Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అటు గద్వాలిటు చెన్నపట్టణము' అంటూ మహాకవులు గర్వంగా చెప్పుకున్న 'విద్వత్ గద్వాల' గురించి తెలియని సాహితీవేత్త ఉండడు. తెలంగాణ సాహిత్య చరిత్రలో గద్వాల విద్వత్ కవులకు, విద్వాంసులకు ఆలవాలంగా విలసిల్లింది. అంతే కాదు చేనేత సిరులకు నిలయమై వెలుగుతోంది. కవి, రచయిత, కార్యకర్త శ్రీ తిరుమల వెంకటస్వామి సెప్టేంబర్ 19, 1954న పుట్టారు, వీరి తల్లితండ్రుల ముద్దమ్మ- రామలక్ష్మణ. గద్వాలలో పుట్టి పెరిగి అక్కడి అందాల నేతలాగే, బాలలకు బంగారపు రాతను చిట్టి కథలుగా అందించిన ఆసామి శ్రీ తిరుమల వెంకటస్వామి.
కృష్ణా తీరం నుంచి బాల సాహిత్యాన్నే కాదు, చక్కని ప్రౌఢ సాహిత్యాన్ని అందించిన కవి, రచయిత, జాతీయ పరిషత్తు కార్యకర్త, నాటకకర్త, నవలాకారులు వెంకటస్వామి. కవిగా 1969లో ఆకాశవాణి ద్వారా ఆరంగేట్రం చేసిన వీరు ఆకాశవాణి ద్వారానే నాటక రచయితగా, కవిగా, రచయితగా పరిచయం అయ్యారు. తొలి పుస్తకం 'చిట్టి శతకం' అచ్చయ్యింది. రెండవ పుస్తకం 'కవితా ఝరి' ఇది వచన కవితా సంపుటి. మూడవ పుస్తకం పేరు కూడా 'చిట్టి శతకం', అయితే యిది వేయి వచన పద్యాల కవతా సంపుటి. నాల్గవ పుస్తం 2011లో వచ్చిన 'కవితా స్రవంతి'. అయిదవ పుస్తకంగా 'ఈ భక్తులు మాకొద్దు' నాటిక, 'చిలుక పలుకులు', 'సౌగంధికాలు', 'వినాయక 'చెవి' తిరు', 'మా వూరి దేవుడు', 'మురిసిన మనుషులు', 'వ్యాస తులసి', 'పితృ దేవతలు', 'సారస్వత యజ్ఞం', 'వనితా విత్తోపనిషత్తు', 'మార్గదర్శి' మొదలగు 21 నవలలు, నాటికలు, కవిత్వం, వ్యాసాలు వీరి రచనలు.
వృత్తిరీత్యా పాఠశాల నిర్వాహకునిగా నిరంతరం పిల్లలతోనే ఉండే వెంకటస్వామి ఆ పిల్లల కోసం, వారి సర్వతోవృద్ధికి తోడ్పడే విధంగా బడిలో పాఠాలు చెప్పడంతో పాటు వాళ్ళ కోసం పాటలు, గేయాలు రాశారు. కథలు చెప్పారు, కథలు రాశారు. ఆ కథలను మన చిన్నారి బాలబాలికలలకు 'చిట్టి కథలు' పేరుతో తాయిలంగా అందించారు. అలాగే నాటికలను 'చిట్టి నాటికలు' గా తెచ్చారు. విద్యా సంస్థ నిర్వాహకునిగా బడి నిర్వహణలోని సాధకబాధకాలు, మంచి చెడ్డలు తెలిసిన వీరు తన చిట్టి కథల్లో చిన్నారి పిల్లలతో పాటు తల్లితండ్రులు, ఉపాధ్యాయులను కదిలించే అంశాలను కూడా తన రచనల్లో చేర్చారు. అందుకు ఈ నలభైమూడు కథల వయ్యిలోని అనేక కథలు నిదర్శనంగా నిలుస్తాయి.
తిరుమల వెంకటస్వామి చిట్టి కథలన్నీ చిట్టి పొట్టి చిన్నారులకు సంబంధించినవే. తల్లి తండ్రులు తమ పిల్లలను బడికి వెళ్ళి చదువకునేందుకు ప్రోత్సహించలని ఒక కథ చెబితే మరో కథ విద్యార్థులు చెడు సంగతులకు వెళ్ళకుండా, గురవు మీద భక్తితో, పాఠాలపై శ్రద్ధతో విని విన్నదానిని మననం చేసుకోవాలని చెబుతుంది. బాలలు రేపటి పౌరులని, బంగారు భవిష్యత్తు వాళ్ళదని అందుకు వాళ్ళు సద్భుద్ధితో, చక్కని నడవడితో సాగాలని రాస్తారు. ఒకరి కొకరు సహాయపడి, జాతీయ భావనలలతో మెలిగితే, కులమత బేధాలు లేని సమాజాన్ని సాధించగలిగి సమైక్యంగా ఉండగలిగితే అదే బాలలకు రామరాజ్యమని రచయిత విశ్వాసం.
ఇందులోని మరో కథ ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలనే విషయాన్ని వివరిస్తే, ఇంకో కథ వినాశకాలే విపరీత బుద్ది అన్న నానుడిని ప్రస్పుటం చేసేదిగా ఉంది. మిత్రలాభం, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం, ధర్మనిరతితో జీవించడం, మనిషి గర్వానికి పోరాదని, పంతాలకు పోవద్దని, అసూయ ద్వేషాల వంటివి పనికిరావని పిల్లలకు వీరి చిట్టి కథలు చెబుతాయి.
రచయిత జాతీయ భావనా స్రవంతికి ఆసక్తులై అనేక రచనలు చేశారు. అది వీరి చిట్టి కథల్లోనూ చూడొచ్చు. ప్రపంచ దేశాలన్నింటిలో భారత దేశమే గొప్పదన్న విషయాన్ని తన కథలో చెబుతూ బాలబాలికలను ఆలోచింపజేస్తారు. ఇంకా ఈయన కథల్లో జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి. పిల్లల స్థాయికి మించినప్పటికీ మత విద్వేషాల వంటివి ఎంత హానికరమో కూడా ఆయన తన కథల్లో చెబుతారు. కొన్నిచోట్ల మానవులకంటే జంతువులు, పశుపక్షులే మిన్న అని రచయిత రాయడం మనం చూడొచ్చు. ఇవేకాక పిల్లల కోసం వీరు రాసిన నాటికలు 'చిట్టి నాటికలు' ఇందులోని తొమ్మిది నాటికలు ఆకాశవాణిలోనే ప్రసారం కావడం విశేషం. దేశభక్తి, జాతీయ భావన, బాలల కోసం మార్గదర్శనం చేసే నిరంతర తపన వెరసి శ్రీ తిరుమల వెంకటస్వామి గారు. చాలా కాలం తన స్వంత పాఠశాలను నడిపించి పిల్లలకు మార్గదర్శనం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఈ తాతయ్య అనుభవాల ఖార్ఖాన నుండి మరిన్ని బాలల రచనలు రావలని ఆశిద్ధాం. ముఖ్యంగా రేడియో వంటి మాద్యమాల్లో రాసి మెప్పించిన వీరిలాంటి వాళ్ళు మరిన్ని రచనలు చేయాలి. జయహో! బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548