Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శొంఠి కృష్ణమూర్తి (1925-1991) ప్రసిద్ధ కథకులు.1945 నుండి కథలు రాశారు. కథలు రాయడమే గాక ''కథలు రాయడమెలా'' అని ఆలోచించి, కథల్ని పరిశీలించి, కథనాన్ని విశ్లేషించి, కథలు రాయడమెలాగో వివరించారు. దానికి పుస్తక రూపమిచ్చారు. ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడుతూ కొడవటి గంటి కుటుంబరావు ''నేటి తెలుగు సాహిత్యంలో అన్నిటికన్నా ముందుకు వచ్చిన స్వరూపమూ, కొత్త రచయితలను బలంగా ఆకర్షించేది కథ. ఈ పుస్తకంలో కథల గురించి చెప్పబడిన అనేక విషయాలు, కథకులు కాబోయే చాలా మందికి ఉపయోగకరంగా ఉండటానికి, తన బాధ్యతను తెలుసుకోవడానికి, అయోమయ స్థితిలో కథారచన సాగించుతున్నవారు ఒక దారికి రావడానికి, ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను'' అని అన్నాడు. 1955లో వరంగల్ యశోధర ప్రచురణలు ద్వారా మొదటిసారి ప్రచురించారు. 2016లో నవచేతన పబ్లిషింగ్ హౌస్ తిరిగి ముద్రించింది.
వ్యాకరణం అంటే రాయడానికి ఉపయోగపడే నియమం. అన్ని ప్రక్రియలకు నియమాలున్నట్లే కథకు కూడా నియమా లున్నవి. సృజనకు నియమమేమిటి? స్వేచ్ఛకు పరిమితులున్నట్లే, సృజనకు హద్దులుంటవి. అవే నియమాలు? అవి ఎట్లా ఏర్పడ్డవి? నియమం ముందా? కథ ముందా?? ప్రాచీన కథ తనకు తాను పుటం పెట్టుకుంటూ, ఆధునిక కథానిక వరకు వచ్చే సరికి అనేక మార్పుల్ని పొందింది. అందులో కొన్ని కథా రచనను ప్రగతి పథం లో ఉరకలెత్తించాయి. అవే నియమాలుగా, పద్ధతులుగా నిలిచాయి.
ప్రతి రచయితకు కృత్యాదవస్థ ఒకటి ఉంటుంది. రాయాల్సిన విషయం తెలిసినా, ఎట్లా రాయాలో తెలియక ఆగిపోయిన వారున్నారు. ఒక వేళ రాసినా రాణింపుకు వచ్చేలాగా రాయలేక పోయినవారున్నారు. వీరికి, వారికి ఎవరికైనా రచనా మెళకువలు తెలియాల్సిన అవసరం ఉంది. అవి తెలియాలంటే నియమాలు, పద్ధతులు తెలుసుకోవాలి. కథారచనా పద్దతులు, మెళ కువలు తెలుపటానికి పూనుకున్నవాడు శొంఠి కృష్ణమూర్తి. వారి కృషి ఫలితంగా ''కథలు రాయడమెలా?....'' అనే పుస్తకం రూపుదిద్దు కుంది. ఈ గ్రంథం మొత్తం నూరు పుటలకు మించిలేదు. కాని ప్రతిపుటలో ప్రతి వాక్యం అభ్యాసకునికి ఉపయుక్తమైన భావాన్ని అందిస్తు న్నది. స్వయంగా కథకుడు అయిన కృష్ణమూర్తి తన అనుభవం నుంచి, తను నేర్చుకున్న దాన్నుంచి, తనకున్న అవగాహన మేరకు ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దాడు. రాయదలచుకొన్న విషయాన్ని ఎనిమిది అధ్యాయాలుగా వింగడించుకొని రాశాడు. కథలు రాయడం కష్టమేం కాదని చెబుతూనే, కథకుడిగా రాణించాలంటే, కొంత కాలం శ్రమించక తప్పదని హెచ్చరిస్తాడు. కథలు రాయడానికి పాండిత్యం అవసరం లేదు అంటూనే, అందుకు కొన్ని యోగ్యతల్ని ప్రతిపాదించాడు. కనీస ప్రపంచ జ్ఞానంతో పాటు పఠనం, పరిశీలన, ఊహాశక్తుల్ని ఆవశ్యకతలుగా నొక్కి చెప్పాడు. రచయితకు ఆత్మవిమర్శ అలవడితే, అది కథ మంచిచెడులను కొలవడానికి ఉపయోగపడుతుందని చెబుతాడు. రాయడం ఎప్పటికీ విరమించకూడదని తీర్మానిస్తాడు.
