Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నస్రీన్ ఖాన్,writernasreen@gmail.com
'ఓ.! అప్పుడే వచ్చేసిండే..!' మెయిన్ డోర్ ముందున్న భర్త చెప్పులను చూసి మనసులనే అనుకుంట లోపలికి అడుగుపెట్టింది సబా ఫాతిమా.
'ఎంతలా నిందిస్తున్నా సరే, ఓపికగా జవాబియ్యాలె' చెప్పులు తీసి స్టాండులో పెట్టుకుంట గట్టిగ ఊపిరి పీల్చి వదిలింది.
'ఇప్పుడే వచ్చినవా?' ముఖాన ముస్కురాహట్ బలవంతాన తెచ్చుకుంట భర్త జునైద్ దగ్గరకు పోయింది.
'నీకిప్పటికి వంద సార్లైన చెప్పి ఉంట. ఏమైన కావాల్నంటె నాకు ఫోన్ చేయాల్నని, నువ్వు పోవొద్దని' ఆమె చేతిల ఉన్న కవర్ చూసుకుంట, ముఖం చిట్లించి అన్నడు.
'చిన్న పని, అది గూడ పక్కనే ఉన్న చిన్న షాపుకు. అయిదు నిమిషాల పనికి గూడ నువ్వు వచ్చేదాంక ఆగడమెందుకు చెప్పు..?' సంఝాయింపు ధోరణిలో అన్నది కిచెన్లకి పోతూ.
'అయినా సరె. చిన్న చిన్నాటికి నువ్ షాపుకు పోతె నా ఇజ్జత్ ఏం గావాలె?' ఇంకా తీవ్రమైన కోపమే ధ్వనిస్తున్నది గొంతుల.
'ఇగో.! నువ్ డ్యూటీ నుంచి అలసి పోయొస్తవ్. కొద్దిసేపట్ల రియాజ్ గూడ ట్యూషన్ నుంచి వస్తడు. ఆకలి మీదుంటరు కదా. అన్నం, కూర రెడీగ ఉంటె తిని పడుకుంటరు కదా. వచ్చిన తరువాత వండుకుంట కూసుంటే అర్థరాత్రి కాదా? కొత్తిమీర లేదు. ఎంతలొస్త అని కూర ఉడుకుతుంటెనే పోయిన, వచ్చే తలికే కూర గూడుడికింది. నువ్ ఫ్రెష్షయి రాపో. ఈలోపు ఇది చల్లి దించేస్త' కొత్తిమీరను శుభ్రం చేసుకుంటనే సవివరంగా చెప్పింది.
'ఇంకోసారి చేస్తె బాగుండదు చెప్తున్న' మల్లొకసారి అతడి కంఠం గర్జించింది. కోపంతోటి ఎరుపెక్కిన అతడి కళ్ళే చెప్తున్నయి ఆమె చేసిన పని పట్ల ఉన్న నారాజ్గీని. డ్రెస్ చేంజ్ చేసుకుంటానికి లేషిండు జునైద్. అంతల్నె రియాజ్ గూడ రావడంతోటి డిన్నర్ చేసేసుకున్నరు.
'రియాజ్...చలో బేటా సోజాతేకి' గొంతులో పొంగుకొస్తున్న బాధను ఓ మూలకు నెట్టి, కొడుకును పిలిచింది మంచంపైన బెడ్‌షీట్ దులిపేసుకుంటా.
'ఆరాం'
'జునైద్ బాగా మారిపోయిండు. చానా రోజుల్నుంచి ప్రతి చిన్న దానికి ఇంతకు ముందు లేని కండీషన్లు పెడుతున్నడు. ఎట్లొచ్చినం, ఎట్ల బతుకుతున్నం, ఎన్ని కష్టాలు పడినం, అన్ని మర్షిపోయుంటడా' కొడుకు పొట్టను నిమురుకుంట ఆలోచనల్ల పడిపోయింది.
