Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతడు ఓ సమాధి దగ్గర నిలబడి ఉన్నాడు...
రాత్రి వెలుతురు అతడితో మాట్లాడసాగింది...
''ఇక్కడ సమాధి కెదురుగా నిలబడి నేను మాట్లాడలేను'' అన్నాడు అతడు.
''ఇక్కడెవెవరి సమాధి ఉన్నది?'' రాత్రి వెలుతురు ఎగిరి చూసింది.
''సమాధి పై ఎవరి పేరు లిఖించబడి లేదుగా'' ఆశ్చర్యబోతూ అంది.
''ఇది నా ప్రేమ సమాధి''
వెలుతురు చిరు నవ్వుతో అంది ''మరి నేను దీని పై నీ ప్రేమ పేరు రాసేయనా?''
''వద్దు...వద్దు'' అతడి కాళ్లు చేతులు వణకసాగాయి. ''ఈ శవం శరీరం పై ఏమీ రాయకు''
''ఈ శరీరం ఎప్పుడైనా సజీవంగా ఉన్నదా...''
అతడు గాబరా పడ్డాడు. అతడి శరీరంతో ఎవరిదో శరీరం సంధానమైనట్లనిపించింది!
రివ్వున గాలి వీచింది. అతని చొక్కా విదిలించబడింది. అది ఎన్నో చోట్ల చిరిగి పోయింది.
''ఈ ముళ్లు చాలా బాధకరమైనవి. ఒకప్పుడు ఇవి పూలు. వీటిని నేను నా ప్రియురాలి జడలో తురుమే వాణ్ని.
''ఈ సమాధి దగ్గర నిలబడి నువ్వు ఉన్మత్తుడైపోతావు. దూరంగా వెళ్దాం రా''
అతడు తల దించుకొన్నాడు.
''మాట్లాడవెందుకు?''
''ఇవి నా వాగ్దానాల సమాధులు.''
వెలుతురు అతని మొహం వైపు చూసింది.
''నేనో స్త్రీ తో వాగ్దానం చేశాను. నేనెప్పుడు కూడా ఆమె చేతిని వదలనని... నేను వాగ్దానం చేశాను ఆమె కోసం ఇల్లు కట్టుతానని... నేను వాగ్దానం చేశాను ఆమె తిండి బట్టల కోసం కష్టబడగనని... నేను వాగ్దానం చేశాను...''
''ఆ తర్వాత?''
''ఆమె వృక్షం లాంటి నా ఛాతిపై కోమలమైన లతలా నన్ను చుట్టుకొని ఉండేది.''
''మరి ఆ లతను ఎవరు తుంచేశారు?''
''వృక్షానికి మనిషికి మధ్య ఓ తారతమ్యముంటుంది. వృక్షానికి తన ఛాతిని చుట్టుకున్న లతను స్వయంగా విడదీసుకోవడం సాధ్యం కాదు. కాని మనిషి తనమెడలో వేసిన స్త్రీ బాహువులను స్వయంగా తీసేయగలడు.''
''లత విరిగిపోయినా, విదిలించబడినా వృక్షం మరో లతను తన ఛాతీతో కౌగిలించుకొంటుంది'' వెలుతురు అంది.
''మొగవాడు కూడా మరో స్త్రీ బాహువులను తన మెడలో వేసుకొంటాడు...''
''మొగవాడు కూడా మరో స్త్రీ బాహువులను తన మెడలో వేసుకొంటాడు... రెండవ స్త్రీవి... మూడవ స్త్రీవి... నాలుగవ స్త్రీవి...''
