Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి
- సారంగాపూర్‌లో బతుకమ్మ చీరల పంపిణీ
నవతెలంగాణ-సారంగాపూర్
ఆడపడుచులకు కానుక బతుకమ్మ చీరలని, బతుకమ్మ పండగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కరుణాకర్‌రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3000 మందికి చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆదివారం నుండి అన్ని రేషన్ షాపులలో పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మండలంలో మొత్తం 18వేల మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆడ బిడ్డలు ఇష్టంగా ఆనందంగా ఆటపాటలతో జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని తెలిపారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలతో వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణగా షీటీంలు 24గంటలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అంతరించి పోతున్న సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, పండుగలకు తెలంగాణ ప్రభుత్వం పునర్జీవం పోశాయన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బతుకమ్మ పండుగ జరుపుకునే వాళ్లమని, నేడు ప్రపంచ వ్యాప్తంగా పండుగని ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగకి అడబిడ్డలకు కానుకగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ చీరలు అందజేసి గౌరవిస్తుందని తెలిపారు. అనంతరం మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. తదనంతరం మహిళలు బతుకమ్మను పేర్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్పర్సన్ విజయలక్ష్మి, రాంకిషన్ పాల్గొన్నారు.
రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బడి బాట పట్టారు. జాం గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్లో వంట గది, భోజన శాల, వసతి ఇలా అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను, మెనూను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఇటీవల ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనల నేపథ్యంలో వంట గదిలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తాజా కూరగాయాలను వండాలని, బియ్యం, గుడ్లు, ఇతర వంట సామాగ్రి ఎక్కువ కాలం నిల్వ ఉంచరాదని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మంత్రి మాట్లాడారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా? అని ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.