'ఎన్ని రోజులిట్ల ప్రాబ్లమ్‌ను దాటేసుకుంట పోయేది. ఎన్ని రోజులు అబద్ధపు నవ్వులు పూయించేది. స్వచ్ఛమైన మనసుల్లో ఉండేదే నిజమైన ప్రేమ కదా. జునైద్తోటి మాట్లాడి పరిష్కార మాలోచించాలె' ఈసారి స్పష్టంగ మాట్లాడి తేల్చుకోవాలని గట్టిగనే అనుకున్నది.
'అయినా! నా పిచ్చి గాకపోతే ఇన్ని రోజుల్నించి సర్దుకుపోతున్నది నేనేగా? తనేమన్న మారిండా? బయటకు వెళ్లి నేను చేసుకోగలిగే చిన్న చిన్న పనులను కూడా ఆపేస్తున్నడు. మెల్లి మెల్లిగ స్వేచ్ఛా రెక్కలు కత్తిరించి, ఈ నాలుగు గోడల మధ్యన ఉంచడంవల్లే కదా నేను సగం చచ్చిపోయింది' ఆలోచిస్తున్నా కొద్దీ మనసంత బాధతోటి నిండి పోయింది.
'ఏనాడన్న భార్యాభర్తల్లెక్క ఉన్నమా? ఫ్రెండ్స్ లెక్క ఉంటరీల్లు అని ఎంత మంది అనుకునేటోల్లు.? ఆ సంతోషాలన్నీ నాతోటి పంచుకుంటనే ఉండేటోడు. ఇప్పుడు వచ్చిన మార్పేంది?' సబా ఆలోచనా ప్రవాహానికి అడ్డులేకుండా పోయింది.
రాత్రంత జాగారమే అయింది. ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపే సబాకు తెల్లారి ఐదింటికే లేషి పనులు చేసుకోవడం అలవాటే. ఉన్నదేదో నాష్టాకు రెడీ చేసి, బాక్సుల కోసం లంచ్ రెడీ చేసేసరికి ఏడు దాటింది. అప్పటికి రియాజ్, జునైద్ ఇంకా నిద్రపోతనే ఉన్నరు.
'రియాజ్. స్కూల్ టైమయితుంది. లే' నిద్రలేపింది.
ఒక్క పిలుపుకే లేచిన రియాజ్‌ను బాత్ రూంలకు పంపి వచ్చి జునైద్‌ను కదిపింది.
'జునైద్! తొందరగ లే. నీతోటి మాట్లాడేదుంది. మల్ల టైం లేదని ఉర్కుతవ్.'
'కొంచెం సేపు పండుకోనీ. వాడ్ని లేపు' రజొరు నిండుగ కప్పుకుంట అన్నడు.
'వాడి స్నానం గూడ అయితున్నది. నువ్వే లేవాలి జల్దీ' తొందర పెట్టింది.
'సరేలే! తినిపించు పో. వస్తున్న' అన్నడు.
'తొందరగ రా మరి' అనుకుంట కొడుకు యూనిఫాం, టై, బెల్టులు అన్నీ ఒక్క దగ్గర పెట్టింది. తరువాత అన్నం తినిపించి, బాక్సు కట్టే లోపట్నే ఆటో వాడు 'రియాజ్' అని బజారంత ఇనేటట్టు కేకేసిండు. ఒకపక్క బుక్స్ బ్యాగు, అదే చేతిల లంచ్ బ్యాగ్ పట్టుకుని, షూ, సాక్సులు ఇంకో చేతిల పట్టుకుని ఉరికిండు రియాజ్.
'ఎంత మెకానికల్ లైఫ్' అనుకుంట చిన్నగా నిట్టూర్చింది.
ఎనిమిదిన్నర అయితుండంగ లేషిండు జునైద్. ఫ్రెషప్ అయ్యేదాంక ఏమీ మాట్లాడలేదు సబా. ఇద్దరికీ నాష్టా తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఈలోపు స్నానం చేసి వచ్చేసిండు జునైద్. మౌనంగనే ఇద్దరూ నాష్టా కానిచ్చేసిన్రు. చారు పెడతానికి కిచెన్లకు పోయింది. జునైద్ డ్రెస్ వెతుక్కుంటున్నడు కబోర్డ్ల.
