Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం టిటిడిసి సమావేశ మందిరంలో రెవెన్యూ, పంచాయతీ, అటవీ శాఖల అధికారులకు అంతర్గత శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు అవగాహన చేసుకొని వృత్తి రీత్యా విధులు నిర్వహించాలని, ఏమైన సమస్యలు ఉన్నపుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని అన్నారు. అవగాహనతో పాటు ప్రయోగాత్మకంగా శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వరుణ్రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ, పంచాయతీ, అటవీ శాఖల అధికారులకు కల్పించిన శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగ పరచుకొని, భవిష్యత్లో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ శాఖల సమన్వయంతో పనులు నిర్వహించాలన్నారు. అనంతరం ఆయా ఉద్యోగులకు ప్రయోగాత్మక శిక్షణ నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ మొబైల్ యాప్ ద్వారా ప్రయోగాత్మకంగా విధులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జడ్పీ సీఈఓ గణపతి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులైన అభ్యర్థులకు పరిశ్రమలు, యూనిట్లు
జిల్లాలో టిఎస్ ఐపాస్, టీ- ప్రైడ్ కింద అర్హులైన అభ్యర్థులకు పరిశ్రమలు, యూనిట్ల స్థాపనకు మంజూరు చేస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం టిటిడిసి సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జులై నుండి ఆగస్టు 31 వరకు టిఎస్ ఐపాస్ కింద ఐదు పరిశ్రమలకు దరఖాస్తులు రావడం జరిగిందని, ఇందులో 3 పరిశ్రమల స్థాపనకు ఆయా శాఖల సిఫారసు మేరకు జిల్లా కమిటీ అనుమతి మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మిగతా రెండు పరిశ్రమలకు అభ్యంతరాల కారణంగా తిరస్కరించడం జరిగిందని తెలిపారు. టి- ప్రైడ్ కింద పెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అభ్యర్థులు రవాణా సెక్టార్ కింద ఆరు దరఖాస్తులు రావడం జరిగిందని, ఇందులో 48.40లక్షల వ్యక్తిగత వాటా కాగా, 18.41లక్షల రూపాయలు సబ్సిడీ కింద మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాపా షేక్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మ భూషణ్ రాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, విద్యుత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.