Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా||సిరి, తెలుగు బాల సాహిత్యంలో పరిచయం అక్కరలేని పేరు. బాలల కథా రచయిత్రిగా, నవలా రచయిత్రిగా, కాలమిస్టుగా, ప్రహేళికా కర్తగా, నిరంతరం పిల్లలతో కాలం గడుపుతూ కథలు చెప్పే 'కథలు అక్క'గా పరిచితురాలు. అసలు పేరు డా.మాచర్ల శిరీష, పుట్టింది నవంబరు 3, 1984న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో. శ్రీమతి శశిరేఖ-శ్రీ రాములు తల్లితండ్రులు. ఎంసెట్ ద్వారా ఎంబిబియస్ క్వాలీఫై అయినా బి.డి.ఎస్ చదివింది. దంత వైద్యురాలుగా సేవలందిస్తూనే, ఇటు కథలు చెప్పడంలో అత్యంత ఆసక్తిని కనబరుస్తూ పిల్లలతో ఎక్కువ కాలం గడుపుతోంది.
రచయిత్రిగా వందలాది కథలు రాసిన సిరి పదికి పైగా నవలలు రాసింది. వీరి నవలలలో 'ది లాస్ట్ మీల్ ఎట్ సాగరిక', 'ఎ,బి, నెగెటివ్' ప్రసిద్ధాలు. కథా రచయిత్రిగా అన్ని ప్రధాన పత్రికల్లో సిరి కథలు అచ్చయ్యాయి. ఎంపిక చేసిన కథలతో 'ఏ గిఫ్ట్ కాల్ లైఫ్' గా ప్రచురించింది. ఈ నవలలు, కథా సంపుటాలు అనేకం తీసుకు వచ్చారు సిరి. కవయిత్రిగా 'నా నువు...', 'నీకై నిరీక్షణ' సంపుటాలు వచ్చాయి. కథా సంపుటాలు త్వరలో రానున్నాయి.
బాల సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న సిరి తెలుగునాట విలక్షణంగా సాగుతున్న 'బాలల కథా శిల్పశాల'ల్లో ప్రధాన పాత్రధారిగా ఉండి, వందకు పైగా కార్యశాలల నిర్వహణలో పాలుపంచుకుంది. పిల్లల కోసం 700 లకు పైగా కథలు రాసింది. ఎంపిక చేసిన కథలను 'వెన్నెల పూదోట', 'మంచు ఊయల', 'వెలుగుల పయనం', 'వనంలో విరిసిన కథలు' మరియు 'రాక్షసుడి పాదరక్ష' పేరుతో సంపుటాలుగా ప్రచురించింది. సిరి రాసిన కథలు, గేయాలు, పదరంగం రచనలు కలిపి 'అక్షరాలతో ఆట'గా తెచ్చింది. పిల్లల ప్రధాన పత్రికలైన కొత్తపల్లి, బాల భారతి, బుజ్జాయి వంటి మాస పత్రికలతో పాటు ఆంధ్రభూమి వంటి పలు పత్రికల్లో అచ్చయ్యాయి.
