Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో రెగ్యూలర్ అధికారులను నియమించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ అరెల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఉన్న ప్రధాన శాఖలలో జిల్లా అధికారులు ఇన్చార్జీలతోనే వ్యవస్థలను నడిపిస్తూ కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. రెవెన్యూ, విద్య, వైద్యం, వ్యవసాయ, మహిళా శిశుసంక్షేమ శాఖ, దళిత అభివృద్ధి శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ, పశుసంవర్ధక శాఖలలో మండల స్థాయి అధికారులను జిల్లా స్థాయి అధికారులుగా ఇన్చార్జిలను నియమించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ గత పది ఏండ్లుగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొనసాగుతున్న క్షేత్రస్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. వివిధ శాఖలలో ఇన్చార్జిలకు సంబంధిత విషయ జ్ఞానం లేకపోవడంతో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ప్రభుత్వ శాఖలన్నింటిని సమన్వయపరచాల్సిన జిల్లా పరిపాలన అధికారి కూడా ఈ విషయంలో దృష్టి సారించకపోవడం బాధాకరమని అన్నారు. తక్షణమే ప్రధాన శాఖలన్నింటికీ రెగ్యూలర్ స్థాయి అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయంలో స్తబ్దంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కోకన్వీనర్లు బరుకుంట సుభాష్, గైక్వాడ్ సూర్యకాంత్, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు అరెపెళ్లి రాజేష్ పాల్గొన్నారు.