Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనుగంటి వేణుగోపాల్, 9440236055
''ఏరా, కొండకు కొండలా ఉన్నావు. తోచినప్పుడు బడికి రాగానే సరిపోదు. బండ వెధవ! ఒక్క పద్యం కూడా రాకపోతే... ఎందుకురా?'' హుంకరించిండు నాగయ్య మాస్టారు.
విశ్వం తలవంచుకునే నిలబడి ఉన్నడు. చేతిలో తెలుగు పుస్తకం ఉంది. కానీ ఆ కుర్రాడికి నోరు తిరగడం లేదు.
ఆ పిల్లవాడికి తలకొట్టేసినట్టుగా అనిపించింది. నిలబెట్టి మరీ ఆడ పిల్లల ముందు మాస్టారు అంతలేసి మాటలు అంటుంటే... నూనూగు మీసాలు మొలుస్తున్న ఆ పదవ తరగతి అబ్బాయి మస్తిష్కంలో రోషం బుసలు కొట్టింది.
''అడ్డగాడిదలా పెరిగావు. పైగా ఓవర్ ఏజ్ ... పోనీ పాఠం అయినా చదవడం వచ్చునా? ఏదీ ఆ రెండో పాఠం తీసి మొదటి పేరా తప్పుల్లేకుండా చదువు చూద్దాం!'' అంటూ ఆగాడు మాస్టారు.
టక్కున రెండో పాఠం పేజీ తీసి పుస్తకాన్ని అలాగే పట్టుకుని నిలబడ్డాడు తప్ప... విశ్వానికి నోరు పెగలడం లేదు. అక్షరాలను కొత్తగా చూస్తున్నట్టు... పదాలను లోలోపలే కూడబలుక్కునే ప్రయత్నం చేస్తూ... వాక్యాలను పైకి చదవలేక పోతున్నాడా అబ్బాయి.
అందుకే నోరు మెదపడం లేదు. మౌనంగా మొండి పెన్సిల్ లా నిలబడి పోయిండు అట్లాగే.
''పాఠం కూడా చదవడం రాకపోతే ఎట్లరా? అందులోనూ మాతృభాష తెలుగు పలకడం రావడం లేదు నీకు. పదవ తరగతి వరకు ఎలా వచ్చావురా. పది ఎలా పాస్ అవుతాననుకున్నావ్? మమ్మల్ని చంపుకు తినడానికి బడికి రావడం కాకపోతే!''
''కూర్చో! చదువురాని వెధవ!'' అసహనంగా విశ్వాన్ని కూర్చోమని చెబుతూనే మరొక అబ్బాయిని లేపి పాఠం చదవమని పురమాయించాడు మాస్టారు.
చాక్మార్తో పెన్సిల్‌ను చెక్కినట్టు ఎడాపెడా మాస్టారు తిట్టేస్తుంటే... తలకొట్టేసిన పెన్సిల్లా అయ్యింది పిల్లవాడి పరిస్థితి.
కానీ, చాక్మార్తో చెక్కనిదే పెన్సిల్‌కి ఉనికి లేదని, దాని పైనున్న అజ్ఞానపు చెక్క పొరను తొలగించనిదే అది రాయడానికి పనికి రాదని... లేకపోతే ఎందుకూ పనికిరాని కట్టె ముక్కలా వృధాగా పడి ఉంటుందని... ఆ పిల్లవాడికా సమయంలో తెలియడం లేదు.
*******
''అదేంట్రా! ఇయాల పగటిపూటే ఇంటికి అచ్చినవట'' పొలం నుండి వస్తూనే కొడుకు విశ్వాన్ని ఆరా తీసిండు రాములు.
మౌనం వహించిండు విశ్వం.
''కడుపునొప్పా? జ్వరమా?''నిలదీసిండు రాములు.
''సారు నొప్పి...'' చెప్పిండు విశ్వం.
''అదేందిరా... కొత్తగ సారు నొప్పేందిర?'' విడ్డూర పోయిండు రాములు.
