ఒకడు ఏడుస్తుంటే... అంటరు.
- అన్నవరం దేవేందర్, 9440763479