Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
నవతెలంగాణ-ఆసిఫాబాద్
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా కృషి చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సోమవారం వచ్చిన ఫిర్యాదుల్లో పెంచికల్పేట ఎల్లారం గ్రామానికి చెందిన కొందరు 30 సంవత్సరాల క్రితం ఫకీర్ అహ్మద్ పట్టాదారు వద్ద భూమి కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకొని ఉంటున్నామని తెలిపారు. కొందరు తప్పుడు పట్టాలు సృష్టించి తమకు నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కెరమెరి మండలం అగరువాడ గ్రామానికి చెందిన అదే అఖిల్ తాను పుట్టుకతో వికలాంగుడినని సదరన్ సర్టిఫికెట్తో పాటు వికలాంగ పింఛన్ ఇప్పించాలని కోరారు. సిర్పూర్(టి) మండలం పారిగాం గ్రామానికి చెందిన గోండు బావుజీ తాను గత పది సంవత్సరాలుగా తనకు చెందిన భూమిలో సాగు చేసుకుంటున్నానని, అన్లైన్లో మాత్రం ఇరుల పేరు నమోదైదని తెలిపారు. ఆసిఫాబాద్ మండలం మలన్ గొంది గ్రామానికి చెందిన కుర్సంగ షేకు బారు తన తల్లి పేరిట ఉన్న భూమిని తన పేరిట విరాస చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. రెబ్బెన మండలం నవేగం గ్రామానికి చెందిన మహాత్మ గౌరయ్య నాలుగు తరాలుగా వంశపారంగా వస్తున్న భూమిలో తన వాటాను ఇప్పించి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరారు. ఆసిఫాబాద్ మండలం తుంపల్లి గ్రామానికి చెందిన రైతులు తాము పత్తి పంట సాగు చేశామని, అడవి పందుల వలన పంట నష్టపోయే అవకాశం ఉందని, పంట రక్షణ కొరకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.