Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉట్నూర్
గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని దీనిపై స్థానిక ఉట్నూర్ సివిల్ జడ్జి దుర్గారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల తరగతి గదులను, భోజన గది, పలు రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులకు స్ట్రీమ్ కుకింగ్ సిస్టమ్ పరిశీలించి, పాఠశాలలో వసతుల పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు పాఠశాలలను తనిఖీ చేశామన్నారు. పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యాన్ని చేయడం తగదన్నారు. విద్యార్థులను క్రమ శిక్షణతో కూడిన విద్యా విలువలను నేర్పించాలని, కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటుగా నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని ప్రిన్సిపల్, వార్డెన్, ఉపాధ్యాయులను ఆదేశించారు.