Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోదావరి నది ఒడ్డునున్న ఏటిపాలెంలో ముప్పై మంది దాకా పల్లెకారులు చేపలు పట్టుకుని నివశిస్తుండేవారు. వారిలో గంగయ్య, గంగమ్మ అనే వృద్ధ దంపతులు పరమ ధార్మికులు. వారికి పిల్లలు లేరు. గంగయ్య చేపలను పట్టుకొస్తే, గంగమ్మ పక్కనున్న గ్రామాల్లో తిరిగి అమ్మి, వచ్చిన డబ్బుతో బియ్యం, సరుకులు కొనుక్కొస్తుండేది. వాళ్ళ గుడిసె పక్కనే బీమరాజు వుండేవాడు. వాడికి పెద్ద ధనవంతుడిని కావాలనే కోరికుండేది. అందుకోసం ఎప్పుడూ పక్కవాళ్ళను మోసం చేస్తుండేవాడు. వాళ్ళ బుట్టలో పడ్డ చేపల్ని ముందుగా వెళ్ళి తన బుట్టలో వేసుకునేవాడు.
ఒకనాడు గంగయ్య పడవ వేసుకుని నది మీదకు వెళ్ళాడు. వలను పలుమార్లు విసిరాడు కానీ ఒక్క చేపా పడలేదు. ఇంతలో చినుకులు మొదలయ్యాయి. చేపలు సంతోషంతో నీళ్ళలోంచి ఆకాశంలోకి గిరికీలు కొట్టసాగాయి. చివరిగా ప్రయత్నిద్దామని వల విసిరాడు. ఆశ్చర్యంగా వలనిండా చేపలు చిక్కాయి. వలను పడవలో విప్పి, ఒక్కో చేపనే తీయసాగాడు. అందులో ఒక బంగారు రంగు చేపకూడా వుంది. దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అందంగా వుందని. ''గంగయ్యా, చాలా కాలానికి పడింది వర్షం. పాతనీళ్ళు పులుపెక్కాయి. ఇప్పుడు పడ్డ వర్షంనీళ్ళు మాకెంతో తీపిగా వున్నాయి. అందుకే అందరం పండుగ చేసుకుంటున్నాం. మమ్మల్ని ఇప్పుడు పట్టుకుని చంపాలనుకోవడం భావ్యం కాదు'' అంది మనిషి భాషలో.
ఆశ్చర్యపడిన గంగయ్య ''ఏం చేయను తల్లీ, పుట్టిన మొదలు ఏటి మీదే చేపలు పట్టి జీవిస్తున్నాను. ఇవాళ చేపలు తీసుకపోకుంటే నేను, మా ఆవిడ పస్తు పడుకోవాల్సి వస్తుంది. మా కడుపులు కూడా నిండాలి కదమ్మా?'' అన్నాడు.
''మమ్మల్ని వదిలేస్తే నీకో వరమిస్తా. కోరుకో. జీవితాంతం హాయిగా బతకొచ్చు'' అన్నది బంగారు చేప.
''అమ్మా, కాటికి కాళ్ళు చాపుకున్న వాళ్ళం. మాకు పెద్దగా కోరికలేమీ లేవు. ఈ తిండి, బట్ట చచ్చేదాక వుంటే చాలు'' అన్నాడు.
''సరే, రోజూ నువ్వు సంతోషపడేన్ని చేపలు నీ వలలో పడతాయి. ఇప్పుడు వర్షం పడని దగ్గర వెతుకు'' అంది.
''మంచిదమ్మా'' అని వలలో పడిన చేపల్ని మెల్లిగా నదిలో వదిలాడు. అలాగే పడవ నడుపుకుంటూ నది దిగువకు వెళ్ళాడు. కొద్ది దూరం తర్వాత వర్షం లేదు. అక్కడ వల వేశాడు. మూడు పెద్ద చేపలు పడ్డాయి. వాటిని పడవలో వేసుకుని ఒడ్డుకు చేరాడు. ఆనందంగా బుట్టలో వేసుకుని ఇంటికి చేరాడు. గంగమ్మ వాటిని అమ్మి ఇంట్లోకి సరుకులు, బియ్యం కొనుక్కొచ్చింది. ఆ రాత్రి నది మీద బంగారు చేపతో జరిగిన సంభాషణ బార్యతో చెప్పాడు.
''ఈ బువ్వ వుంటే చాలు, మంచంలో పడి అనారోగ్యంతో నవిసి చావకుండా, నిద్రలో ప్రాణం పోతే అదే పదివేలు'' అంది గంగమ్మ తృప్తిగా.
గంగయ్యకు రోజూ చక్కగా చేపలు పడసాగాయి. వాటితో సరుకులు, బియ్యం, బట్టలు తెచ్చుకున్నాడు. కురుస్తున్న తన గుడిసెను పనివాళ్ళతో కప్పించుకున్నాడు. సున్నం వేయించుకుని, ఇల్లు శుభ్రం చేయించుకున్నాడు. గంగయ్య సంసారంలో జరిగే మార్పును చూసిన బీమరాజుకు కన్నుకుట్టింది. భార్యతో అదేపనిగా చర్చించాడు. రహస్యమేందో తెలుసుకోవాలని, గంగయ్యవెంట నదివైపు వెళ్ళాడు. మెల్లగా మాటల్లో పెట్టి ''రోజూ నీకు చేపలు చక్కగా పడుతున్నాయి. రహస్యమేందో కాస్త చెప్పవా పెద్దయ్యా?'' అని మెల్లగా అడిగాడు ప్రాధేయపూర్వకంగా.
