Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజాగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
- నేటి నుంచి గ్రామాల వారీగా పంపిణీకి శ్రీకారం
- ఉమ్మడి జిల్లాలో 70,613మందికి ప్రయోజనం
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త పింఛన్‌దారుల డబ్బులు విడుదలయ్యాయి. ఎట్టకేలకు లబ్దిదారుల నిరీక్షణ ఫలించనుంది. దసరా పండుగ ముందర తీపి కబురు అందించింది. ఇటీవల నూతన పింఛన్ కార్డులు పొందినప్పటికీ డబ్బులు అందజేయలేదు. తాజాగా ప్రభుత్వం వారందరికీ డబ్బులు అందజేసేందుకు జిల్లాల వారీగా నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పింఛన్ డబ్బులను ఆయా జిల్లాలో శుక్రవారం నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. మున్సిపాలిటీల్లో బ్యాంకుల ద్వారా పింఛన్లు అందజేయగా.. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్‌శాఖ అందజేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని కొత్త పింఛన్‌దారులు వారి పరిధిలోని బీపీఎంల వద్ద కొత్త బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. తాజాగా 57ఏండ్లు నిండిన వారితో పాటు వివిధ రకాల పింఛన్లకు అర్హులైన వారికి కూడా మంజూరుచేయడంతో లబ్దిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్త పింఛన్‌దారులు 70,613మందికి ప్రయోజనం చేకూరనుంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం 64 ఏండ్లు నిండిన వృద్ధులతో పాటు వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులతో పాటు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆసరా పేరిట పింఛన్లను అందజేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.వెయ్యి చొప్పున అందజేయగా..రెండోసారి అధికారంలోకి వచ్చాక వీటిని రెట్టింపు చేసింది. వీటితో పాటు పింఛన్ల వయసును కూడా కుదించింది. 57ఏండ్లు నిండిన వారికి కూడా పింఛన్లు అందజేస్తామని ప్రకటించింది. దీంతో అనేక మంది లబ్దిదారులు దరఖాస్తులు చేశారు. కానీ ప్రభుత్వం వీటిని మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేసింది. దాదాపు మూడేండ్లుగా వీటి కోసం లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. దరఖాస్తులు చేసిన కొందరు తాజా పింఛన్ డబ్బులు తీసుకోకుండానే మరణించిన సందర్భాలున్నాయి. 57ఏండ్లు నిండిన వారితో పాటు భర్తలను కోల్పోయిన వారు, ఒంటరి మహిళలు, వికలాంగులు అనేక మంది అర్హులు పింఛన్ల కోసం దరఖాస్తులు చేసినా ప్రభుత్వం మంజూరుచేయలేదు. తీవ్ర ఆలస్యం కావడంతో లబ్దిదారులతో పాటు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నెల రోజుల క్రితం ప్రభుత్వం నూతన పింఛన్లు మంజూచేయడంతో పాటు అర్హులైన వారికి పింఛన్ కార్డులు కూడా అందజేసింది. కానీ నిధులు విడుదల చేయకపోవడంతో వారు పింఛన్ డబ్బులు అందుకోలేకపోయారు.
ఎట్టకేలకు ఫలించిన నిరీక్షణ
దాదాపు మూడేండ్లుగా ఎదురుచూసిన లబ్దిదారుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించనుంది. నూతనంగా ఆదిలాబాద్ జిల్లాలో 15,474మందికి, కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లాలో 13,436మందికి, మంచిర్యాల జిల్లాలో 22,127మంది, నిర్మల్ జిల్లాలో 19,576మందికి మంజూరయ్యాయి. ప్రభుత్వం కొత్త పింఛన్‌దారులకు డబ్బులు విడుదల చేయడంతో అనేక మంది నిరుపేదలకు లబ్ది చేకూరనుంది. ఇన్నాండ్లు ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టిసారించకపోవడంతో అనేక మంది అర్హులైన వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వృద్ధాప్యం మీదపడటంతో కనీసం పనిచేసుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. నెలవారీ మందులు, ఇతర చిన్న చిన్న అవసరాలకు చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది. ముఖ్యంగా భర్తను కోల్పోయి దుఖంలో ఉన్న వితంతువులకు ఆర్థిక అండ లేకుండా పోయింది. వీరితో పాటు వివిధ శరీర అవయవాలు పనిచేయకపోవడంతో ఇతర పనులు చేసుకోలేని అనేక మంది వికలాంగులు కూడా ఆర్థిక సమ స్యలను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం వీరి పట్ల కనికరం చూపడంతో ప్రతి నెలా వికలాంగులు రూ.3016చొప్పున, వృద్దులు, ఇతర పింఛన్‌దారులు రూ.2016 చొప్పున అందుకోనున్నారు. కొత్త పింఛన్ డబ్బులను ఆయా జిల్లాలో నేటి నుంచి లబ్దిదారులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచి లబ్దిదారులకు అందజేస్తాం : జాదవ్ శేషారావు, ఏపీఓ పింఛన్, ఆదిలాబాద్
ప్రభుత్వం 57ఏండ్లు నిండిన వారితో పాటు వివిధ అర్హతలు కలిగిన వారికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఇటీవల పింఛన్‌కార్డులు కూడా అందజేశాం. ప్రస్తుతం వారందరికీ ప్రభుత్వం డబ్బులు మంజూరు చేసింది. వీటిని మున్సిపాలిటీ, గ్రామాల వారీగా నేటి నుంచి లబ్దిదారులకు అందజేస్తాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత లబ్దిదారులు వారి పరిధిలోని బీపీఎంల వద్ద ఆధార్‌కార్డు, పింఛన్ఐడీ, రెండు పాస్‌ఫోటోలతో నూతన బ్యాంకు ఖాతా తెరవాలి.