కథలు రాసేవారు తాము రాయకుండా ఉండలేని దశలోనే రాయాలి. అప్పుడే చెప్పదలచుకున్న విషయం బలంగా పఠితకు చేరుతుంది. ''మన రచన ఏ మేలుకు కీడు చేస్తుందో, ఏ కీడుకు మేలు చేస్తుందో అనే ఎరుకతో రచన చేయాలి.'' అని అంటాడు రావిశాస్త్రి. ''మంచి కథలు పాఠకుల్ని ఎలా ప్రభావితం చేయగలుగుతున్నాయో గ్రహించినట్టే, చెడ్డ కథలు వారిపై ఎట్టి దుష్ప్రభావాల్ని కలిగిస్తున్నాయో'' తెలుసుకోవాలంటాడు కృష్ణ మూర్తి. కథకులు కావాలనుకునే వాళ్ళు, తాము రాయటమే కాదు, తమ ముందుతరం వారి కథల్ని పరిశీలించాలి. కథకుడి అభిరుచి మేరకు, అతడికి పాఠకలోకం ఉంటుంది. రచయిత కథాకథన నైపుణ్యాన్ని సాధిస్తే, అన్ని రకాల పాఠకులను మెప్పించగలగడు. కథల ద్వారా కీర్తిని, ధనార్జన పొందాలనుకునే వారికి శొంఠి కృష్ణమూర్తి కొన్ని సూచనలు చేశాడు.
1) ప్రజానీకం కన్నా కథకుడు ఉన్నత స్థాయిలో తన మెదడును ఉపయోగించాలి. హృదయాన్ని మాత్రం వాళ్ళకు దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఆప్పుడే వాళ్ళకు జీవితం పట్ల నూతన దృక్ఫథం ఏర్పడేలా కథలు రాయగలుగుతాడు.
2) కథను ఆకర్షణీయమైన పద్ధతిలో చెప్పాలి. అందుకు కథకుడు ప్రతిదాన్ని నూతన కోణంలో దర్శించే విధానాన్ని అలవర్చుకోవాలి. దానివల్ల పాఠకులు జీవితాన్ని, సమస్యల్ని ఏ విధంగా చూడాలో నేర్చుకుంటారు. అది అలవాటైన పాఠకులు ఆ రచయిత ప్రతి కథను వదలకుండా చదువుతారు. ఇలాంటి ధోరణిని, పద్ధతిని అలవరచుకుంటే అందరూ కథకులు కావచ్చు! అని అభిప్రాయపడ్డాడు.
