Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయంత్రం బడి నుంచి రాగానే త్వరగా ఫ్రెషప్ అయి రండి స్నాక్స్ తిని హోం వర్క్ చేద్దురు గానీ! ''అంటున్న తల్లిని ''అమ్మా! ప్లీజ్ అమ్మా! ఒక్క గంటసేపు చందూ వాళ్ళతో ఆడుకొని వస్తాను'' దీనంగా అడుగుతున్న నితీష్ వంక ఉరిమి చూసింది.
''మీ టీచర్స్ ఇచ్చిన హోం వర్క్ ఏం చేస్తావ్! ఆటలకు వెళితే మీ తాతొచ్చి చేస్తాడా!'' నోర్మూసుకుని గబగబా ఫ్రెష్ అయి రా.. కసురుతూ గెదిమింది శిరీష.
''అమ్మ ఎప్పుడూ ఇంతే'' ఏడుపు మొహంతో ఫ్రెష్ అయి వచ్చి బుక్స్ ముందేసుకుని కూర్చున్నాడు నితీష్. ''ఒరేరు! అన్నయ్యా! ఇదిగో తిను బాగున్నాయి స్నాక్స్'' అంటున్న చెల్లిని చూస్తూ ''ఇదింకా యూ కేజీ కదా !దానికి తనలా బాధ లేదు. ఓ రెండు నోట్స్ రాసుకుని, తన బొమ్మలూ, టెడ్డీబేర్‌తో ఎంచక్కా ఆడుకుంటుంది''.
''నేనే చిన్నవాడినై పుడితే బాగుండేది.'' అనుకుంటూ ప్లేట్ తీసుకుని పక్కన పెట్టుకున్నాడు. అస్సలు తినబుద్ధి కాలేదు లేదు వాడికి.
పక్కింటి చందూ, రాంబాబు, దినేష్, గౌతమ్ మరికొందరు పిల్లలు కలిసి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్నారు. వాళ్ళ అరుపులు, అల్లరి వీనులకు విందుగా వినబడుతుంటే ''హోం వర్క్ తనను పట్టుకుని పీడించే భూతంలా కనిపిస్తోంది.'' హోం వర్క్ చేస్తున్నాడన్న మాటేగాని మనసంతా అక్కడే ఉంది. ఎంత రాసినా తరగడం లేదనిపిస్తోంది. అలా రాస్తూ రాస్తూనే పుస్తకాలపై తలవాల్చి నిదుర పోయాడు.
చూడనే చూసింది శిరీష.. దగ్గరగా వచ్చి గట్టిగా అరుస్తూ వీపు చరిచి మరీ లేపింది.
ఉలిక్కిపడిన నితీష్ ''అమ్మా! నిదురొస్తుందమ్మా! మిగిలింది రేపు ఉదయమే రాస్తాను'' అంటున్నా వినకుండా ''నీకు బాగా ఎక్కువైందిరా! ఇప్పుడు ఆటకు పొమ్మంటే లేడిపిల్లలా చెంగున ఎగురుతూ వెళ్ళేవాడివి. హోం వర్క్ అనే సరికి నిదురొస్తుందా!'' ''నీ పని ఇలా కాదురా'' అంటూ రెక్క పట్టి లేపి బరబరా షింక్ దగ్గరకు తీసికెళ్ళింది. ముఖం మీద మగ్గెడు నీళ్ళు జల్లి తీసుకొచ్చి కూర్చోబెట్టింది.
''మెడమీద కత్తిలా కనిపిస్తున్న అమ్మ మాటలు, హోం వర్క్.'' బిక్క మొహం వేసుకుని పూర్తి చేసి పడుకున్నాడు.
ఇదంతా గమనిస్తున్న తండ్రి సురేందర్‌కు బాధగా అనిపించింది.
''వాడు చదివేది ఫిఫ్త్ క్లాసే కదనోరు! ఎందుకంత ఇబ్బంది పెడతావు! పాపం వాడిని చూస్తే చాలా బాధగా ఉందోరు'' అంటున్న భర్త వంక చూస్తూ ''అవునవును నేనో బ్రహ్మరాక్షసిని, మీరేమో ప్రేమ స్వరూపులు. అన్నన్ని వేలు పోసి చదివిస్తున్నాం. రేప్పొద్దున మంచి గ్రేడ్ రాకపోతే అందరూ ఏమనుకుంటారు? అయినా వాడి భవిష్యత్తు కోసమే కదా నా తాపత్రయమంతా'' అంటుంటే మారు మాట్లాడకుండా మౌనంగా ఉండి పోయాడు.
ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చి భయం భయంగా తండ్రి చేతికి ఇస్తుంటే... ''ఒరేరు! పొద్దస్తమానం వెంట పడి చదివించేది నేనైతే మీ డాడీకి ఎందుకురా ఇస్తున్నావు!'' అని లాక్కుని చూసింది శిరీష. బి వన్ బిటు గ్రేడులు చూసి అదిరి పడింది.
