Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలి
- ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్
నవతెలంగాణ-హాజీపూర్
దళిత డ్రైవర్లను ఓనర్లను చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని పడతానపల్లిలో దళిత బంధు లబ్దిదారులకు ట్రాక్టర్లు, ఆటోలను కొందరికి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజల్లో అత్యధిక శాతం దళితులే ఉన్నారని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. వారు అర్థికాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి దళిత బిడ్డకు రూ.10 లక్షలు అందేలా ఈ పథకం పూపొందించారని పేర్కొన్నారు. కొందరికి ముందు రావచ్చని, మిగిలిన వారికి కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాన్నారని తెలిపారు. 313 యూనిట్లు మంజూరు కాగా మంచిర్యాల నియోజకవర్గనికి 100 యూనిట్లలో పడతానపల్లి గ్రామానికి అత్యధికంగా 43 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. లబ్ది పొందిన వారు సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివద్ధి సాధించాలన్నారు. 70 ఏండ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి దళితులకు ఈ విధమైన పథకం ప్రవేశ పెట్టలేదన్నారు. ఇలాంటి సీఎం దేశ రాజకీయాల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌ను నిలదీత..
గ్రామంలో 66 దళిత కుటుంబాలు ఉండగా 43 మందికే ఎలా ఇస్తారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌ను దళితులు నిలదీశారు. గ్రామంలో ఉన్న దళితులందరికి మంజూరు చేయాల్సింది కొంత మందికి మంజూరు చేయటంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగాలు, ఆస్తులు ఉన్నవారికి దళిత బంధు మంజూరు చేశారని ఆరోపించారు. దీంతో ఆందోళన కారులను చైర్మన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దళిత బంధు అందరికి అందే వరకు కొనసాగుతుందని, కొందరికి ముందు వెనక పథకం మాత్రం కచ్చితంగా అందుతుందని వారికి భరోసా కల్పించారు. ఉద్యోగంతో సంబంధం లేకుండా ప్రతి దళితుడు ఈ పథకానికి అర్హుడేనాని తెలిపారు. రాపల్లి, పడతానపల్లి దళిత కాలనీలు ఎల్లంపల్లి ముంపు గ్రామాలుగా గుర్తించి పునరావాస కాలనీలకు తరళించాలని దళితులు చైర్మన్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, సర్పంచ్ గోళ్ల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.