Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమాయకునికి అక్షింతలు వేస్తే...
లోకం మీద కొందరు మాయలు చేసేవాళ్ళుంటారు కొందరు. అమాయకులు ఉంటరు. అమాయకత్వం అంటే ఏమి ఎక్కువగా తెలియనితనం. మాయలు చేసేవాళ్లు అంటే 'తిమ్మిని బమ్మి చేస్తరు' 'చూసి రమ్మంటే కాల్చి వస్తరు' అయినా ఏర్పడకుంట పోషమ్మ ముందు పోతరాజు లెక్క కూర్చుంటరు. వీళ్ళను ఉషారుతనం చేస్తరు అంటరు. వీళ్ళకు వ్యతిరేకంగా మందగమనంగా ఉండేవాళ్ళను పాపం ఆయనకు ఏమి తెల్వది 'ఏలు పెడితే చీకడు ఎన్న పెడితే నాకడు' అని కూడా అంటరు. అమాయకులపై అయ్యో అన్న ప్రేమ భావనే ఉంటది. మోసాలకు తావు లేదు. ఈ సందర్భంలో 'అమాయకునికి అక్షింతలు వేసే ఆవలికి పోయినంక నోట్లె వేసెకున్నడట' అంటరు. అక్షింతలు పది కాలాల పాటు చల్లంగ వర్థిల్లు అని దీవిస్తూ పసుపు కుంకుమ అంటించిన బియ్యంను తల మీద చల్లుతరు. అయ్యే తల మీద బియ్యం కదా వృథాగా పోతున్నయి అని ఆ అమాయక చక్రవర్తి ఆవలికి పోయి నోట్లో వేసుకొని నమిలినట్లు పల్లెలో సృజించబడిన సామెత ఇది.
అట్లనే మరింత అమాయకులే గానీ తెల్సినట్టు నటించేవాళ్ళు అంటరు కొంతమంది. తెల్వకున్న అన్ని తెలుసు అన్నట్టు వాళ్ళ వాక్చాతుర్యం అంటది. ఆయన అడ్డదిడ్డం మాట్లాడితే 'అల్లం అంటే నాకు తెల్వదు బెల్లం లాగ పుల్లగ ఉండద' అన్నడట. ఇండ్ల రెండు అమాయకత్వాలు కన్పిస్తున్నయి. అల్లం రుచీ తెల్వది, బెల్లం రుచీ తెల్వది ఈ పెద్ద మనిషికి. అయినా అల్లం రుచి నాకు తెల్వదా అని మాట్లాడటం. సామెత చెపితే ఒక్క తత్వం అర్థం అవుతది మనిషి గుణం తెల్సిపోతది. ఇట్లనే పంచపాండవులు ఎందరు అంటే. 'పంచపాండవులు మంచం కోళ్ళ వలె ముగ్గురు' అన్నడట. పంచ పాండవులు అంటే 'పంచ'లోనే ఐదు అన్నరు. దానికి మంచం కోళ్ళు ఉదహరించిండు. మంచానికి ఉండేది నాలుగు కోళ్ళు అయితే మూడు ఉంటయి అని చెప్పడం. దేనికి ఏవి ఎన్ని ఉంటాయో కూడా తెలియకపోయినా తెలిసినట్లే మాట్లడం... ఇదో రకమైన అమాయకత్వం.
- అన్నవరం దేవేందర్, 9440763479