''బదిలీపై బడికి కొత్తగా వచ్చిండే నాన్న. ఆ నాగయ్య సారుకు ఒక పద్యం రాగం తీయడం రాదు. చదువు సరిగ్గా చెప్తలేడు. ఆ పాఠం కూడ మంత్రాలు చదివినట్టే ఉరికురికి చదువుతడు. వశ పడక ఇంటికి వచ్చిన'' చాడీలు సమయానుకూలంగ అల్లిండు విశ్వం.
''గిట్ల ఇంటికత్తె నడుస్తదా! పెద్ద సారుకు చెప్పక పోయినవు బిడ్డ!'' అనునయంగ అడిగిండు రాములు.
''సారు కొత్తగ వచ్చిండు కద బాపు. కొద్ది రోజులు చూద్దామన్నరు దోస్తులు'' సర్ది చెప్పిండు విశ్వం.
''సారు ముచ్చట పక్కనపెట్టు. నువ్వైతే మంచిగ చదువుకో బిడ్డ!'' అని కొడుక్కి సుద్ధులు చెప్పి లోపలికి నడిచిండు రాములు.
బుద్ధిగ తలూపిండు విశ్వం.
*******
''ఎలుక పిల్లంత ఉన్నడు. ఆ శేఖర్ గాడిని చూస్తే నీకెట్లా కొట్ట బుద్ధి అయ్యిందిరా వెధవ?'' నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్న శేఖర్ వంక చేయి చూపిస్తూ బిగ్గరగా అరిచిండు మాస్టారు.
ఏడుస్తున్న శేఖర్ నోరు మెదపలేదు గాని ''నోట్స్ ఇవ్వమని విశ్వం గాడు శేఖర్ని అడిగిండు సార్! వాడు ఇవ్వనంటే విశ్వం కొట్టిండు సార్!'' అడగకుండానే లేచి అసలు విషయం చెప్పి, సారు సైగ చేయంగనే తిరిగి కూర్చున్నడు మరో కుర్రాడు కిరణ్.
''ఆహా... మహారాజుగారు బడికి సరిగ్గా రారు. ఓ చదవడం రాదు. పాపం రాయడం అసలే రాదు. మొద్దు వెధవవి! ఎప్పుడు పడితే అప్పుడు బడి ఎగ్గొట్టి కైకిలుకు, పనులకు పోతవు. త్వరలోనే పరీక్షలు కదా! నోట్స్ చూపించకపోతే మరి మార్కులు రావు కదా! అందుకని నీ తాపత్రయం అన్నమాట.
నువ్వు అడగ్గానే తరగతిలోని పిల్లలందరూ వరుస కట్టి నీకు నోట్స్ ఇవ్వాలి. లేకపోతే మీద ఎగబడి రాక్షసుడి లాగ కొడతావన్నమాట'' విశ్వం వంక కన్నెర్ర చేసి చూసిండు నాగయ్య మాస్టారు.
తన చేయెత్తు ఎదిగి ఉన్న ఆ కుర్రాడిని పై చేయి చేసుకోవాలని అనిపించడం లేదా మాస్టారికి. కాకపోతే బిగ్గరగా కేకలు వేస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు.
విశ్వం తల వంచుకుని... బెల్ కొట్టడానికి దూలానికి వేలాడ దీయబడే ఇనుప కడ్డీలా నిలబడ్డడు తప్ప, రవ్వంత భయం గాని, బెరుకులాంటివేవీ ఆ పిల్లవాడి కనుపాపల్లో ప్రతిబింబించడం లేదు మాస్టారుకి.
''ఎఫ్ వన్ పరీక్షలున్నాయి. నేను చదువుకోవాలి. నోట్స్ ఇవ్వనన్న సార్! దొరక వట్టి వంచి దభీదభీ మని వెన్నులో పిడి గుద్దులు గుద్దిండు సార్! కొద్దిసేపు మొస మర్లలే'' ఏడుపు ఆపకుండనే ముఖంలో బాధ కనబడుతుంటే మాస్టారికి ఫిర్యాదు చేసిండు శేఖర్.
''ఈ విషయం వాళ్ల నాన్నకు తెలిస్తే, నా కొడుకుని కొడతావా? అంటూ ఆవేశంగా ఉరికి వచ్చి నిన్ను తంతడు.సరేనా వెధవ?'' కోపంగా మందలించిండు నాగయ్య మాస్టారు.
