Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచిర్యాల కలెక్టర్ భారతి హోళి కేరీ
నవతెలంగాణ-మంచిర్యాల
క్రీడాకారులు సమిష్టిగా పోటీ పడితేనే విజయం సాధిస్తారని మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరీ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆరవ తెలంగాణ అంతర్ జిల్లా స్థాయి బాల బాలికల జూనియర్ బాస్కెట్ బాల్ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీలలో పాల్గొనాలని అన్నారు. క్రికెట్ పోటీల్లో సచిన్ లాంటి గొప్ప ఆటగాడు అనేక సెంచరీలు చేసినప్పటికీ పలు పోటీల్లో జట్టు విజయం సాధించలేదని గుర్తు చేస్తూ ఆటగాళ్లు సమిష్టిగా ఉండటం వల్ల విజయం సాధించవచ్చని అన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.
స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్టేడియం మంజూరైనప్పటికీ అనివార్య కారణాలవల్ల పనుల్లో ఆలస్యం అవుతోందని, ఈ విషయంలో కలెక్టర్ చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. బాలుర పాఠశాల మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణంకు నిధులు కూడా మంజూరు అయినట్లు తెలిపారు. క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు. కార్యక్రమంలో బాస్కెట్ బాల్ జిల్లా అసోసియేషన్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్, సెక్రెటరీ ఫ్రాన్సిస్, కో కన్వీనర్ గిరివేని సంపత్, రాష్ట్ర కార్యదర్శి నార్మన్ ఇసాక్, ఉపాధ్యక్షులు జగన్మోహన్రావు, బొలిశెట్టి కిషన్, సాగర్ యాదవ్, బెల్లంకొండ మురళీధర్, మినాజ్, గొంగల్లా శంకర్ పాల్గొన్నారు.