Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచిర్యాల డీసీపీ అఖీల్ మహాజన్
నవతెలంగాణ-చెన్నూర్
మారుమూల గ్రామాల్లో నక్సల్స్ వారి బలాన్ని పుంజు కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వారిని రానివ్వకుండా మీ గ్రామాభివృద్ధికి తోడ్పడండని మంచిర్యాల డీసీపీ అఖీల్ మహాజన్ అన్నారు. శుక్రవారం కోటపల్లి మండలంలోని పంగిడిసోమారం గ్రామంలో పోలీసులు నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో మాట్లాడారు. ఇటీవల కాలంలో మహారాష్ట్రలో నక్సల్స్ మీటింగ్లు జరిగాయని, వాటి ఉద్దేశం వారి స్వంత స్థలాలకు వెళ్లి ప్రజలతో మమేకమై, కొత్త వారిని తయారు చేయాలని చూస్తున్నారని అన్నారు. వారికి సహకరించడం అభివృద్ధిని అడ్డుకోవడమే అని తెలిపారు. 10 సంవత్సరాల క్రితం మీ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా వుండేది కాదని, కానీ ఇప్పుడు మాత్రం మంచి రోడ్డు సౌకర్యం వుందని గుర్తుచేశారు. అలాగే గుట్కాలు, గుడుంబా, అక్రమ కలప, ఇసుక రవాణా వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ ఇండ్లను, వాహనాల సరైన పత్రాలను పరిశీలించారు. యువతకు వాలీబాల్ కిట్లు, వృద్దులకు శాలువాలు, మహిళలకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూర్ పట్టణ, రూరల్ సీఐలు ప్రవీణ్ కుమార్, విద్యాసాగర్ లు మరో 50 మంది సిబ్బంది పాల్గొన్నారు.