''నేను చెప్త సార్! వీడు ఉత్త్తుత్తగనే కొట్టిండని మా నాన్నకు చెప్పి వీడ్ని కూడా తన్నిస్త సార్!'' ఏడుపు ఆపి ఒకటో తరగతి కుర్రాడి లాగ ఆవేశాన్ని ప్రకటించిండు శేఖర్.
''అర్థమైతుందారా విశ్వంగా! వాళ్ళ నాన్న వచ్చి నిన్ను చితక బాదుతడు. ఇది తెలిసి బడి మీదికి మీ నాన్న ఉరికి వస్తడు. ఇక పంచాయతీ షురూ! సార్లకు వేరే పనేం లేదనుకుంటున్నార్రా!'' చిరాకు పడ్డడు నాగయ్య మాస్టారు.
చేసిందంతా చేసి.. ఒక్కమాట పెగలకుండ నిలబడ్డడు విశ్వం.
అప్పటికింకా కోపం తగ్గి పూర్తిగా ఏడుపు ఆపేసిండు శేఖర్.
''ఊర్కోరా శేఖర్! తరగతిలోని విషయం మీ ఇంటి దాకా మోసుకు పోకు. వాడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటా గాని...'' శేఖర్ కి నచ్చ చెబుతూనే విశ్వం వైపు చూస్తూ ''ముందు వీడికి క్షమాపణలు చెప్పరా!'' అంటూ ఆదేశించిండు నాగయ్య మాస్టారు.
బెట్టు చేయకుండా శేఖర్ వైపు చూస్తూ ''సారీరా!'' అన్నాడు విశ్వం.
''అలా దూరంగా నిలబడడం కాదు. వెళ్లి శేఖర్ గాడి చేయిలో చేయి కలుపు'' అంటూ పురమాయించిండు నాగయ్య మాస్టారు.
శేఖర్ కి దగ్గరగా వెళ్లి చేయి అందించిండు విశ్వం. ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాక తిరిగి తన బెంచి దగ్గరకు వచ్చి నిలబడ్డడు విశ్వం.
''సోదరులుగా, మిత్రులుగా మెలగాల్సిన మీరంతా ఒకరినొకరు కొట్టుకోవడం లాంటి పనులు మరొకసారి చేయకండి. దీన్ని చివరి హెచ్చరికగా భావించండి. లేకపోతే మీ తల్లిదండ్రులను పిలిపించి పెద్ద సారుకు చెప్పి టీసి ఇప్పించి పాఠశాల నుండి పంపించడం జరుగుతుంది. ఇకనుండి జాగ్రత్తగా ఉండండి'' తరగతిలోని పిల్లలందరినీ ఓవైపు హెచ్చరిస్తూనే వాళ్ళిద్దర్నీ కూర్చోమని చేత్తో సైగ చేసిండు మాస్టారు.
*******
''నాన్నా!నేను బడి మానేస్తాను'' కరాఖండిగా చెప్పిండు విశ్వం తన తండ్రి రాములుతో.
''అట్లాగే! రెండు పశువులు కొనిస్తా! వాటిని మేపుకుంటూ బతుకుదువు'' ముఖాన్ని ఎర్రగ చేసుకుంటూ గట్టిగా అన్నడు రాములు.
చప్పున విశ్వం నోరు మూత పడింది.
కాసేపు గడిచాక,
''అది కాదు నాన్నా!...'' గొణికిండు విశ్వం.
''అవన్నీ నాకు చెప్పకు. బడికి ఎందుకు పోవు?''
''ఆ బడికి పోను. పట్నంల చదువుకుంట!''