''ఏంట్రా! ఈ గ్రేడులు. నువ్వు బడికి చదువుకోవడానికి పోతున్నావా? ఆడుకోవడానికా?'' వీరావేశంతో ఎడాపెడా నాలుగు వాయించింది.
''ఈ సారికి పోనీలేవోరు! అంటున్న భర్తను కసురుతూ ''మీరలా వెనకేసుకు రాబట్టే వీడిలా తయారయ్యాడు'' మా ఫ్రెండ్ లత కొడుకు, రమణి కూతురు వాళ్ళ క్లాసుల్లో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకేనట.
''వీడేంది మొదట్లో బాగానే ఉన్నోడు రాన్రానూ ఇలా తయారవుతున్నాడు'' అంటూ నానా రాద్దాంతం చేసింది.
ఇంత జరిగిన తరువాత తల్లి పెట్టిన అన్నం నితీష్‌కు తినబుద్ది కాలేదు. మొహం మార్చుకుని తినకుండా అలాగే కూర్చున్నాడు.
''కడుపులో మాడితే నువ్వే తింటావ్!'' కోపంగా ప్లేట్ తీసి సింక్‌లో వేసింది.
మరుసటి రోజు ఉదయం బడికి పోబుద్ది కాలేదు. ఆకలిగా నీరసంగా ఉంది నితీష్‌కు. అయినా తల్లిపెట్టిన టిఫిన్ తినకుండానే బడికి వెళ్ళి పోయాడు .
గ్రేడుల విషయమేమిటో తెలుసుకుందామని వెళ్ళింది శిరీష.
''మీ కోసమే కబురు పెడదామని అనుకుంటూ ఉన్నాం''అన్న ప్రిన్సిపాల్ మాటలకు ఆశ్చర్యంగా చూసింది.
''అవును శిరీష గారూ! మీ వాడు ప్రేయర్లో కళ్ళు తిరిగి పడిపోతే గ్లూకోజ్ వాటర్ తాపించి మా స్టాఫ్ రూంలో పడుకో బెట్టాం. మీవాడు ఈ మధ్య బాగా డిస్టర్బ్‌గా ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్నాడట. తెలుగు టీచర్ దగ్గర కొంచం చనువు ఎక్కువ. తనతో అన్నాడట ''ఫస్ట్ రాంక్ రాని వాళ్ళు వేస్టే కదా టీచర్! అని'' మా మేడం చెప్పింది.
''మీ వాడికి ఆటలంటే ఇష్టం. ఈ వయసులోనే ఆటల్లో చక్కని ప్రతిభ చూపిస్తున్నాడు.వాళ్ళను ప్రేమగా చదివించాలి. వాళ్ళ ఇష్టాన్ని గౌరవించాలి. అంతే గానీ వాళ్ళ మీద ఒత్తిడి తేవొద్దు. ఈ విషయమే మీకు చెబుదామని పిలుద్దామనుకునే లోగా మీరే వచ్చారు.''
''వాడిని ముందు డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్లి చూపిం చండి. ఓ వారం రోజుల పాటు ఇంట్లో ఉంచుకుని మీ ప్రేమ పంచండి. చదువు అదే వస్తుంది. ఆ పూచీ మాది. ముందు పిల్లవాడి గురించి శ్రద్ధ తీసుకోండి'' అంటున్న ప్రిన్సిపాల్ నిర్మల గారి మాటలకు ఆలోచనలో పడిపోయింది శిరీష.
కళ్ళు జలపాతాలవుతుండగా ''ఎక్కడ మేడం మావాడు?'' అంటుంటే స్టాఫ్ రూంకు తీసుకొని వెళ్ళింది అటెండర్ మంగమ్మ.
నిస్త్రాణగా పడుకున్న కొడుకును చూడగానే తను చేసిన తప్పు కళ్ళ ముందు మెదిలి చెంప చెల్లు మనిపిం చినట్టు అనిపించింది. ఒక్క ఉదు టున వెళ్ళి కొడుకును లేపి గుండెలకు హత్తుకుంది. తల్లి స్పర్శ కు మెలుకువ వచ్చిన నితీష్ భయంగా ''నేను ఈ సారి ఫస్ట్ రాంక్ తెచ్చుకుంటానమ్మా. నిజం అమ్మా! నన్ను నమ్ము'' అంటుంటే గుండె తరుక్కుపోయింది శిరీషకు.
''ఏం ఫరవా లేదు కన్నా! నువ్వు బాగుంటే నాకు అదే ఫస్ట్ ర్యాంక్ రా నాన్నా!'' తల నిమురుతూ ప్రిన్సిపాల్ కు చెప్పి కొడుకును తీసుకుని ఇంటికి బయలు దేరింది.
- వురిమళ్ల సునంద, 9441815722