Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రహ్మయ్య శాస్త్రికి భూమి లేకపోవడంతో మధుకరం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఓ సారి కృష్ణగిరి జమిందారును యాచించగా ఆవు పెయ్యను దానం ఇస్తూ ''కొద్ది రోజులు మేపుకున్నావంటే, కట్టి దూడను పెడుతుంది. మీకూ, మీ చిన్నపిల్లలకూ పాలు చక్కగా ఉపయోగపడతాయి'' అన్నాడు.
జమిందారు కృష్ణప్రసాద్ గారికి భక్తిగా నమస్కరించి, ఆవును తోలుకుని ఇంటికి వచ్చాడు శాస్త్రి. 'ఆవును మేపడం ఎట్లా? ముగ్గురు చిన్న పిల్లలు. ఆవును కాయలేరు. తను వెళదామంటే, యాయావరం చేయందే కుటుంబం గడవదు. ఎవరినైనా నెలకింత ఇచ్చి కాయమందామంటే, తనది యాచన బ్రతుకు. ఎప్పుడు చేతిలో డబ్బు వుంటుందో, ఎప్పుడు వుండదో తెలియని జీవితం. కుటుంబం గడవడమే కష్టంగా వుంది. డబ్బులు ఎలా ఇచ్చేది? అమ్ముకుని డబ్బు చేసుకుందామంటే ప్రాణం ఒప్పడం లేదు. ఆవు ఆరోగ్యంగా, అందంగా, మహాలక్ష్మిగా వుంది. ఇంటిముందు వున్నా అంతే చాలు. ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనిపిస్తుంది. ఏం చేయడం?' అని మనసులో తర్కించుకుంటూ ఇంటి అరుగు మీద కూర్చొని ఆలోచించసాగాడు
ఇంతలో రామయ్య అనే రైతు తన పశువులను అడవికి తోలుకపోతూ బజారులో రాసాగాడు. 'రామయ్య మంచివాడు. దైవ భక్తి గలవాడు. నా బాధను అర్థం చేసుకుంటాడు. అడిగి చూద్దాం' అనుకున్నాడు శాస్త్రి.
అరుగు దిగి రామయ్యను ఆపి తన బాధ ఏకరువు పెట్టాడు ''తృణమో ఫణమో ఇచ్చుకుంటా గానీ, నా ఆవును నీ పశువులతో పాటు కాపు చేసిపెట్టు. నీ పేరు చెప్పుకుని పిల్లలకిన్ని పాలు తాపుకుంటాను. బ్రాహ్మణుడిని. మేలు చేస్తే భగవంతునికి చేసినంత'' అని చేతులు పట్టుకుని బ్రతిమాలాడు.
శాస్త్రి గారి అభ్యర్థనకు రామయ్య కరిగిపోయాడు. ''మీరే ఒకరిని అడుక్కుని బతుకుతున్నారాయె. నాకు డబ్బులేమి ఇవ్వగలరు. అది జరిగే పని గాదు. మీరు ఇవ్వలేకపోతే మిమ్మల్ని బలవంతపెట్టలేను. ఏడాదికి పైగా ఒక ఆవును ఉచితంగా కాయడమంటే, నేనూ, నా భార్య ఒప్పుకున్నా, నా కొడుకు ఒప్పుకోడు. రోజు పశువులను కాసేది వాడే. కాబట్టి ఉభయులకు శ్రేయోదాయకంగా వుండే ఒక మాట చెపుతాను. దానికి అంగీకరిస్తే నీ ఆవును మా పశువులతో పాటు కాస్తాను. లేకుంటే లేదు'' అన్నాడు.
నా ఆవును ఎవరో ఒకరు కాస్తే చాలు. ఏ షరతుకైనా ఒప్పుకుంటాను అని మనసులో అనుకుని ''చెప్పండి, ఈ బీద బ్రాహ్మణుడిని అన్యాయమైతే చేయరనుకుంటున్నాను'' అన్నాడు చేతులు నలుపుకుంటూ.
''ఏమీ లేదు. నీ ఆవును కట్టి, ఈనే వరకు మేమే కాస్తాం. దానికి పుట్టే దూడను మాకియ్యాలి. దూడ పాలు మరిచే వరకు మా వద్దే వుంటుంది ఆవు. దూడ పాలు మరిచాక మీ ఇంటికి తోలుకపొండి. అప్పుడు పాలను మొత్తం మీరే వాడుకోండి. కానీ మీ ఇంటికి వచ్చే వరకు ఆవు ఇచ్చే పాలలో సగం మీకు, సగం మాకు. అలా ఒప్పందానికి అంగీకరిస్తే, ఆవును కాయడానికి నాకేం అభ్యంతరం లేదు'' అన్నాడు రామయ్య.