జీవితానికి నిర్వచనం చెప్పలేనట్లే కథను కూడా నిర్వచించడం కష్టం. అనేక మంది కథను నిర్వచించారు. ఏ ఒక్కరి నిర్వచనం, మరొకరి నిర్వచనాన్ని పోలిలేదు. కృష్ణమూర్తి ''కథ అంటే ఏమిటి?'' అని చర్చిస్తూ, అనేకుల నిర్వచనాల్ని అందించాడు. ప్రతీ కథకు ప్రారంభం, మధ్యభాగం, ముగింపు అనేవి ఉంటాయని సూత్రీకరించాడు. ప్రారంభం మూడు రకాలు. 1) సంఘటన లేక క్రియాత్మక రూపం 2) సంభాషణలు 3) వర్ణన లేక కథా ప్రస్థావన అని నిర్దారించాడు. ఈ మూడింటికి పాఠకుణ్ణి ఆకర్షించి, కథలోకి తోడ్కొని పోయే లక్షణం ఉంది. రాయాలనుకున్న విషయానికి ఎలాంటి ప్రారంభం చక్కగా ఉంటుందో రచయిత నిర్ధారించు కోవాలి. కథను ప్రారంభించాక, కథావిషయాన్ని ''ప్రస్థావన''లో భాగంగా తెలపాలి. పాత్రలు, సమస్యలు, సంఘటనలు, మలుపులు మొదలగు వాటితో ''కథాభివృద్ది'' చేయాలి. దాంతో పాఠకుడు పఠనంలో లీనమవుతాడు. ఇక్కడే కృష్ణమూర్తి ''అనిశ్చితి'' అనే భావనను ప్రవేశపెడ్తాడు. కథలో సస్పెన్స్ అనేది ఉండాలనీ, అది ఉంటే పాఠకుడు, ఉత్కంఠతతో కథ మొత్తం చదువుతాడని అంటాడు. దీంతో కొందరు విభేదించారు. కొంతవరకు ''సస్పెన్స్'' కథను చదివించడానికి ఉపయోగపడుతుంది. సస్పెన్స్‌ను క్లైమాక్స్ వరకు తీసికెళ్ళి ముగించాలి. ఇలాంటి ముగింపు ద్వారా పాఠకుడు ఏదో ఒక రసానుభూతికి లోనవుతాడు. అదే కథ సాధించే ఫలితం. ఈ విషయాన్ని వివరిస్తూ కథను ''పరాకాష్ట''కు తీసుకెళ్ళాలి అంటూ అదే ముగింపు అని కూడా చెప్పాడు.
ప్రతి మనిషికి స్పందనలుం టాయి. కన్నవి, విన్నవి, ఊహించి నవి ఎన్నో ఉంటాయి. వాటి నుంచి విషయాన్ని ఎన్నుకుని కథ రాయాలి. నిత్యజీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అప్పటిదప్పుడే వాటిని కథలుగా మార్చలేం. కొన్ని విష యాలు కథలకు ఉపయోగపడవు. మనల్ని స్పందింపజేసిన అంశాలను మర్చిపోకుండా ఉండటా నికి కాగితం మీద రాసుకోవాలి. దానికి కృష్ణమూర్తి ''భావాల పుస్తకం'' (ఐడియా బుక్) అని పేరు పెట్టాడు. భావాలను అభివృద్ధి పరచి కథగా రాయాలి. అందుకు రచయితకు ఒక ప్రాపంచిక దృక్పథం ఉండాలి. తట్టిన భావానికి చెందిన మంచి, చెడు ఎరుక ఉండాలి. రాయదలచిన విషయాన్నే ఇతివృత్తం అంటారు. మూడు రకాల ఇతివృత్తాల్ని కృష్ణమూర్తి పరిచయం చేసాడు. 1) ప్రణయ జీవితం 2) అధికార కాంక్ష 3) జీవితాపేక్ష తీసుకునే ఇతివృత్తాలు సమాజానికి ఉపయోగపడేవిగా ఉండాలి. అప్పుడే అవి అభ్యుదయకర కథలుగా నిలుస్తాయి. వెనకటి కథల్లో ప్రతీ కథ ఒక నీతిని బోధించేది. ఆ నీతే కథ ఉద్దేశ్యం. కథా విషయం.
రచయిత మనసులో రాయదల్చుకున్న విషయం స్థిర పడగానే, దాన్ని కథగా మార్చడానికి ప్రణాళిక వేసుకుంటాడు. ఈ ప్రణాళికనే ''ఫ్లాటు'' ఇది కథకు అస్థిపంజరం లాంటిది. భావాలు, భాష, శైలి, పాత్రీకరణ - ఇవన్నీ ప్రణాళిక లోని భాగాలు. ''థీమ్‌ను విస్తరిస్తే ఫ్లాటు, ప్లాటుని విపులీకరిస్తే, కథా సంగ్రహం, దాన్ని అభివృద్ది పరచి వివరంగా రాస్తే కథ అవుతుంది.'' అని కృష్ణమూర్తి తెలిపాడు. పాత్రలు ఎలా ఉండాలి? పాత్రల్ని బట్టి కథ అల్లుకోవడం, పాఠకున్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక తయారు చేసుకోవడం లాంటి విషయాల్ని కూలంకషంగా చర్చించాడు. ప్రథమ పురుష కథనం, ఉత్తమ పురుష కథనం, మధ్యమ పురుషకథనం, పాత్రకోణ కథనం, లేఖారూప కథనం, గురించి సోదాహరణంగా తెలిపాడు. రచనా విధానాల్లోని రకాలను రచనాక్రమాన్ని ఒక కథ ద్వారా విపులీకరించాడు.
