Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్
- ఎంపీపీ, ఎమ్మెల్యే మధ్య చిన్న వాగ్వాదం
నవతెలంగాణ-సిరికొండ
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే రేఖ నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను, మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను గుర్తించి, రాష్ట్రంలో ఒంటరి మహిళ, 57 ఏండ్ల వయస్సు వారికి వృద్ధాప్య, వికలాంగులకు పింఛన్లను అందజేసి కేసీఆర్ వారికి అండగా నిలుస్తున్నారని అన్నారు. ముందుగా ఎంపీపీ అమృత్ రావు, ఎమ్మెల్యే రేఖ నాయక్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలకు, రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎంపీపీ మాట్లాడుతుండగా, ఎమ్మెల్యే కలుగజేసుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి ఇచ్చిందేమి లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల కోసం రైతు బంధు, పేదింటి ఆడపిల్లల కోసం కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు దేశంలో ఎక్కడ లేవని అన్నారు. ప్రజలు ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. పేదల కడుపులు నింపుతున్న రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో కూడా మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్, ఐకేపీ ఏపీఎం సంతోష్, ఇంద్రవెల్లి ఎంపీపీ శోభబాయి, పలు గ్రామాల సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెందూర్ అనిల్ కుమార్, పెందూర్ లక్ష్మి, తాంబారే రేణుక, బషీర్, విఠల్ పటేల్, సునీల్, చెండే బాలాజి, రాజారాం, విజరు కుమార్, బియ్యల మల్లేష్, బిక్కు పాల్గొన్నారు.