Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొక్కొరోకో... కొక్కొరోకో...
ఈ కోళ్ల అరుపులు వినలేక చస్తున్నాం. తెల్లవారక ముందే లేచి ఒకటే అరుపులు. ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్ర పోనివ్వవు. వెధవ కోళ్లు. పెద్దలనే కాదు పిల్లలనూ పడుకోనివ్వవు. ఈ మాయదారి కోళ్ల బాధ ఎప్పుడు విరగడ అవుతుందో! రామాపురం గ్రామంలో ప్రతి ఒక్కరి నోటా.. ఇదే మాట. చిన్నా పెద్దా, ఆడా మగా అందరూ కోళ్ల గురించే మాట్లాడుకోసాగారు. ఊరి వారి మాటలు కోళ్లు విన్నాయి. కన్నీరు కార్చాయి. ఊర్లోని కోళ్లన్నీ సాయంత్రం ఊరి చివర మర్రి చెట్టు వద్ద కలుసుకోవాలని నిర్ణయించాయి. అనుకున్నదే తడవుగా కోళ్లన్నీ ఊరి చివరకు నడక సాగించాయి. కోళ్లన్నీ చెట్టు కిందకు చేరుకున్నాయి. కోళ్లు మాట్లాడాలని అనుకున్నా మాట రావటం లేదు. ఊరి వారి మాటలు వాటిని అంతలా బాధించాయి. ఏ కోడి కంట్లో చూసినా కన్నీరు ఆగటం లేదు. కొన్ని కోళ్లు నిలబడలేక మౌనంగా కూర్చొని రోదిస్తున్నాయి.
ఇంతలో ఊరంతటికీ పెద్దదైన పుంజు కోడి లేచి నిలబడింది. మిత్రులారా ! ఊరంతా మనం చేసిన మేలు మర్చిపోయింది. ఇప్పుడు ఎవరికీ కానివారం అయ్యాము. మనం మన కోసం కాదు.. ఊరి కోసం బతుకుతున్నాం. అయినా ఊరు గుర్తించలేదు. మనం ఊరి కోసం ఎంతో త్యాగం చేశాం. మనల్ని పెంచుకుంటూనే, మన మాంసాన్ని తిన్నారు. వారి పిల్లల బలం కోసం మన గుడ్లను తిన్నా భరించాం. అయినా వారు మనల్ని ద్వేషిస్తున్నారు. మనం నిద్ర మానుకుని వారిని నిద్ర లేపుతున్నాం. ఇదంతా మన కోసమా ! కాదు. వారు ఉదయాన్నే పొలాలకు వెళ్లాలంటే మనం నిద్ర లేపాలి. ఇప్పుడు వారు లేవలేక మన మీద నిందలేస్తున్నారు. పిల్లలు తెల్లవారుజామున లేచి చదివితే బాగా వస్తుందంటారు. వారి భవిష్యత్తు కోసం మనం నిద్ర మానుకుని లేపటం తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. ఊరు మొత్తం వారి పనుల్లో నిమగం కావాలంటే ఉదయం నిద్ర లేవాలి. పక్క ఊరిలో పనులకు పోయో వారిని మనమే నిద్ర లేపుతున్నాం. వారు లేవకపోతే మన తప్పెలా అవుతుంది? మన పని మనం చేస్తున్నప్పుడు.. వారి పని వారు చెయ్యాలిగా అన్నది. పుంజుకోడి మాటలను అన్ని కోళ్లు సమర్థిస్తున్నట్లుగా కొక్కొరోకో అని అరిచాయి. ఒక కోడి లేచి నిలబడి మనల్ని ఇంతలా అవమానించిన రామాపురం వదిలిపోదాం అన్నది. మరో కోడి లేచి మనం ఇంతకాలం మనుషుల మధ్యనే బతికాం. ఇప్పుడు ఎక్కడకు పోతాం అన్నది. కోళ్లన్నీ ఒక్కసారిగా లేచి అడవిలోకి పోదాం అన్నాయి. కోళ్లన్నీ ఒక్క మాట మీద నిలబడటంతో పుంజుకోడి అంగీకరించింది. దాంతో కోళ్ళన్నీ అడవి బాట పట్టాయి.