'దూడ పాలు మరిచాక కూడా ఏడాది పాటు ఆవు పాలిస్తుంది. కొన్ని ఆవులు మళ్ళీ కట్టే వరకు పాలిస్తాయి. పిల్లలతో కలిసి పాలు తాగొచ్చు' అనుకుని ఒప్పందానికి ఒప్పుడుకున్నాడు. వెంటనే రామయ్య శాస్త్రి గారి ఆవును తన పశువుల్లో కలుపుకున్నాడు.
ఏడాది గడవకముందే ఆవు ఎదకొచ్చింది. తరువాత కట్టి, రెండు దూడలను పెట్టింది. ఒకటి పెయ్య దూడ, మరొకటి కోడె దూడ. వాటిని చూసి శాస్త్రి, రామయ్య సంతోషించారు. రెండు దూడలు తనవే అని రామయ్య, 'లేదు ఏదో ఒక్క దూడే మీది. మరోటి ఆవుతో పాటు నాదే' అని శాస్త్రి గొడవ పడ్డారు. ఆవును, దూడలను తీసుకుని న్యాయాధికారి వద్దకు వెళ్ళారు. ఇద్దరూ తమ మధ్య జరిగిన ఒప్పందమూ, రెండు దూడలు పుడతాయని ఊహించకపోవడం గురించి చెప్పారు.
న్యాయాధికారి ఇరువురి వాదనలను శ్రద్దగా విన్నాడు. 'దూడలు పాలు మరిచినాక తీర్పు చెపుతాను. ఒక్క దూడ పుడితే మీరు పాలు తాగే అవకాశం వుండేది. కానీ రెండు పుట్టాయి. అవి ఆరోగ్యంగా, బలిష్టంగా తయారవ్వాలంటే ఆవుకున్న పూర్తి పాలు దూడలకు ఉపయోగించడమే న్యాయం. వాటికే పాలు వినియోగించండి'' అని చెప్పి పంపించాడు.
పది నెలల తర్వాత మళ్ళీ ఆవు, దూడలతో వచ్చారు తీర్పు చెప్పమని న్యాయాధికారి దగ్గరకు రామయ్య, శాస్త్రి గారలు.
''నీ ఆవును నువ్వు తీసుకో'' అని బ్రహ్మయ్య శాస్త్రిని ఆదేశించాడు న్యాయాధికారి. పలుపుతో వున్న ఆవును చేత పట్టుకుని నిలబడ్డాడు ''రామయ్య గారు మీరు మాట్లాడుకున్నప్పుడు 'పుట్టే దూడ' అనుకున్నారు. ఆ రెంటిలో మీకు ఏది ఇష్టమో దాన్ని మీ దగ్గరకు తీసుకోండి'' అన్నాడు న్యాయాధికారి.
బండికి, అరకకు కోడెదూడ అయితేనే బాగుంటుందని, కోడెను చేత పట్టుకున్నాడు రామయ్య.
మిగిలింది పెయ్యదూడ. దీని మీద ఇద్దరికీ హక్కుంది. దీని విలువ రెండు వందలు. ఎవరైనా వంద రూపాయలు ఇచ్చి, దాన్ని స్వంతం చేసుకోవచ్చు అనగానే, రామయ్య జేబులోంచి డబ్బు తీయబోయాడు అతన్ని వారించి, ''చిన్న మాట. ఎంతసేపటికీ మీ లాభాల గురించి ఆలోచిస్తున్నారే గానీ, తాను రెండు దూడలకు జన్మనిచ్చి, వాటిని ఎడబాయటం ఆవుకెంత గుండెకోత. నోరు లేకపోయినా, దాని బాధను మనం అర్థం చేసుకోవాలి. తల్లి దగ్గర బిడ్డ వుంటేనే తల్లికి తృప్తి, బిడ్డకు ఆనందం. కనుక దూడ కోసం రామయ్యను నువ్వు యాచించవచ్చు'' అన్నాడు.
శాస్త్రి రెండు చేతులు జోడించి, ''జమిందారు గారు నాకు ఆవునిచ్చి ఆదుకున్న దేవుడైతే, దాన్ని పోషించి కాపాడిన రక్షకులు మీరు. మీ పేరు చెప్పుకుని నా చిన్న పిల్లలు రెండు పూటలా పాలు తాగుతారు. దయచేసి దూడను ప్రసాదించండి రామయ్యగారూ'' అని వేడుకున్నాడు. రామయ్య మనసు చల్లబడింది. ''సరే దూడను నీకు దానం ఇస్తున్నాను. తీసుకో'' అని తన కోడెదూడతో ఇంటివైపు మళ్ళాడు రామయ్య. ఆవు, దూడతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు బ్రహ్మయ్య శాస్త్రి. ఇరువురికీ న్యాయం చేసిన న్యాయాధికారిని ప్రజలు మెచ్చుకున్నారు.
- పుప్పాల కృష్ణమూర్తి