'ఇంక రెడీ అయితున్నడే. రోజూ ఇదే తంతు. ఎప్పుడో ఒకప్పుడు మనసుల భారం దించుకోవాలిగా' అనుకుంది మరుగుతున్న పాలల్ల టీ పొడి వేస్కుంట.
'పర్స్ యాడుందో సూషినవా?' బెడ్రూంల కెల్లి అరిషిండు.
'ఏమో. ఆడనే ఉంటది సూడు మంచిగ'
'ఆ.. దొరికిందిలే!' హాల్లకు వచ్చుకుంట అన్నడు.
'నువ్వియ్యాల ఒక గంట లేటుగొస్త అని జెప్పు ఆఫీస్‌ల'
''ఎందుకు'' గొంతు సీరియస్సయింది.
'కొద్దిగ మాట్లాడుదాం'
'ఏముంది మాట్లాడతానికి?' ఆశ్చర్యం ధ్వనించిందీసారి.
'నువ్వయితే చెప్పరాదు. చెప్పకుండ లేటుగ పోతే మంచిగుండదు.'
'ఇప్పుడే పోతున్న నేను. చానా పనుంది. లేటయితే బాగుండదు' అతడి గొంతులో ఆశ్చర్యం. కొత్తగా మాట్లాడుతున్న సబా ముఖంలోని స్థిరత్వం అతడిని కంగారుపెట్టినట్లు స్పష్టంగా అర్థమైంది.
'అందుకే ముందుగా చెప్పమనేది. తరువాత ఎందుకు లేటయిందని నిన్నెవ్వరు అడగరు కదా.?
'అరె! లేటుగ వస్తనని చెప్పి మనం మాట్లాడుకునేది అంత గనం ఏమున్నది?'
'ఎందుకుండదు చెప్పు. ఎంత మెకానికల్గ మారిపోయినం మనం? మాటి మాటికి నేను చేయగలిగే పనులను చేసుకోవద్దని కొత్తకొత్తగా మాట్లాడుతున్నవ్. నువ్వొచ్చేదాంక ఆగమంటున్నవ్. ఎందుకిట్ల. నాకు మస్తు బాధయితుంది?' గొంతు పూడుకుపోయింది.
'అవును మరి. ఎందుకు పోవాలె. అన్ని తెచ్చి పెడుతుంటే. నువ్ ఇంట్ల గూసో సాల్' మళ్ళీ ఆర్డరేసినట్లే అన్నడు జునైద్.
'మన పెండ్లయిన పదిహేనేండ్లల్ల నువ్ ఇట్లనే అన్నవా? నీ కష్టానికి నేను తోడు గాలేదా? ఇద్దరం ఒక్క మాట మీద నిలిచి కష్టపడితెనే గదా ఇల్లన్న కట్టుకోగలిగినం.?'
'అవును. అప్పుడు అవసరముండె కాబట్కి నేను నిన్ను గూడ జాబ్ చేయించిన' కటువుగ అన్నడు.
కండ్లల్ల నీల్లు తిరుగుతున్నరు సబాకు.
'ఇప్పుడు నేను నా పనులు చేస్కుంటుంటె నీకొచ్చిన నష్టమేంది? ఆ మాత్రం బయట ప్రపంచం సూడకుండ ఇంట్లనే ఉంటె ఏమై పోతరు చెప్పు మనుషులు?'
'ఏమైతరు? అందరు అట్లనే బయటకొస్తున్నరా? గోషా, పర్దాలున్నరు గదా? నువ్ గూడ గట్లనే ఉండాలె' జునైద్ గొంతు తీవ్రంగా ఉంది.
'అంటే' కండ్లెమ్మటి నీళ్ళ ధార అట్ల కారిపోతనే ఉంది. ఏమీ పట్టించుకోకుండనే ఎల్లిపోయిండు.