సిరి పేరు కేవలం తెలుగు పిల్లలకే కాదు యిరుగు పొరుగు పిల్లలకు పరిచయం. వీరి కథలు తమిళం, కన్నడ, ఒడియా, ఉర్దూ, ఆంగ్ల భాషలలో సంపుటాలుగా వచ్చాయి. మరికొన్ని యిరుగు పొరుగు భాషల్లో వీరి కథలు రానున్నాయి. ఇటీవల ఉర్దూలో వచ్చిన వీరి బాలల అనువాద కథలు వీరికి మిక్కిలి పేరు తెచ్చిపెట్టాయి. బాల్యం నుండి పుస్తకాల మీద అపారమైన ఆసక్తి, ప్రేమ వున్న సిరి బాల్యం నుండి పుస్తకాలు చదవడం వీద అసక్తిని కనబరిచేది. వైద్య విద్యార్థిగా ఉన్నప్పటి నుండి వివిధ కార్యాక్రమాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సిరి కథలు చెప్పడాన్ని తన ప్రధాన వ్యాపకంగా చేసుకుంది. దీనికి తోడు ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థతో కలిసి చూపులేని వారి కోసం ఆడియో కథల సీరిస్ నేపథ్యంలో వీరి 250కి పైగా కథలు వచ్చాయి. ఇవి ఇప్పటికీ వారిని అలరిస్తున్నాయి. ఇవేకాక మరికొన్ని ప్రైవేటు సంస్థలు సిరి కథలను ఆడియో కథల పుస్తకాలుగా తెచ్చారు. వివిధ సంస్థల నుండి బాల సాహితీవేత్తగా అనేక పురస్కారాలు అందుకున్నారు సిరి. వీటిలో 'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట బాల సాహిత్య మహిళా పురస్కారం' బాల సాహిత్య విభాగంలో అందుకున్న తొలి రచయిత్రి కావడం విశేషం.
చందమామ కథల బొమ్మల మాంత్రికుడు శంకర్ తాతకు, బాలల కథకుడు, సినీ నటులు రావికొండలరావుకు అత్యంత ఆప్తురాలైన సిరి కథలన్నింటికి వీరిద్దరు ప్రధాన శ్రోతలు కూడా. కేవలం నీతి కథలు మాత్రమే రాయదీ రచయిత్రి, పిల్లల మనసుకు హత్తుకునేలా, నచ్చేలా వైజ్ఞానిక, సామాజిక అంశాలు ఈమె కథల్లో ప్రధాన అంశాలు. ముఖ్యంగా పిల్లలకు ఉత్సాహ భరితంగా ఉండడమేకాక వర్ణనలు, కల్పనలు విశేషంగా ఉంటాయి. 'మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి' అన్న అంశం ఎంత ముఖ్యమో 'మన భాషను మనం కాపాడుకోవడం అంతే ముఖ్యం' అన్న ప్రధాన ఆశయంతో సిరి కథలు రాస్తానంటారు. సిరి కథలు సామాజిక అంశాలతో పాటు, జానపద శైలిలో కూడా సాగుతాయి. జానపద కథల్లోనూ సామాజిక అంశాలను చేర్చి రాయడం వీరి రచనా శైలిలోని నవ్యత. బాలల నవ్య కథా రచయిత్రిగానే కాక, బాలల మనసెరిగిన నేస్తం ఈ 'కథల సిరి'.
సిరి పిల్లల కోసం కథలే కాదు చక్కని గేయాలు రాశారు. బాలల గేయాలను లయాత్మకంగా రాయడం సిరికి వెన్నతో పెట్టిన విద్య. అంతే అందంగా పాడుతుంది కూడా. 'ఉన్నాడు మా ఊరిలో పిల్లోడొకడు/ అల్లరికి అసలు సిసలు పేరేవాడు', 'చిలకమ్మా! ఓ చిలకమ్మా!/ చక్కని పలుకుల చిలుకమ్మా' వంటి గేయాలు ఈమె ప్రతిభకు నిదర్శనం. 'ఒకటి రెండు మూడు/ నాతో కలిసి పాడు/ నాలుగు ఐదు ఆరు/ మాదీ చక్కని ఊరు/ ఏడు ఎనిమిది తొమ్మిది/ మంచికి మారు పేరిది/ పది పదకొండు పన్నెండు/ కలిసే ఉంటాం ఎప్పుడు...' వంటి మరికొన్ని గేయాలు చూడవచ్చు. 'ఉరుకులెత్తే ఏరు, నా తెలంగాణ/ ఉర్విపై జాబిల్లి నా తెలంగాణ' అంటూ తెలంగాణ గురించి కూడా చక్కని బాలల గేయాలు రాశారు సిరి. బాల కథా సిరి, సిరికి జేజేలు!
- డా|| పత్తిపాక మోహన్,
9966229548