Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదొక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. కౌసల్య టీచర్ మూడవతరగతి గదిలోకి అడుగు పెట్టగానే పిల్లలంతా లేచి నిలబడి ''నమస్కారం టీచర్'' అంటూ అభివాదం చేసారు. కౌసల్య టీచర్ ప్రతి నమస్కారం చేస్తూ.. అందరినీ కూర్చోమంది. పిల్లల హాజరు తీసుకుంది. ఆ రోజు చెప్పవలసిన పాఠం కోసం తెలుగు పుస్తకం తెరచింది.
పిల్లలంతా టీచర్ వేయబోయే బొమ్మ కోసం కుతూహలంగా చూడసాగారు. కౌసల్య టీచర్ పాఠం చెప్పడమే గాకుండా ఆ పూట పాఠానికి సంబంధించిన బొమ్మ గీస్తుంది. అలా బొమ్మ గీయడంతో చెప్పిన పాఠం పిల్లల మనసులకు హత్తుకుపోతుంది. పాఠంలో ఏ ప్రశ్న అడిగినా పిల్లలకు బొమ్మ జ్ఞప్తికి వచ్చి జవాబు ఠకీమని చెబుతారు. టీచర్ నల్ల బోర్డు వైపు తిరిగి బొమ్మ గీచి వెనుతిరిగింది. పిల్లలు తెల్ల ముఖాలు వేసారు.
చిన్నగా నవ్వుతూ.. ''పిల్లలూ.. ఈ రోజు నేను గీచిన బొమ్మ ఏమిటో సరిగ్గా తెలియడం లేదు కదూ! కేవలం చుక్కలు మాత్రమే పెట్టాను. వానిని కలిపితే బొమ్మ ఏమిటో తెలుస్తుంది. ఎవరైనా వచ్చి చుక్కలు కలుపగలరా'' అంటూ ప్రశ్నించింది.
పిల్లలంతా పెదవులు విరిచి తల అడ్డంగా ఊపుతుంటే.. రవి ధైర్యంగా లేచి నిలబడి ''నేను కలుపుతా టీచర్'' అన్నాడు. టీచర్ సుద్దముక్కను రవి చేతికిచ్చి వీపు తట్టింది. రవి ఏ మాత్రమూ తడుముకోకుండా చుక్కలన్నింటిని చక్కగా కలిపాడు. టీచర్ మెచ్చుకుంటూ.. చప్పట్లు కొట్టింది. ఆ అద్భుత చిత్రం చూసి పిల్లలు గూడా చప్పట్లు కొట్టారు. రవి ముఖం వెలిగి పోయింది. తాను చుక్కలు కలిపిన బొమ్మను తదేకంగా చూడసాగాడు. సూర్య కిరణాలకు విచ్చుకున్న తామర పుష్పం. ''రవీ.. నీకు మంచి భవిష్యత్తు ఉంది. చాలా చక్కగా గీసావు'' అని మెచ్చుకుంది.
''డ్రాయింగ్ టీచర్ గూడా రవిని మెచ్చుకుంటుంది'' అన్నారు పిల్లలంతా. రవిని అడిగి అతని డ్రాయింగ్ పుస్తకం తీసుకొని చూసింది. బొమ్మలు చాలా చక్కగా ఉన్నాయి.
''రవీ నువ్వు ఇంట్లో గూడా బొమ్మలు గీస్తుంటావా!'' అడిగింది టీచర్. ''అవును టీచర్. మా చెల్లాయి గౌను మీద రకరకాల పూల బొమ్మలు గీస్తే మా అమ్మ రంగు దారాలతో కుడుతుంది'' అంటూ కళ్ళు పెద్దవిగా చేసుకొని సంభ్రమంగా చెప్పాడు. ఇంకా క్యాలెండర్‌లోని బొమ్మలు పలక మీద గీస్తుంటానని చెప్పాడు. పిల్లలంతా మరో మారు చప్పట్లు కొట్టారు. రవికి జేజేలు పలుకుతున్నట్టు బడిగంట మ్రోగింది.