కథ రాసి పేరు పెట్టాలా! పేరు పెట్టి కథ రాయాలా! అనే సమస్యకు కథంతా రచయిత వేళ్ళ కొనలందున్నప్పుడు ఏది ఎలా చేసిన ఒకటే! ఎలాంటి పేరు పెట్టాలి! అనే సమస్యకు కూడా సమయోచిత సమాధానం ఇచ్చాడు. ప్రతికలకు కథలు పంపేటపుడు తీసుకోవాల్సిన అనేక జాగ్రత్తలు తెలిపాడు. పాత్ర ప్రతిని తయారు చేసే విధానాన్ని కూలంకషంగా వివరించాడు. చిన్న కథ, పెద్దకథ, కార్డుకథలు, పిట్టకథలు, గల్పికలు, వ్యంగ్య రచనలు, భావచిత్రాలు మున్నగు వాటి తేడాలు చెబుతూ అందుకు ఆధారంగా అనేక మంది పేరున్న రచయితల అభిప్రాయాలను పొందుపరచడంలో రచయిత కృషి అమోఘం.
కథల్లోని రకాలను అనేకులు ఒక్కొక్క తీరుగా చెప్పారు. ప్రథమంగా కృష్ణమూర్తి గారు చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంది. 1) వాస్తవికత 2) విషయము 3) ప్రయోజనము 4) కథావస్తువు అనే అంశాలను ఆధారం చేసుకొని కథలను వింగడించారు. రకాలను ఏర్చికూర్చారు. మళ్ళీ ప్రతి అంశంలోని కొన్ని తేడాలను గమనించి వాటి గురించి తెలిపాడు. వాస్తవికత అంశం ఆధారంగా 1) వాస్తవిక గాధలు 2) కల్పిత గాధలు అని విభజించాడు. విషయము అనే అంశం ఆధారంగా 1) పాత్రాధార కథలు 2) ఇతివృత్తాధార కథలు 3) ఘటనాత్మక కథలు 4) వర్ణనాత్మక కథలు 5) భావనాత్మక కథలు అని వింగడించాడు. ప్రయోజనం పై ఆధారపడి 1) అభ్యుదయ కథలు 2) అభివృద్ది నిరోధక కథలు 3) కాలక్షేప కథలు అని తేల్చిచెప్పాడు. కథావస్తువుల్ని బట్టి అనేక కథా రకాల్ని అందించాడు. అందులో 1) సాంఘిక కథలు 2) సాంసారిక కథలు 3) ప్రేమ కథలు 4) సెక్సు కథలు 5) అపరాధ పరిశోధక కథలు 6) చారిత్రక కథలు 7) వైజ్ఞానిక కథలు 8) హాస్యకథలు 9) జానపద కథలు 10) నీతికథలు 11) ఘోష్టు కథలు 12) సాహసిక కథలు (ఇందులో యధార్థ గాధలు, అభూత కల్పనలు) ఉంటాయని వడపోసి తెలిపాడు. ఇవే కాకుండా ''టాపికల్ కథలు 2) వ్యాపార కథలు 3) చిన్న కథల సీరియల్స్4) రేడియో కథలు 5) సినిమా కథలు 6) బాలల కథలు అనే వాటిని ''ఇతర రకాలు'' కిందకు చేర్చాడు.
