Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్
నవతెలంగాణ-ఆసిఫాబాద్
తెలంగాణ చరిత్రకు నిలువుటద్దం బతుకమ్మ పండుగ అని పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగను అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ల్లో అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి జిల్లా గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ, పంచాయతీ శాఖల అధికారులతో బతుకమ్మ పండుగ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో బతుకమ్మ పండుగతో పాటు దసరా నవరాత్రి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తెలిపారు. బతుకమ్మ పండుగలో పోషణ మాసం సందర్భంగా రోజు రోజు చిరుధాన్యాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో బతుకమ్మలను తయారు చేసి ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతిరోజు బతుకమ్మతో పాటు పోషణ మాసం సందర్భంగా పౌష్టికాహారంపై వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రభుత్వం ఆడపడుచులకు అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ సురేందర్, డీపీఓ రమేష్, డీడబ్ల్యూఓ సావిత్రి పాల్గొన్నారు.