ఆ రోజు నుండి రవి బొమ్మల గీయడం మీద మరింత శ్రద్ధ చూపించసాగాడు. ప్రతీ వేసవి సెలవుల్లో రకరకాల బొమ్మలు గీసేవాడు. అతని నైపుణ్యం చూసి రవి తల్లి ఎంతగానో పొంగి పోయేది. రంగులు, బ్రష్షులు కొనుక్కోడానికి డబ్బులు సర్దుబాటు చేసేది. కాని ఇదంతా రవి తండ్రికి ఇష్టముండేది కాదు. చదువు మీద శ్రద్ధ పెట్టమని గొడవ చేసే వాడు.
ఆ సంవత్సరం రవి పదవ తరగతికి పరీక్షలు రాసాడు. వేసవి సెలవుల్లో కలెక్టర్ ప్రోత్సాహంతో జిల్లాలోని సాంస్కృతిక విభాగం బడిపిల్లల కోసం వేసవి శిబిరం ఏర్పాటు చేసింది. అందులో పిల్లలకు బొమ్మలు గీయడంలోనూ, రంగులు వేయడంలోనూ మెలకువలు నేర్పసాగారు. చివరి రోజున పోటీ నిర్వహించి, గెలిచిన వారికి కలెక్టర్ గారు బహుమతులు ప్రదానం చేస్తారని శిబిరం నిర్వాహకులు ప్రకటన చేసారు. దాంతో విద్యార్థుల్లో డ్రాయింగ్ అభ్యసన మీద పట్టుదల పెరిగింది.
రవి నేర్పరితనం చూసి ''చిత్రం అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, అది ఆలోచింప జేయాలి. ఒక చిత్రంలో ఎన్నో భావాలు ఒలికించవచ్చు. దాన్ని చూస్తే కొందరిలోనైనా చైతన్యం రావాలి'' అంటూ ఆధునిక పద్ధతులు బోధించసాగారు మాష్టార్లు. వేసవి శిబిరం ముగిసింది.
ఆరోజు కలెక్టర్‌గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డ్రాయింగ్ పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అని తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు గూడా హాజరయ్యారు. ముందుగా వేదిక మీద విద్యార్థులు గీచిన చిత్రాలు ఒక్కొక్కటిగా ప్రదర్శించారు. చివరగా బహుమతులు గెలుచుకున్న చిత్రాలు వరుసగా తృతీయ, ద్వితీయ మరియు ప్రథమ చిత్రాలు ప్రదర్శిస్తుంటే ప్రేక్షకుల చప్పట్లు మారుమోగాయి.
ప్రథమ బహుమతి పొందిన రవి బొమ్మ చూసి అంతా ఆశ్చర్యపోయారు. అదొక మహత్తరమైన చిత్రం. దాని శీర్షిక పేరు 'మద్యం కాటేసిన కుటుంబం'. ఎంతో హృదయ విదారకంగా ఉంది. ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆ చిత్రాన్ని చూసి కలెక్టర్ రవిని అభినందిస్తూ.. తన హృదయానికి హత్తుకున్నాడు.
ఇంతలో ఒకతను వేదికి పైకి రావడంతో సభంతా ఆశ్చర్యంగా చూడసాగింది. అతను నేరుగా మైకు వద్దకు వెళ్లి ''నాపేరు నాగయ్య. నేను రవి నాన్నను. మా బాబు గీసిన చిత్రానికి ప్రథమ బహుమతి రావడం నాకెంతగానో గర్వంగా ఉంది. అది చూస్తుంటే మా కుటుంబం భవిష్యత్తు నా కళ్ళ ముందు కదలాడింది. ఇక ముందు నేను మద్యం ముట్టనని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను'' అంటూ ప్రతిజ్ఞ చేశాడు.
సభలో మరి కొందరు లేచి నాగయ్యతోబాటు 'మద్యం ముట్టం' అని ప్రమాణం చేసారు. అంత చిన్న వయసులో పెద్ద అర్థం వచ్చే ఆ చిత్రం కొందరిలోనైనా మార్పు తెచ్చిందని.. రవిని ఎంతగానో అభినందించారు కలెక్టర్. సభలో చప్పట్లు మిన్నంటాయి.
- చెన్నూరి సుదర్శన్, 94405 58748