ఒక్కసారిగా కూలిపోయింది. మొదట్నుంచీ స్వేచ్ఛనిష్టపడే ఆమె పేదరికం నుంచొచ్చినా ఏనాడూ వేటికోసం ఆశపడలేదు. ఆరుగురు పిల్లలున్న ఇల్లు కావడంతోటి అమ్మానాయినలు ఏది పెడితె అదే తినేది. మిగిలిన ముగ్గురిలెక్క డిమాండ్లు చెయ్యకపోయ్యేటిది. గవర్నమెంటు స్కూలే కావడంతోటి పెద్దగ భారం కాకుండనే సదువుకుంది. ఫస్టు క్లాసుల పాస్ కావడంతోటి ఇంటర్, డిగ్రీలను స్కాలర్షిప్లతోటి ప్రైవేటు కాలేజీల్ల నెట్టుకొచ్చింది. ఇంకా ఎక్కువ చదవాలనేది ఆమె కోరిక. కుటుంబానికి ఆసరా కావాల్ననే పట్టుదల. ఆమె తరువాత ఉన్న ముగ్గురు తమ్ముండ్లు ప్రైవేట్ స్కూల్ల చేర్పించడంతోటి ఇంట్ల ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువైనై. దీనికితోడు అక్క లెక్కనే తనకు కూడా షాదీ చేసి ఎల్ల గొట్టాలనుకున్నరు. ఆ క్రమంల జునైద్, సబా జిందగీల అడుగుబెట్టిండు. జునైద్ కుటుంబ పరిస్థితి గూడ గంతే. దాంతోటి డిగ్రీతోటే ఆపేసిండు.
జుమ్మాగీలలోనే ఆమెకు అవగాహనొచ్చింది. ఈ ఇంట్ల ఉంటే తాను గూడ ఏ సుల్తానానో, ఏ రెహానానో కాక తప్పదని అర్థమైంది. దాంతోటి
'మనమిద్దరం ఎంతోకొంత చదువుకున్నోళ్లం. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంట లైఫ్‌ని మార్చుకోవాలి గదా. ఈడ చూస్తెనేమో, ఆడోల్లు మొగోల్లు దావత్ల ముచ్చట్లు తప్ప ఇంకేం మాట్లాడేటట్లు కనిపిస్తలేరు. లైఫ్, కెరీర్, చదువు లాంటియి ఈ నెల రోజుల్ల ఒక్కసారి కూడా ఇనలే' అని చెప్పింది.
'నిజమే. మనం హైదరాబాద్ ఎల్లిపోదాం. జాబ్‌లు చేసుకోవచ్చు' హ్యాపీగా చెప్పిండు జునైద్.
ఇంట్లోల్లకెవ్వరికిష్టం లేకున్నా, ఈళ్ళిద్దరికిష్టం ఉండడంతోటి ఆల్లు ఏమనలేకపోయిన్రు. అట్ల పదిహేనేండ్ల కింద హైదరాబాద్‌ల అడుగు పెట్టిన ఇద్దరూ జాబ్, కెరీర్ మీదనే దృష్టి పెట్టిన్రు.
ఆ రోజుల్ల కంప్యూటర్ ట్రెయినింగ్ సెంటర్లు బాగ వెలిసినరు. సబా పొద్దున్నే వంట చేసి, బాక్సు పట్టుకుని ఏడింటికి బయటపడుతుండె రూంలకెల్లి. కంప్యూటర్ క్లాసుకు పోయి, ఆడ నుంచి జాబ్‌కు పోయి, సాయంత్రం టైప్ నేర్సుకుని ఇంట్ల పడేది. జునైద్ గూడ పొద్దున్న పోయిండంటే చీకటి పడ్డంకనే ఇంటికొచ్చేది. నా అనేటోల్లు లేని పట్నంల ఇద్దరూ ఒకరికొకరు దోస్తుల లెక్కనే మెలిగేటోల్లు. కొద్దిగ చేతిల పైసలు పడంగనే పీజీ కూడా కంప్లీట్ చేసింది.
సూస్తుండంగనే ఆరేండ్లల్ల కెరీర్లు బాగయినయి. డబ్బు కూడ బెట్టడం షురూ అయింది. అప్పటిదాంక పిల్లల గురించి గూడ ఆలోచించలే.
