Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ
నవతెలంగాణ-ఆదిలాబాద్ కలెక్టరేట్
విద్యార్థుల విద్యాభివృద్ధికి తొలిమెట్టు కార్యక్రమం దోహదపడుతుందని, విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌తో కలిసి తొలిమెట్టు, మన ఊరు- మన బడి కార్యక్రమాలు జిల్లాలో అమలు తీరుపై విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, పాఠశాల మేనేజ్మెంట్ చైర్మెన్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ విద్యార్ధులకు అర్థమయ్యే రీతిలో బోధనా చేయడం ద్వారా విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. బాధ్యతాయుతంగా పని చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించడం జరుగుతుందని, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మంచి ఆలోచనలతో విద్యాశాఖను ఉన్నత స్థాయికి తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాలలను పర్యవేక్షించి, మౌలిక సదుపాయాలు, విద్యాబోధన, విద్యార్థులు పఠనా సామర్థ్యంలను నోడల్ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద జిల్లాలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. అక్టోబర్ మాసంలో మోడల్ స్కూల్ ప్రారంభానికి సిద్ధం చేయాలనీ అన్నారు. జిల్లాలో మన ఊరు- మన బడి పనులపై స్పందిస్తూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా పనులు చేయడం జరుగుచున్నదని, పెయింటింగ్‌కు ముందే పనులను పూర్తిచేసుకోవాలని అన్నారు. చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో అప్ లోడ్ చేయాలని అన్నారు. పనులకు సంబంధించిన వివరాలు పూర్తిస్థాయిలో వివరించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద మొదటి దశలో 237 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో 214 గ్రామీణ, 23 పట్టణ ప్రాంతాలలోని పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. రూ.30 లక్షలకు పైగా 34 పాఠశాలలు, రూ.30 లక్షల లోపు 203 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. స్థానిక పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు, ప్రజాప్రతినిధుల సహకారంతో అక్టోబర్ మాసం నాటికి పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో తొలిమెట్టు కార్యక్రమం కింద ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించి విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పాఠశాల విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరిత, జాయింట్ డైరెక్టర్ వెంకట నర్సమ్మ, అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ రమేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, పంచాయతీ రాజ్ ఈఈ మహావీర్, ఇంజనీరింగ్, సెక్టోరల్ అధికారులు, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మెన్లు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.