గంగయ్య దాచుకోకుండా వర్షం పడ్డనాటి సంగతి వివరంగా చెప్పాడు. భీమయ్యలో క్రూరమైన ఆలోచన మొదలైంది. ఎలాగైనా ఆ బంగారు చేపను పట్టుకుని, కావలసిన వరాలన్నీ కోరుకోవాలనుకున్నాడు. మరసటి రోజు బట్టల కోసం గంగయ్య దంపతులు పట్నం బయలుదేరారు. ఇదే మంచి సమయమనుకుని వలతో ఏటిమీదకు వెళ్ళాడు. అప్పుడే సన్నటి చినుకులు మొదలయ్యాయి. చేపలు సంతోషంతో గంతులు వేస్తున్నాయి. వాటి మధ్యకు వెళ్ళి వల విసిరాడు. బంగారు చేపతో పాటు చాలా చేపలు పడ్డాయి. వాటన్నిటినీ వలతో సహా ఒడ్డుకు తెచ్చాడు. ''వర్షానికి పండుగ చేసుకుంటున్న మమ్మల్ని వదిలెయ్యి. నువ్వు కోరుకున్న వరమిస్తా, మా ప్రాణాలు తీయకు'' అంది బంగారు చేప.
''అమ్మా, నీ గురించి గంగయ్య అంతా చెప్పాడు. ఒక్క వరం కాదు, రోజుకో వరం కావాలి నాకు'' అని పడవను కట్టేసి చేపలను తాటాకు బుట్టలో వేసుకుని ఇంటికి వెళ్ళాడు. భార్యకు జరిగిన సంగతంతా చెప్పి, బంగారు చేపను ఒక కుండలో వేసి దాని నిండా నీళ్ళుపోసి మూత పెట్టి మూలకు పెట్టాడు. ఒంటరి చేప దిగులు పడుతున్నట్లు సన్నగా శబ్దం చేయసాగింది. మిగిలిన చేపల్ని చంపి, కూర వండుకుని తిన్నారు దంపతులు. ఆ రాత్రి ఏం వరం కోరుకోవాలో ఇద్దరూ చర్చించుకోసాగారు. ధనం, బంగారం, భవంతులు, భూములు ఇలా జాబితా సిద్దం చేసుకున్నారు. ఇంతలో ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. చెట్లు కూలిపోసాగాయి. నది పొంగి పొర్లసాగింది. వరద గుడిసెల్ని చుట్టుముట్టింది. విలువైన వస్తువులు తీసుకుని ఎగువకు వెళ్ళసాగారు పక్కనున్న ఇండ్లవాళ్ళు. భీమరాజు దంపతులు కంగారుగా తమ సామాను మూట కట్టుకోసాగారు. కట్టిన మూటను భార్య నెత్తిన పెట్టి, తను బంగారు చేప వున్న కుండను ఎత్తుకున్నాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన వరద ఇంటిని కమ్మేసింది. గోడలు ఒక్కొక్కటే కూలిపోసాగాయి. గబగబా నీళ్ళల్లోంచి వెలుపలకు వెళ్తున్న భీమరాజు నెత్తిమీది కుండ దర్వాజా తగిలి ఫట్మని పగిలిపోయింది. చేప నీళ్ళల్లో పడి పోయింది.
''అయ్యో... నా బంగారు చేప. వరదలో కొట్టుకుపోతోంది. వరాలు ఇవ్వకుండానే వెళ్ళిపోతోంది'' అని చేపను పట్టుకోవడానికి వెంట పడ్డాడు. సరుకు, సామాను పక్కన పడేసి భీమయ్య భార్య మట్టమ్మ కూడా నీళ్ళల్లోకి ఒంగింది. ఇద్దరి చేతుల్లోకి చిక్కినట్టే చిక్కి జారిపోసాగింది చేప. నీళ్ళల్లో బంగారు వర్ణంతో మెరుస్తూ మురిపిస్తూ, స్పష్టంగా కనిపిస్తూ, చిక్కకుండా జారిపోతోంది. అలా బంగారు చేప వాళ్ళను నది దగ్గరకు తీసుకుపోయింది. వరాల మీది ఆశతో నదిని, వస్తున్న వరదను గమనించనేలేదు. చేపవెంట ఆశతో నదిలోకి వెళ్ళిపోయారు. పెద్ద అల వచ్చి వాళ్ళను నది మధ్యలోకి నెట్టేసింది. బంగారు చేప వాళ్ల కండ్ల ముందే వున్నట్టుండి దేవకన్యగా మారి నదీగర్భంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న సంపదను చూస్తూ అలాగే లోపలకు వెళ్ళిపోయి ప్రాణాలు విడిచారు బీమరాజు దంపతులు.
- పుప్పాల కృష్ణమూర్తి