ఆ తరువాత రియాజ్ పుట్టిండు. అప్పట్నుంచి సబాకు కష్టాలు స్టార్టయినయి. పిలగాడ్ని సూసెటోల్లు లేరు. అటు ఉద్యోగపు సెలవులు పొడిగించే పరిస్థితిలేదు. అయినా ఒంటి చేత్తోటి నెట్టుకొచ్చింది ధైర్యంగా.
తను పని చేసే రంగంల ఆమెకు సీనియారిటీ వచ్చేసింది. దాంతోటి వేర్వేరు కంపెనీలకెల్లి ఆమెకు ఎక్కువ జీతం ఆఫర్లు రాబట్టినయి.
ఇంగ వదల బుద్ధిగాక అత్తను పిలిపించి, కొత్త జాబుకు పోవడం మొదలుపెట్టింది. సబా ఏసే ప్రతి అడుగుల జునైద్ సహకారం ఉండటంతోటి ఆమె సంతోషంగ ఉండేది. ఇప్పుడు ఇద్దరి శాలరీ సర్టిఫికెట్లు పెట్టి ఏదోరకంగా లోన్ ద్వారా మంచి ఇల్లు కట్టుకున్నరు. ఆ ఇంటి వెనకాల ఆళ్ళిద్దరి శ్రమ దాగుంది. ఉరుకులుపరుగుల జీవితంల సబా ఆరోగ్యం దెబ్బతిన్నది. దాంతోటి ఆమె జాబ్ రిజైన్ చేసి ఇంట్లనే ఉంటున్నది. అప్పటి నుంచి మొదలైంది ఆమెపై జునైద్ పెత్తనం.
చిన్న చిన్న పనులకు వేరే వాళ్ల మీద ఆధారపడే మనస్తత్వం కాదు ఆమెది. పానం కాస్త హుషారుగుంటె స్కూటీ మీద మెడికల్ షాపుకు పోయి మందులు తెచ్చుకోవడం, ఏదైనా స్పెషల్ వంట చేద్దామనుకుంటె దానికి కావల్సిన సరుకులు తెచ్చుకోవడంలాంటి పనులన్నీ చేసుకునేటిది. వాటిని గూడ జునైద్ ఇప్పుడొద్దంటున్నడు. ఒకసారి స్కూటీ అమ్మేస్త అని పంచాయితీ పెట్టుకున్నడు.
'నువ్విప్పుడు జాబ్ చేస్తలేవ్ గద. స్కూటీ అమ్మేద్దాం' అన్నడొకసారి.
'లేదు. నాకు చిన్న చిన్న పనులు చేసుకోడానికి, రియాజ్‌కు స్కూలుకు అవసరమయ్యే పనులు చేస్కుంటానికి అవసరమైతది.' అని వారించింది.
'నువ్ పోయేంత పని స్కూల్ల ఏమన్న ఉంటదా చెప్పు' ఎగతాళిగ అన్నడు.
'లేకుంటే లేదు గని నేనైతే అమ్మను' ఖరాఖండీగ చెప్పింది.
అట్ల దానిని విరమించుకున్నడు.
ఇయ్యాల్రేపు సెల్ ఫోన్ లేకుండ ఎవ్వరుండట్లేదు. కానీ, జునైద్ మాత్రం...
'ఇగ ఇప్పుడు నీకు సెల్ అవసరమేంది? తీసేసెరు' అని గోల చేయడం మొదలు పెట్టిండు.
ఆమె పాత కొలీగ్స్ ఎవరన్న ఫోన్ చేసి పలకరించేవారు.
'ఇప్పుడేం పని? జాబ్ మానేసినంక ఇంగెందుకు పలకరింపులు?' అనడం షురూ అయింది.
'ఎందుకిట్ల? ఫ్యూచర్ల చేస్త అనేది ఆల్లకు తెలిస్తెనే కద యాడన్న ఉద్యోగం చూసి పెడతరు? అయినా చేస్తే ఏంది తప్పా?' ఆమె ప్రశ్న.
