Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దినకరుడు కనులు తెరవకముందే
ఆమె దినచర్య మొదలవుతుంది
చేతిలో ఆయుధం చేరగానే
చెమట తరిమినచెత్త కుప్పలాపోగుపడుతుంది
ఫ్లోరంతా వొళ్లుపులుముకున్నాక
కాయాన్ని ఫినాయిల్ తో పిండేసి
కనపడని పురుగులపై పోరాటానికి
తన శక్తిని అస్త్రంలా సంధిస్తుంది
చీపుర్లు గుడ్డకర్రలు బ్లీచింగ్ పౌడర్లు నీళ్ళు
రెండ్రెండుచేతులు పగిలిన పాదాలవేళ్ళు
స్వచ్ఛతకోసం సమరంచేసే నీవొళ్ళు
ప్రాణానికి పరిశుభ్రత ప్రధానమైనవేళ
ప్రక్షాళనకై కాళ్ళను చేతుల్నీ కదనంలోకి దింపుతుంది
శుభ్రత విజయంతో పొంగుతున్నసమయాన
ఆమె మురికిలా కరిగిఅలసిపోతుంది
నిజంగా దేశభక్తికి నిలువుటద్దమై నిలుస్తుంది
కడిగిన తెల్లని మనసు చెద్దరును
నీ పడకపైపరచి నిత్యం నిను
తుడిచి వెళుతున్న చీకటివెలుగుల కెరటం ఆమె
నీకు నువ్వే భరించలేని అశుద్ధతని
శుద్ధిచేసే నిబద్ధ కర్మయోధిని
అన్ని అసహ్యతలను సహించి సంహరించి
శ్రమను గుర్తించని అసమానతల తనాన్ని
అలంకరణగా మోస్తున్న స్వేదహృది
కరోనభయాన కూడా కరుణామయ సేవాధర్మాన్ని
విధులలో కొదువలేని తనాన్నిచూశాక
నిను కొలువక నిలువలేము
ఆయావో స్వీపర్వో ఆయుష్షును అందించే
సంగ్రామపు స్థలాన
మలినాలను పారద్రోలు మహాయోధనీవు
-కె.ఆనందాచారి ,
99487 87660