Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్
- జీఎం కార్యాలయాలను ముట్టడించిన కాంట్రాక్ట్ కార్మిక జేఏసి
నవతెలంగాణ-ఆసిఫాబాద్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌తో గత 16 రోజులగా సమ్మె చేస్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదని ఈనెల 26న కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి భోగే ఉపేందర్ తెలిపారు. శనివారం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియా(గోలేటి) జీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు కార్మిక నాయకులను అడ్డగించటంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం రవీందర్, గోలేటి బ్రాంచ్ కార్యదర్శి చల్లూరి అశోక్, ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి బందారి తిరుపతి, గోలేటి కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల 18 డిమాండ్లపై గత 16 రోజులుగా సింగరేణి వ్యాప్తంగా మొక్కవోని ధైర్యంతో యాజమాన్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తమ సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్టు కార్మికుల సమ్మె చేస్తున్నరని అన్నారు. కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈనెల 26న కోల్ బెల్ట్ ఎమ్మెల్యేల ఇండ్లు (క్యాంపు కార్యాలయాలు)ను జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడిస్తాని హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికులపై యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించారు. ఎందుకు ఈ సవితి తల్లి ప్రేమను ప్రభుత్వం ప్రదర్శిస్తున్నదో చెప్పాలని అన్నారు. 30 వేల మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడి ఆందోళన చేస్తుంటే సింగరేణి అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ఏసీ గదులకే పరిమితమవుతున్నారని అన్నారు. నాయకుల వైఖరి నిరసిస్తూ ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ముట్టడి కార్యక్రమంలో నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొయ్యడ సాగర్‌గౌడ్, రహీం, శ్రీనివాస్, కనకయ్య, అర్చన, చిన్నుబారు, లక్ష్మి పాల్గొన్నారు.
మందమర్రిరూరల్ : కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె 16వ రోజు శనివారం విజయవంతంగా కొనసాగింది. మందమర్రి జీఎం కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించి ఉదయం నుంచి సాయంత్రం వరకు బతుకమ్మ ఆటలతో గాయకుల డప్పు, చప్పుల పాటలు పాడుతూ నిరసన తెలిపారు. ముట్టడి కార్యక్రమానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో జేఏసీ నాయకులు దూలం శ్రీనివాస్, సీఐటీయూ జాఫర్, ఐఎఫ్టీయూ కొమురయ్య ఏఐటీయూసీ మద్దతుగా నిలిచిన సీపీఐ(ఎం), సీపీఐ (ఎంఎల్) న్యుడెమోక్రసీ, టీడీపీ, ఫార్వడ్ బ్లాక్, సామాజిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నస్పూర్ : సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమ్మెలో భాగంగా శనివారం ఉదయం జీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయ అధికారులను లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అక్కడే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. బతుకమ్మ పాటలతో మహిళలు ఆడి పాడి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు డి.బ్రహ్మానందం, దొడ్డిపట్ల రవీందర్, గట్టు మహేందర్, మేకల దాసు, మేకల రమన్న, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.