Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నదులన్నీ ఒక్క రంగులో పారవు
భూమి ఇష్టం
వర్ణమాల ఒకే అర్థం వినిపించదు
పెదిమెల ఇష్టం
వర్ణం ఒక సంకేతం
మాల ఇంకొక సంకేతం
గాలి బహుళ అర్థాల్ని వీస్తుంది
ఎండ రోజంతా ఒక్క తీరుగా తాకదు
పువ్వుకు పరిమళం ఒకవంతు బింబమే
చెలిమె మేఘం రిఫ్లెక్షన్ కావొచ్చు
మేఘం ఆమ్ల సమీర ప్రతినిథి కావొచ్చు
నువ్వనమన్నది
నాలుక పలుకనంటది ఉత్తరిస్తవా?
నాలుక ఉన్నది అన్ని రుచుల్ని చెప్పడానికే
నాలుకకు దేహద్రోహం ఉంటదా?
చటుక్కున తెరిచి నోరు మాట్లాడుతది
తులసి తీర్థం పోస్తవా?
నోరు ఉన్నది అన్ని శబ్దాల్ని పలకడానికే
నోటికి దేహద్రోహం ఉంటదా?
తెరిచి ఉండడం చెవి నిర్మితి
సీసం పోస్తవా?
చెవి ఉన్నది అన్నీ వినడానికే
చెవికి దేహద్రోహం ఉంటదా?
చూడమన్నదే చూస్తదా?
కన్ను ఉన్నది అన్నీ చూపడానికే
యాసిడ్ పోస్తవా
కన్నుకు దేహద్రోహం ఉంటదా?
శృతి తరంగాలెన్నో స్మృతి పరంపరలెన్నో
నదులెన్నో నదుల్ల
తరగలతోని ముచ్చటించే చేపల బాసలన్ని
అడవులెన్నో
చిటారు గాలుల మీద ఊయలలూగే పచ్చులన్ని రాగాలెన్నో
పారుతూ పదం పాడే ఃసంగతుఃలన్ని
వర్ణమాల ఒక్క అర్థాన్నే పలుకదు
గంగ ఒక్కటే నది కాదు
సావేరి ఒక్కటే రాగం కాదు
దేని వేలిముద్రలు దానివే
- సుంకిరెడ్డి నారాయణరెడ్డి 9885682572