Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
కొంత కాలంగా ఆసరా పింఛన్ కోసం ఎదురు చూస్తున్న అబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే జోగు రామన్న ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. పట్టణంలోని స్థానిక జనార్దన్ రెడ్డి గార్డెన్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలంతా సుఖ జీవనం గడపాలన్న సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బృహత్తర పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను మర్చిపోకుండా కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులందరికీ ఆసరా పింఛన్ కార్డులు అందించబడతాయని హామీ ఇచ్చారు. పట్టణంలో 57 సంవత్సరాలు నిండిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కొత్తగా 2,737 కార్డులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. వయో వృద్ధులతో పాటు వితంతువులకు, వికలాంగుల ఆత్మగౌరానికి గుర్తింపునిచ్చింది తమ ప్రభుత్వం మాత్రమేనని గుర్తు చేశారు. అక్టోబర్ మాసం నుండి నూతన లబ్దిదారులకు పెన్షన్ నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ వార్డుల వారిగా నియమించిన ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు కార్డులను పంపిణీ చేస్తారని తెలిపారు. నూతన లబ్ధిదారులతో పాటు పాత వారికి సైతం కొత్త కార్డులను అందచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ జహీర్ రంజాని, కమిషనర్ శైలజ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అజరు, కౌన్సిలర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.