Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తలమడుగు
ప్రతినిత్యం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమావేశాలు ఎందుకు అంటూ సభ్యులు వివిధ శాఖల మండల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మండల అధ్యక్షురాలు లక్ష్మి రాజేశ్వర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారీగా సమీక్షించారు. మిషన్ భగీరథ తాగునీరు మారుమూల గిరిజన గ్రామాలకు గత మూడు నెలలుగా రావడం లేదంటూ సభ్యులు ఆ శాఖ ఏఈ పై మండిపడ్డారు. గత సర్వసభ్య సమావేశాల్లో అనేకసార్లు విన్నవించినప్పటికీ సంబంధితశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో మంచినీటి ట్యాంకుల నుండి బురద నీరు కూడా రావడం జరిగిందన్నారు. సర్పంచులు కరుణాకర్ రెడ్డి, ఆనంద్, రమేష్‌రెడ్డి పలువురు సర్పంచులు వివిధ శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎంపీపీ అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారుల దష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ఉద్యాన వన శాఖఅధికారి శ్రీనివాస్ పై జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పల్లి కే గ్రామంలో శాఖపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే సమాచారము ఎందుకు ఇవ్వలేదంటూ ఆ అధికారిపై మండిపడ్డారు. గత సమస్యల పరిష్కారంపై సమీక్షించకుండానే సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకని ఆయా గ్రామాల సర్పంచులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులకు తీర్మాణం చేసి పంపించాలని మండల అధ్యక్షురాలిని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీఓ రమాకాంత్, ఆర్అండ్బీ డీఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు.