Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంచిర్యాల
తెలంగాణ జూనియర్ అంతర్ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ క్రీడా పోటీలు హోరా హోరీగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న పోటీల్లో రాష్ట్రంలోని 18 జిల్లాల నుంచి 33 జట్లు పాల్గొన్నాయి. 15 బాలికల జట్లు, 18 బాలుర జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. పోటీలకు అతిథ్యం ఇస్తున్న మంచిర్యాల జిల్లాతో పాటు కరీంనగర్, నిజామాబాద్, ములుగు, హైదరాబాద్, వరంగల్, మేడ్చల్ తదితర ప్రాంతం నుండి వచ్చిన జట్ల మధ్య సాగిన పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ఉదయం నుండి రాత్రి వరకు నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న పోటీలను తిలకించేందుకు క్రీడా అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి అభిమాన జట్లను ప్రోత్సహిస్తున్నారు. జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్, కార్యదర్శి సుకుమార్ ఫ్రాన్సిస్, టోర్నమెంట్ కన్వీనర్ బోరిగం శ్రీనివాస్, కోకన్వీనర్ గిరివేని సంపత్ కుమార్ తోపాటు పలువురు సభ్యులు పోటీల విజయవంతానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆహ్లాదకరంగా క్యాంప్ ఫైర్..
బాస్కెట్ బాల్ పోటీలకు వచ్చిన క్రీడాకారులకు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ ఆహ్లాదకరంగా సాగింది. వివిధ జిల్లాలకు చెందిన జట్ల క్రీడాకారులు సినీ జానపద నృత్యాలు చేసి అలరించారు. పోటీలు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో స్నేహపూరిత వాతావరణంలో సాగాలని రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ నాయకులు కోరారు.