మొదటిసారిగా అడవిని చూసిన కోళ్లకు భయం వేసింది. పుంజుకోడి మిగతా కోళ్లను ఉద్దేశించి అడవి మనకు కొత్త. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. అలాగే క్రూరజంతువుల కంటబడకుండా జాగ్రత్తగా ఉండాలి. శాకాహార జంతువులతో ప్రమాదం లేదు. అడవిలో అన్ని దారులు తెలిసేంత వరకు మనమంతా కలిసి ఉండాలి. చీకటిపడే సమయానికి అందరూ ఇక్కడకు చేరుకోవాలి. కోడి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి అన్నది. మిగతా కోళ్లన్నీ సరేనన్నాయి. ఆ రాత్రి కోళ్లన్నీ చెట్టు కిందే నిద్రించాయి. అలవాటు ప్రకారం తెల్లవారక ముందే కోళ్లన్నీ కొక్కొరోకో అని అరిచాయి. వాటి అరుపులతో అడవి ప్రతిధ్వనించింది. కొత్త అరుపు వినబడటంతో అడవి జంతువులు ఉలిక్కిపడి లేచాయి. పూర్తిగా తెల్లవారక పోవటంతో ఎవరూ కనపడలేదు. రెండోరోజు, మూడోరోజు కూడా కోళ్లు వాటి అరుపు మానుకోలేదు. అలా కొద్ది రోజులకు కొత్త అరుపు పాత అరుపుగా మారిపోయింది. కోళ్ల అరుపు కారణంగా జంతువుల దైనందిన కార్యక్రమాల్లో మార్పు వచ్చింది. ఎవరు అరుస్తున్నారో తెలియకపోయినా ఉదయం లేవటం జంతువులకు అలవాటయింది. ఉదయం లేవటం వాటికి ఆనందంగా ఉంది. దాంతో అవి తమ పనులు త్వరితగతిన పూర్తి చేసుకోసాగాయి. పిల్ల జంతువులకు కావల్సినవి అందజేయసాగాయి. ఆ తర్వాత జంతువులు పిల్లలను ముస్తాబు చేసి తల్లిదండ్రుల వద్ద వదిలి వేటకు బయలుదేరేవి. ఉదయాన్నే వేటకు పోవటం వల్ల చీకటి పడకముందే నివాసాలకు చేరుకునేవి. ఒకప్పుడు వేటకు వెళ్లిన జంతువులు ఏ సమయానికి వస్తాయో తెలిసేది కాదు. పిల్ల జంతువులు కూడా తల్లిదండ్రుల కోసం వేచి చూసి చివరకు నిద్రించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. జంతువులన్నీ కోడి కూత వినపడగానే ఉత్సాహంగా తమ పనుల్లో నిమగమయ్యోవి.
జంతువుల్లో వచ్చిన మార్పుని మృగరాజు సింహం గమనించింది. ఒకరోజు జంతువులను తన గుహకు పిలిపించుకుని మార్పుకు కారణం అడిగింది. దానికి జంతువులు తెల్లవారుజామున కొక్కొరోకో అనే కూత తమను మేల్కొలుపుతుందని చెప్పాయి. సింహం ఆశ్చర్యపోయింది. కొక్కొరోకో అనే అరుపు అడవి జంతువులది కాదు. ఈ కొత్త అరుపు ఎవరిది? ఎక్కడ నుంచి వస్తుంది? ఆలోచించింది. మంత్రి ఎలుగుబంటిని పిలిచి విషయం తెలుకోమని ఆదేశించింది. సాయంత్రానికి ఎలుగుబంటి కోళ్లను గుర్తించి వాటిని సింహం ముందుంచింది. సింహాన్ని చూడగానే కోళ్లన్నీ వణికి పోసాగాయి. సింహం భయపడవద్దని వాటికి అభయమిచ్చింది.
మీరు అడవికి కొత్తలా ఉన్నారు. ఎక్కడ నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించింది. పుంజుకోడి లేచి మృగరాజా ! ఒకప్పుడు మనుష్యులకు ఎన్నో విధాలా సహాయపడిన మేము ఇప్పుడు కానివారమయ్యాం. విధిలేని పరిస్థితుల్లో ఊరు వదిలి అడవికి చేరుకున్నాం. మీరు దయతలచి ఆశ్రయమిస్తే అడవిలో ఉంటాం.. లేదంటే పోతాం అన్నది. దానికి సింహం ... మీ రాకతో అడవి జంతువుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. వేళకు నివాసాలకు చేరుకుంటున్నాయి. ఖాళీ సమయాన్ని పిల్ల జంతువులతో గడుపుతున్నాయి. మనుషులు వద్దనుకోవచ్చు. కానీ మీరు మాకు కావాలి... మీ అరుపు నిత్యం వినాలి. మీ ఇష్టం ఉన్నంతకాలం అడవిలో ఉండొచ్చు. మీకు ఎటువంటి ప్రాణభయం ఉండదు అన్నది. సింహం మాటలకు కోళ్లన్నీ ముక్తకంఠంతో కొక్కొరోకో అని ఆనందంగా అరిచాయి.
- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర
9492309100