'తప్పే! లేడీస్‌కు అట్లనేనా ఫోన్లు చేసుడు? ఎవరన్న ఫోన్ చేస్తే మాట్లాడొద్దు. నేనున్నప్పుడు ఎత్తి నాకియ్యి, నేను మాట్లాడతా?' అనేటోడు.
ఎట్లనో కాంటాక్ట్స్ అన్నీ పోవాల్నని సిమ్ కార్డు మార్చింది. స్మార్ట్‌ఫోన్ కావడంతోటి ఫేస్బుక్, వాట్సప్‌లు వాడడం మొదలుపెట్టింది. అయ్యి మొదలైనప్పటినుంచి ఆమెపై ఒత్తిడి మరింత ఎక్కువైంది.
'ఆ పోస్టు ఎందుకు పెట్టినవ్, వాడి పోస్టుకు లైక్ ఎందుకు కొట్టినవ్?' లాంటి వేధింపులు మొదలయినయి. ఇద్దరు మంచిగుంటరు. మంచి ప్లానింగ్ ఉందని చెప్పుకునే చుట్టాలు వాళ్ళ సలహాలు, సూచనలకోసం వాళ్ళింటికి రావడం పరిపాటే.
'ఆళ్లముందు ఈ గొడవలేమీ తెలియనియ్యకపోవడంతోటే గదా ఇంత మర్యాద ఇస్తున్నరు. పోగొట్టుకుంటే బాగుంటదా. ఒకరికి చెప్పే స్థాయిలుండి మనం కొట్లాడుకుంటుంటే ఏం బాగు' అనేది ఆమె ఉద్దేశం. తల్లిదండ్రులకు తెలిస్తే బాగుండదని ఏనాడూ ఆల్ల ముందు తన బాధను వెలిబుచ్చలేదు. అదే జునైద్ బాగా వాడుకుంటున్నడని అర్థమైంది సబాకు.
ఆమె ప్రశ్నిస్తే 'ముస్లింలెవ్వరు బయటకు రారు తెలుసా?' అంటున్నడు.
'ఏ తరీఖా ఇన్నాళ్ళూ తిండి పెట్టింది. అయినా బయటకు వెళ్ళి మన పనులు మనం చేసుకుంటే తరీఖా కాదని ఎవ్వరూ చెప్పలేదు'
ఈ ప్రశ్నకు జునైద్ వద్ద సమాధానంలేదు.
'పోనీ ఏదన్నా తప్పు చేస్తున్న అని అనుమానమా?'
ఈ ప్రశ్నకూ జునైద్ మౌనమే సమాధానమైంది.
'పగలనకా, రేయనకా రక్తాన్ని చెమటగ చిందించిన తనకు ఇప్పుడు దొరుకుతున్నదేంటి?' ఈ ప్రశ్న చాలా రోజులనుంచే వేధిస్తున్నది.
'మనిషిని మనిషిగా చూడటమే నాకు తెలిసిన తరీఖా. ఎవరొచ్చినా ఆత్మీయంగ పలకరించడం, దస్తర్ వేసి మరీ భోజనాలు తినిపించడం, ఏ బాధతోటి వచ్చినా మన, పరాయి అనకుండా అందరికీ ఇంత ధైర్యం చెప్పడం, చేతనైతే ఏదన్న సాయం చేయడం.. ఇదే కద నేను చేస్తున్నది?' మరోసారి తనను తానే ప్రశ్నించుకున్నది.
ఒక విషయం మాత్రం ఆమె గమనంలోకి వచ్చింది.
'పేదరికంల మగ్గినప్పుడు ఆస్తి సంపాదన మీద ధ్యాస పెట్టిన జునైద్, ఇప్పుడు ఇల్లు కట్టుకునే సరికి స్థిరపడిన అనుకుంటున్నడు. ధనవంతుల ఇళ్లలో స్త్రీలు బయటకుపోరు. పకడ్బందీగా తరీఖాలు పాటిస్తారు. సో... మనం గూడ పాటించాలి' ఇది అనుకోంగనే తన చుట్టూ ముళ్ళకంచె ఏదో బిగుసుకుపోతున్నట్లుగ అయింది సబాకు.