''ఆ... ఇక్కడ మార్కులు రాశుల కొద్దీ వస్తున్నయి. ఇగ అక్కడికి పోయి వెలగ బెడ్తవా?అసలేమైంది నీకు. ముందది చెప్పు''
''కొత్తగా వచ్చిన సారు మాటిమాటికీ కొడుతున్నడు. నోట్స్ చూపిస్తే, దిద్దుత లేడు. నాకేం మంచిగ అనిపించడం లేదు''
''సార్ మంచిగ లేకపోతే బడి మానేస్తరా? ఒకసారి మీ బడికి వచ్చి నేను మీ సార్ తో మాట్లాడ్తలే! వద్దంటే పెద్ద సారుతో మాట్లాడుతా''
''అయ్యో నాన్నా! అంత పని చేయకు. బడి మానివేయడం గురించి మళ్ళీ నేను ఆలోచించ! బడికి పోతాను'' తండ్రి బడి దాకా వస్తే తన అసలు విషయం ఎక్కడ బయటపడుతుందోనని గాభరా పడ్డడు విశ్వం.
మారు మాట్లాడలేదు రాములు.
*******
యస్ వన్ పరీక్షలు జరుగుతున్నాయి.
గదంతా కలియతిరుగుతూ పదవ తరగతిలో ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహిస్తున్నడు నాగయ్య మాస్టారు.
పిల్లలను మెడలు తిప్పనీయడం లేదు. ఒకరితో ఒకరిని సైగలు కూడా చేసుకోనివ్వడం లేదు.
పరీక్ష మొదలై గంట అయ్యింది. వచ్చినవాళ్లు సంతోషంగా జవాబులు రాస్తున్నరు. రాని వాళ్ళు ఏదో అయింది అనిపిస్తున్నారు. విశ్వం మాత్రం పేపరు మీద పెన్ను పెట్టింది లేదు. అక్షరం ముక్క రాసింది లేదు.
ఏదో ఒకటి అయితే అయిందిలే అని ధైర్యం చేసిండు. మెల్లగా చెడ్డీలో దాచుకున్న చీటీ ఒకటి బయటకు తీసి గబుక్కున క్వశ్చన్ పేపర్ కింద ప్యాడ్ కి పెట్టేశాడు.
ఎవరి కంట పడకూడదని మనసులో అనుకున్నాడో ఆ మాస్టారుకి దొరకనే దొరికిండు.
''వెధవ! నేనుండగానే నీకెంత ధైర్యంరా!'' అని అరుస్తూ పరుగుపరుగున అతడి దగ్గరకు వెళ్లిండు నాగయ్య మాస్టారు.
వెనుక వైపు నుండి మాస్టారి గొంతు వినబడంగనే కంగారు పడిపోయిండు విశ్వం.
అప్పటికే ఆ చీటీని తన చేతిలోకి తీసుకున్నడు. దానిని మడిచి కిటికీ అవతలకు విసిరి వేయబోయిండు.
కానీ వేగంగా వచ్చిన మాస్టారు విశ్వం చేయిని దొరక బుచ్చుకున్నడు.
''స...సారీ సర్!'' భయం భయంగా అన్నడు విశ్వం.
''చేసిందంతా చేసి, సారీ ఏంట్రా సారీ! లే... ముందు లేచి నిలబడు'' హుంకరించిండు మాస్టారు.
టక్కున లేచి నిలబడ్డడు విశ్వం.
బలవంతంగా ఆ పిల్లవాడి చేతిలోని చీటీని, ప్యాడ్ ని గుంజుకున్నడు మాస్టారు.
''వద్దు సార్! ఏమి రాయలేదు. మరొకసారి ఈ పని చేయను. సారీ సార్!'' వేడుకుంటున్నడు విశ్వం.
ఆ కుర్రాడు బయట అందరికీ తన గురించి నెగిటివ్ గా చెబుతున్నాడన్న విషయం ఇతర స్టూడెంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తోంది మాస్టారికి.
దానిని మనసులో ఉంచుకోకుండా.
''నువ్వు చేస్తున్న పనికి డిబార్ చేయాలి. మళ్లీ పరీక్షలు రాయకుండా!కానీ వదిలేస్తున్నాను. ముందు బయటకు నడువు'' అన్నడు సీరియస్ గా.
మాస్టారు బయటకు వెళ్లగొట్టకుండా ఉండడానికి ఆ కుర్రాడు శతవిధాల ప్రాధేయపడ్డడు. అయినా ఆయన కనికరించలేదు.
