Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో..
- సర్దుబాటు కాకనే జాప్యమా?
సింగరేణి సంస్థ గతేడాది సాధించిన లాభాలను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు గడుస్తున్నా లాభాల వివరాలను వెల్లడించలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన లెక్కలు పూర్తి కాలేదా? పూర్తయిన వెల్లడించేందుకు ఇబ్బంది ఏమైనా ఉందా? అన్న దానిపై సింగరేణిలో చర్చించుకుంటున్నారు. సింగరేణిలో లాభాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోందని, ప్రభుత్వం సింగరేణి సొమ్మును రామగుండం మెడికల్ కాలేజ్, భద్రాచలం శాశ్వత పునరావాసాలకు రూ.500కోట్లు ప్రకటించడంపై లెక్కలు సర్దుబాటు కాకనే ఆలస్యం చేస్తున్నారని కార్మికులు విమర్శిస్తున్నారు. కార్మిక పక్షపాతిగా చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాల ఆందోళనలను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాభాలను ముందే ప్రకటించే యాజమాన్యం ఇంకా ప్రకటించకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం నిధులు వాడుకుంటునందునే లాభాలను ప్రకటించడం లేదని అటు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటు ప్రభుత్వ అనుబంధ సంఘం పట్టించుకోవడం లేదు. దీపావళి బోనస్ లాభాల వాటా దసరా అడ్వాన్సు అన్ని కలిపి లక్షకుపైగా చూపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదని సింగరేణి వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
నవతెలంగాణ-నస్పూర్
గతంలో అసెంబ్లీలో సైతం లాభాల వాటాను ప్రకటించిన అనుభవం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా చేస్తారనుకున్న ఈసారి కనీసం అసెంబ్లీపై కాంట్రాక్టు కార్మికుల గురించి కానీ, ఆర్ఎల్సీ ఒప్పందాల గురించి కానీ, సంస్థకు రావాల్సిన బకాయిల గురించి కానీ చర్చ జరగకపోవడంతో ఆశతో ఎదురు చూస్తున్న కార్మికులు పూర్తి నిరాశకు లోనయ్యారు. ప్రతి సంవత్సరం లాభాల వాటా పెరుగుతున్న కూడా సంస్థ లాభాలు తక్కువ చూపిస్తూ తమకు వచ్చే సొమ్ము తక్కువేనని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ లాభాలను తక్కువ చూపిస్తూ కార్మికులను మోసం చేస్తున్నాయని అన్ని కార్మిక సంఘాలు ఆరోపిస్తూ, లాభాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని పట్టుపడుతున్నా పట్టించుకోవడం లేదు. దసరా పండగ సమీపిస్తున్నా లాభాల్లో వాటా ప్రకటించకపోవడంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెల బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడి చేస్తున్న సంస్థ అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను ఎందుకు ప్రకటించడం లేదని కార్మికులు, కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సింగరేణి నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ ఈ సారి 35 శాతం వాటా ఇవ్వాలని అన్ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లాభాల ప్రకటన ప్రతి ఏటా ఆగస్టులో ఉండేది. దసరా నాటికి కార్మికులకు అడ్వాన్స్‌తో పాటు లాభాల వాటా సొమ్ము కూడా ఖాతాల్లో జమయ్యేది. మరో 16 రోజుల్లో దసరా ఉండటంతో ఇంకా సింగరేణి యాజమాన్యం లాభాల వాటా ప్రకటించకపోవడంతో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.
కార్మికుల ఎదురుచూపులు
లాభాలు ప్రకటిస్తేగాని లాభాల వాటా పెరుగుతుందా? తగ్గతుందా? అని తెలియదని కార్మికులు పేర్కొంటున్నారు. దీని కోసం ఎదురుచూపు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభాలు ఎంత వచ్చాయన్నది యాజమాన్యం ప్రకటించిన తర్వాతే సీఎం కార్మికులకు వాటా ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. 1999లో తొలిసారిగా కార్మికులకు లాభాల వాటాను పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఏటా కార్మికులకు లాభాల వాటా పంపిణీ చేస్తూ వస్తున్నారు. మొదట 10 శాతంతో మొదలై గతేడాది 29 శాతం పంపిణీ చేశారు. ఈసారి కార్మికులకు 35 శాతం వాటా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ ఆర్థిక పరిస్తితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, వాటాను పెంచి పంపిణీ చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆలస్యమా?
సింగరేణిలో గుర్తింపు సంఘం గడువు ముగిసింది. గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడో నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వ అనుబంధ సంఘం మీద వ్యతిరేకత ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం సుముఖత చూపకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక శాఖ కమిషనర్‌కు అనేకసార్లు లేఖలు రాశారు. కేంద్ర ప్రాంతీయ కార్మిక శాఖ కమిషనర్ అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి కార్మిక సంఘాల సభ్యత్వాలు, వార్షిక నివేదికలు అందజేయాలని సూచించారు. నవంబర్, డిసెంబర్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. అందులో భాగంగా లాభాల వాటాతో పాటు దసరా అడ్వాన్సు, దీపావళి బోనస్ కలిపి ఒకేసారి భారీ మొత్తంలో కార్మికులకు కానుకగా అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కార్మికులను అధికార పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ వైపు మళ్లించవచ్చనే వ్యూహంతోనే లాభాల వాటాను ఆలస్యం చేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. టీబీజీకేఎస్ మినహా అన్ని కార్మిక సంఘాల నాయకులు లాభాల వాటా కోసం యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారు.