Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలు విస్మరిస్తున్న పలు ప్రయివేటు ఆస్పత్రులు
- అనుమతి లేకపోయినా యధేచ్ఛగా వైద్య చికిత్సలు
- మామూలుగా తీసుకుంటున్న వైద్యాధికారులు
- తాజా ప్రభుత్వ ఆదేశంతో ఉరుకులు పరుగులు
- ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు
ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా నిర్వహిస్తుండగా.. మరికొన్నింటిలో నిర్వహణ లోపాలు ఉంటున్నాయి. తాజాగా ప్రభుత్వం ఇలాంటి అస్పత్రులను గుర్తించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ సంచాలకుడు కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో ఆయా జిల్లాల్లో కొన్ని ఆస్పత్రులు జిల్లా వైద్యఆరోగ్యశాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే కొనసాగుతున్నట్లు గుర్తించగా.. మరికొన్నింటిలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. మరోపక్క ఆయా ఆస్పత్రులు ఏండ్ల తరబడి వైద్య సేవలు అందిస్తున్నా అధికార యంత్రాంగం గుర్తించలేకపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు వస్తేగానీ తనిఖీలపై దృష్టిసారించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రయివేటు ఆస్పత్రుల దందా మూడు పువ్వులు..ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. వైద్య సేవల పేరిట ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ సేవాదృక్పథాన్ని పక్కన పెట్టేస్తున్నాయి. ఆస్పత్రి నిర్వహించాలనే జిల్లా వైద్యఆరోగ్యశాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. వాటిని ఏ మాత్రం బేఖాతరు చేయడం లేదు. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో యధేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన వైద్యులు,నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్టెక్నీషియన్లతో పాటు ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన ప్లేస్ లేకపోయినా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల అర్హత కలిగిన వైద్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత వివిధ కారణాలతో సదరు వైద్యుడు అక్కడ్నుంచి వెళ్లిపోయినా ఆర్ఎంపీల సాయంతో ఆయా ఆస్పత్రులను నిర్వహించడం..క్లినిక్ల పేరిట అనుమతి తీసుకొని ఆస్పత్రి నిర్వహించడం..ఎంబీబీఎస్ పూర్తికాని వైద్యులను నియమించి చికిత్సలు అందించడం, సరైన సౌకర్యాలు లేకపోయినా చికిత్సలు అందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వివిధ రకాల ఇన్సురెన్సు సౌకర్యం కలిగిన వారు రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రుల్లో చికిత్సలు తీసుకుంటే..వారికి చికిత్స అనంతరం ఇన్సురెన్సు డబ్బులు క్లెయిమ్ కాలేని పరిస్థితి ఉంటుంది.
నష్టపోతే ఎవరు బాధ్యులు..!
ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు నిబంధనలు విస్మరిస్తున్నా అధికార యంత్రాంగం దృష్టిసారించడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 122 వరకు ప్రయివేటు ఆస్పత్రులు ఉండగా నిర్మల్ జిల్లాలో 120, మంచిర్యాలలో 225, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 27 ఆస్పత్రులు న్నాయి. తాజాగా ప్రభుత్వ ఆదేశంతో అధికారులు పలు ఆస్పత్రుల్లో తనిఖీలు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన తనిఖీల్లో కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు అనుమతులు తీసుకోకుండానే కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. కానీ ఇన్నాండ్లు ఆయా ఆస్పత్రులు యధేచ్ఛగా వైద్య సేవలు అందిస్తున్నా అధికార యంత్రాంగం దృష్టిసారించలేదనే విమర్శలున్నాయి. ఇలాంటి వాటి పట్ల అధికారులు మామూలుగా తీసుకుంటూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వచ్చిరాని వైద్యం..అసౌకర్యాల మద్య చికిత్సలు తీసుకుంటున్న రోగులకు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులవుతారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అధికార యంత్రాంగం ఇప్పటికైనా దృష్టిసారించి నిబంధనలను విస్మరిస్తూ..ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న ఆస్పత్రులపై కొరఢా ఝులిపించాలని జనం కోరుతున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూ ఆస్పత్రుల నిర్వహణను పర్యవేక్షించాల్సిన అవసరం అధికారులపై ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తనిఖీలు కొనసాగుతున్నాయి
రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తనిఖీలు చేపడుతున్నాం. తాజాగా జిల్లాలో పది ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టగా..నాలుగు ఆస్పత్రులు నిబంధనలు పాటించడం లేదని గుర్తించాం. వాటికి నోటీసులు జారీ చేశాం. సోమవారం నుంచి వారం రోజుల పాటు అన్ని ఆస్పత్రులను తనిఖీ చేస్తాం. ఇది వరకు కూడా పలుమార్లు తనిఖీలు చేపట్టాం.
డా.సాధన, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఆదిలాబాద్.