తల వంచుకొని అవమాన భారంతో పరీక్ష గది నుండి బయటకు కదిలిండు విశ్వం.
*******
కొడుకుని తీసుకుని ఇంటికి వచ్చిన రాములు చేసిన విష్ కి ప్రతి నమస్కారం చేసి కూర్చోమన్నడు మాస్టారు.
కూర్చోలేదతను.
''నిన్నెందుకు పిలిపించానంటే... పదవతరగతిలో నీ కొడుకొక్కడే చదువులో బాగా వీక్‌గా ఉన్నడు. ఆపై నెలలో జరగబోతున్న వార్షిక పరీక్షలకు కనీసం ఇప్పటినుండైనా చదవకపోతే పాసవడం కష్టం. మీ వాడ్ని ఆకూలీ పనులకు, క్యాటరింగులకు పంపడం మానుకోవాలి'' అంటూ నచ్చచెప్పిండు మాస్టారు.
''అవన్నీ బందుపెట్టుడంటే మాకెలా కుదురుతుంది సారూ? బట్టకు, పొట్టకు ఎల్లాలంటె... ఇంట్ల అందరం పన్జేయక పోతె పూట గడువదు సారూ!'' బాధపడ్డడు రాములు.
''ఒక పనిచెయ్! ఈ రెండునెలల పదిహేను రోజులు విశ్వాన్ని నా దగ్గరే ఉండనివ్వు! వాడి తిండి విషయం, బట్టల విషయం నేను చూసుకుంట! మ్యాథ్స్, సైన్స్ కూడా మాస్టార్లతో చెప్పిస్తాను. నువ్వు ఒప్పుకోవడమే ఆలస్యం'' అన్నడు మాస్టారు.
మాస్టారు మంచితనానికి రాములు పరేషాన్ అయ్యిండు. చప్పున రెండు చేతులెత్తి మాస్టారుకు దండం పెట్టిండు.
'సారు గురించి బయట చెడు చెబితే... ఆయన తన మేలు కోరుతున్నడు... ఎంత గొప్ప మనసు!' విశ్వం కళ్ళల్లో నీళ్ళూరినయ్! అరిగిన చాక్ పీస్ లా తలవంచుకొని నిలబడ్డడు విశ్వం.
ఎత్తిన చేతులు దించకుండనే ''మీరెట్లంటే అట్లనే సారూ! ఎటు జేసి నా కొడుకు పదోది పాసు కావాలె!'' అన్నడు రాములు.
''పుస్తకాలిచ్చి వాడిని ఈరోజే సాయంత్రం పంపించు'' చెప్పాడు మాస్టారు.
తలూపుతూ కొడుకును వెంటబెట్టుకొని వెళ్ళిపోయిండు రాములు.
*******
ఆనందంతో నాగయ్య మాస్టారు దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చిన విశ్వం ''సార్! మీ చలవ వల్ల పదవతరగతి పాసయ్యాను. జిపియే 6.7 వచ్చింది'' అని చెబుతూ వంగి ఆయన పాదాలకు నమస్కరించాడు.
విశ్వాన్ని రెండు చేతులతో ప్రేమగా లేవనెత్తుతూ ''ఇందులో నా చలవ ఏముంది! నీ కృషి, పట్టుదల వల్ల ఇదంతా సాధ్యమైంది. మనలో ఉన్న బలహీనతలను అధిగమిస్తూ, లోపాలను సవరించుకుంటే దేన్నైనా సాధించవచ్చు. ఎందులోనైనా విజయం చేజిక్కించుకోవచ్చు'' తన హర్షాన్ని తెలియబరిచాడు మాస్టారు.
తిరిగి ''అది సరే! ముందు ఇంటర్లో అడ్మిషన్ తీసుకో! అలాగే పాల్టెక్నిక్ ఎంట్రెన్స్ కు కూడా అప్లై చెయ్! సీటొస్తే పాల్ టెక్నిక్ వైపు వెళ్ళవచ్చు'' అంటూ తగు సూచనలు అందించిండు.
బుద్దిగా తలూపిండు విశ్వం.
''జయీభవ!'' మనస్ఫూర్తిగా అభినందించిండు నాగయ్య మాస్టారు.