Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమను విస్తరింపజేయడమే తెలంగాణ ప్రభుత్వ విధానమని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయ ప్రాంగణంలోని ఐటీ పార్క్ డీబీఎన్టీ లాబ్స్ ఉద్యోగులతో డెలివరీ కిక్-ఆఫ్ సెర్మనిలో రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీశాఖ మంత్రి మాట్లాడుతూ, ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఐటీ కంపెనీ ఎన్టీటీ, బీడీఎన్టీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఆదిలాబాద్‌ను కూడా ఐటీ మ్యాప్‌లో పెట్టిన ప్రభుత్వ విజన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలు, యువతకు అవకాశాలు కల్పించడం ద్వారా హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాల ఐటీ కంపెనీలతో పోటీ పడతారని అన్నారు. జిల్లాలో ఐటీ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, పట్టుదల ఉంటే విజయం సాధిస్తారని అన్నారు. ఎన్టీటీ, బీడీఎన్టీ ల్యాబ్‌లో పనిచేస్తున్న వారంతా ఉమ్మడి జిల్లా వాసులేనని, అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం జరుగుతుందని అన్నారు. విద్యుత్ సరాఫరాను మరింత మెరుగురిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐటీ ఉద్యోగుల కోరిక మేరకు శాశ్వత భవన నిర్మాణానికి 5 ఎకరాల స్థలంలో ఆధునీకరిస్తామని, ఒక కోటి యాభై లక్షల రూపాయలను మంజూరు చేయడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ ఆధునీకరణ పనులను పర్యవేక్షించాలని సూచించారు. ఆదిలాబాద్‌లో సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి పూర్తీ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే జోగురామన్న విజ్ఞప్తి మేరకు ఐదు ఎకరాల స్థలంలో ఐటీ పార్క్‌కు త్వరలోనే శంఖుస్థాపన చేస్తామని తెలిపారు. విదేశాల్లో ఉన్న పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూదాతలు ముందుకు రావాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కశ్మీర్ ఆఫ్ తెలంగాణ అని అభివర్ణిస్తూ, గుట్టలు, వాగులు, వంకలు, పచ్చని మైదనాలు, జలపాతాలు, జోడేఘాట్ పర్యాటక ప్రాంతాలు, కుమ్రం భీం అద్భుతమైన సాంస్కృతిక సంపద ఇక్కడ ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని అందమైన ప్రదేశాలను అభివృద్ధి చేయాలనీ, పర్యాటక శాఖా మంత్రికి సూచించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు వారాంతపు సెలవుల్లో పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుందని, పర్యాటక రంగాన్ని జిల్లాలో విస్తరించాలని కోరారు. అంతకుముందు ఐటీ అధికారులు, జిల్లా కలెక్టర్, మంత్రులతో సమావేశమైన ఐటీ కంపెనీ అభివృద్ధి, కావలసిన సౌకర్యాలు, తదితర అంశాలపై ఐటీ శాఖ మంత్రి చర్చించారు. అనంతరం పలు విభాగాలను పర్యవేక్షించి ఉద్యోగులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పర్యాటక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మెన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్సీలు దండే విఠల్, శంబీపూర్ రాజు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, బోథ్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, ఐటీడీఏ పీఓ కె.వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ భాషా షేక్, ఎన్. నటరాజ్, మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.