అన్ని రకాల కథలకు నిర్వచనాన్నిస్తూ, కథను చెబుతూ, కొన్ని రకాలను మరింత విభజిస్తూ , సోదాహరణంగా కథల రకాలను వివరించాడు. కొత్త కథకులకే కాదు చేయితిరిగిన వారికి సైతం ఈ విషయావగాహన అవసరమే. విషయాన్ని వివరించడానికి తెలుగు మరియు భారతీయ, పాశ్చాత్య కథకుల నిర్వచనాలను వారు రాసిన కథ విశేషాలను తెలిపాడు. దానివల్ల రచయిత చెప్పదలచుకున్న అంశానికి సాధికారికత చేకూరింది.
చాలా మంది కథకులు వస్తువుకు ఇచ్చిన ప్రాధాన్యతను, శిల్పమునకు ఇవ్వరు. వస్తువు పట్టుపడినంత సులభంగా, శిల్పము పట్టుపడదు. శిల్పము లేని కథ రాణించదు. చెప్పదలచుకున్న విషయమును వస్తువుగా, చెప్పే తీరును శిల్పముగా పేర్కొనవచ్చును. సాధన ద్వారానే శిల్పము పట్టుపడుతుంది చక్కటి శిల్పము ఉన్న కథ, పఠితను ఆనందపరుస్తుంది. విషయాన్ని అర్థం చేయిస్తుంది. విడవకుండా చదివిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ''పఠనయోగ్యత'' కథకు శిల్పము వల్లే కలుగుతుంది. భాష, శైలి, పాత్రీకరణ, సంభాషణలు, వాతావరణం, సంఘటనలు, వర్ణనలు అన్ని కూడా శిల్పములో భాగమే భాష సుబోధకంగా ఉండాలి. రాస్తూ ఉంటే శైలి అలవడుతుంది. ఒక ఫ్రెంచి విమర్శకుడన్నట్లు ''స్టయిల్ ఈజ్‌ది మాన్ హిమ్ సెల్ఫ్'' (మానవుని వ్యక్తిత్వమే శైలి) విషయాన్ని పేరాగ్రాపులుగా విభజించడం, విరామచిహ్నాలను పాటించడం, వాక్య నిర్మాణం, అసందిగ్దంగా రాయడం, పదాల ఉపయోగం మున్నగునవి శైలి కిందికి వస్తాయి. మనకు తెలిసిన వ్యక్తులనే పాత్రలుగా ప్రవేశపెట్టినపుడు పాత్రీకరణ సులభంగా చేయవచ్చు. పాత్రసృష్టి,పాత్ర చిత్రణ, పాత్ర పోషణ అన్నీ కలిసి పాత్రీకరణలో భాగం అవుతాయి. సంభాషణలు ముఖ్యమైనవి, అనివార్యమైనవి. వీటితో నాటకీయతను పండించవచ్చు. పాత్రోచిత సంభాషణ ఉచితము. మాటల ద్వారా పాత్ర స్థితిగతులను తెలియపరచాలి. క్లుప్తంగాను, సమగ్రంగానూ వుండే వర్ణనలతో వాతావరణాన్ని చిత్రించాలి. భౌతిక, బౌద్దిక వాతావరణం, కథలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంఘటనలు కథకు ఛోదక శక్తులు. వాటిని నడిపించడంలో కథకుడు జాగరూకుడై ఉండాలి. ''వర్ణనా నైపుణ్యం గలవాడే మనలను సంచలనం కలిగిన దృశ్యాల సమక్షంలో చైతన్యవంతంగా వుంచుతాడు'' అని అంటాడు. ప్రొఫెసర్ షిఫర్డ్. వర్ణనలు సాధ్యమైనంత క్లుప్తంగా ఉండాలి. స్థలకాలాల మధ్య ఐక్యత సాధించాలి. కథ పూర్తయ్యే సరికి పాఠకుడికి సుఖదుఃఖ భావాలలో ఏదో ఒకటి కలగాలి. వీటన్నిటితో పాటు బలమైన వస్తువును ఎంచుకుంటే కథ రాణిస్తుంది. గురజాడ ''దిద్దుబాటు'' కథను పాఠ్యప్రణాళికగా గ్రహించి, అందులోని శిల్ప సంవిధానమును సోదాహరణముగా విశ్లేషించాడు. ఇది భావితరాలకు మార్గదర్శనంగా ఉంది.
- బి.వి.ఎన్. స్వామి, 9247817732