''వృక్షం శాఖలు బలంగానే ఉంటాయి.'' అతడు అన్నాడు. ఓ నిమిషం ఆగి, ''మానవుల బాహువులు బలంగానే ఉంటాయి. కాని వృక్షం మరియు మనిషిలో ఓ తేడా ఉంటుంది'' అతడు గట్టిగా ఓ నిట్టూర్పు విడుస్తూ మళ్లీ అన్నాడు, ''అప్పుడప్పుడూ నాకనిపిస్తోంది... నాలో... నాకు... ఎక్కడో ఓ చోట గాయం తగిలింది''
రాత్రి వెలుతురు మొహం పై చిరునవ్వు మెరిసింది.
''చనిపోయాయన్నీ. నా ప్రేమ చనిపోయింది. నా వాగ్దానాలు మరణించాయి... కాని నా జ్ఞాపకాలు ఎందుకు మరణించవు? ఈ సమాధుల మధ్య నా జ్ఞాపకాల సమాధి కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేదో...'' వాపోయాడతడు.
''నీకో అబ్బాయి ఉండేవాడు?''
''అబ్బాయి చనిపోయాడు. కాని అతని బట్టలు బ్రతికున్నాయి... కొన్ని సార్లు నాకనిపిస్తోంది... మా ఇంట్లో ఉన్న చిన్న ట్రంకు పెట్టెను బయటికి పారేశాక అది ఉయ్యాలగా మారిపోయింది. అందులో ఉన్న చిన్న చిన్న బట్టలు కేరింతలు పెట్ట సాగాయి. అంతేగాదు అవి నా వైపు తమ బాహువులను చాప సాగాయి. నా మనసును మురిపించే నత్తి పలుకులతో మాట్లాడసాగాయి. ఆ ఉయ్యాలలో నుంచి బయటకొచ్చి నా గదిలో బొర్లాడసాగాయి... అంతేకాదు... చిన్ని చిన్ని బట్టల్ని తమ చేతులతో పట్టుకొని, సంచి తీసుకొని బడికెళ్ల సాగాయి.''
రాత్రి వెలుగు గట్టిగా ఓ నిట్టూర్పు విడిచి, నెమ్మదిగా అడిగింది, ''ఆ అబ్బాయి తల్లి ఎక్కడుంది?''
''ఆమె జీవించి ఉంది. కాని నా వాగ్దానాలు, ప్రమాణాలు మరణించాయి. కాబట్టి ఆమె ఎక్కడున్నదో నాకు తెలియదు. కాని నా కనిపిస్తోంది... ఆమె ప్రతి స్త్రీ నోట్లో బ్రతికి ఉంది...''
''మరిప్పుడు నువ్వు ఏ స్త్రీ మొహమైన చూస్తున్నావా?''
''నేను స్త్రీ మొహం వైపు చూడను. నేను స్త్రీ శరీరం వైపు చూస్తాను.'' అతడు తన కండ్లు మూసుకొన్నాడు. మళ్లీ వెంటనే గాబరా పడుతూ, ''ఈ రాత్రి వెలుతురు భయంకరంగా ఉంది... మనిషికి తన గుండెలో నిర్మించబడిన సమాధులు కాన వస్తున్నాయి... అతడి శరీరం పై వేసుకోబడిన చొక్కా ముళ్ల కంపలో చిక్కుకోబడింది. ఇంట్లోంచి బయటకి పారేసిన చిన్ని చిన్ని గుడ్డలు పిల్లల్లా ఆడుకొంటున్నాయి... చీకటి అయిపోతే ఎంతబాగుండునో! ఉదయపు చీకటి... ఎవైరికేమి కనిపించకుండా... నాక్కూడా కనిపించకుండా...''
రాత్రి వెలుతురు కృంగిపోయింది. ఆకాశమంతా గాఢంగా ఉదయపు చీకటి వ్యాపించింది. ఈ పగలు చీకటిలో అతడు తన నలువైపులా దష్టిని సారించాడు. వెలుతురు బాధ ఎలా ఉన్నా తను మాత్రం తృప్తిగా ఊపిరి పీల్చాడు.
ఉర్దూ మూలం : అమ్రిత ప్రీతం
తెలుగు అనువాదం : అమ్జద్