'అవును. జునైద్ తరఫు బంధువులకు ఏ కష్టం వచ్చినా, సంతోషమైనా నాతోనేగా చెప్పుకుంటరు. ఏదో ఒక సలహానో, సాయమో చేస్త అనే ఆశ ఆల్లకూ ఉంది కదా? ఆల్లకు బయటి ప్రపంచం గురించి సరిగ్గ అర్థం చేసుకోడానికే కదా నన్ను అడిగేది?' మననం చేసుకుంటున్నది.
ఒకసారి డబిల్‌పుర నుంచి ఖాలా వచ్చినప్పుడు ఏం చెప్పింది. తన అయిదో కూతురికన్నా చదువుకున్న అబ్బాయిని చూడమని నాకే చెప్పింది. అమ్మాయి గుణగణాలు ఎన్నో చెప్పుకొచ్చింది. పక్కనే దుకాణం ఉన్నా... కొత్తిమీర తేవడం గూడ తెల్వదని గొప్పగ చెప్పింది. అప్పుడు జునైద్ ముఖం చిన్నబోయింది. జాబ్ చేస్తున్న తన భార్యవైపు చూసి అవమానం జరిగినట్లుగా తలదించుకున్నడు.
'ఈ తల్లిదండ్రులు గూడ భలే గమ్మత్తైనోల్లు. ఒక పక్క ప్రపంచం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్, 3జీ, ఫోర్ జీ అని పోటీ పడుతుంటే తమ ఆడపిల్లలను మాత్రం గడప దాటకుండ పెంచడమే గొప్పనుకుంటున్నరు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు చదువుకుంటూ, కెరీర్ మలుచుకుంటున్నా ఇంకా ఇలాంటివాళ్ళు మా ఖాన్దాన్ల ఉన్నరేందీ..?' దిగులు ముంచుకొచ్చింది ఆమెలో.
'ఖాలా ఆ మాటనేసరికి కొట్టి పారేసిన కదా. ఆజ్కల్కా జమానా బదల్ గయా. ఈ రకంగా పిల్లలను పెంచితే రేపటి రోజున ఎట్ల బతుకుతరు.? దుకాణంకు పోతే తప్పేమున్నది?' అని ఆ ఖాలా మాటలను కొట్టేసింది తను.
'పెద్దోల్లతోటి మాట్లాడే తరీఖానేనా అది?' అని ఆ ఖాలా పోయినంక మూడు రోజులు గొడవ పెట్టుకున్న సంగతి గుర్తుకొచ్చింది.
'అంటే! భవిష్యత్తుల ఇంటికి ఎవరొచ్చినా ఎదురుపడొద్దని శాసిస్తడేమో? ఇప్పటికే ఎక్కడికక్కడ బందీ చేస్తూ వస్తున్నతడు భవిష్యత్తుల ఇంక మారతాడనుకోవడం ఉత్త భ్రమే అయితదా' ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయింది.
'పక్కింటి ఆంటీతోటి మాట్లాడినా ఆమెను విమర్శించడం, నాతో ఎవ్వరికీ స్నేహం పెరగకుండ చేయడం, ఇయ్యన్నీ నన్ను నన్నుగ విరిచి వేయాలనే కుట్రల భాగమేనన్నమాట! అందుకేనా ఇన్నేళ్ళు జాబ్ చేసినా ఒక్క పైసా నా చేతిల లేకుండ చేసింది. నా బ్యాంకు ఏటీఎంలు గూడ తన దగ్గర పెట్టుకున్నది' తనపై తనే జాలిపడింది.
'ఎక్కడికక్కడ నా ప్రపంచాన్ని మూసేసి, నన్ను తన చెప్పు చేతల్ల పెట్టుకునేటందుకు ప్రయత్నిస్తున్నడు. ఎక్కడా జాబ్ దొరకకుండ చూస్తున్నడన్నమాట. ఆడదాన్ని దెబ్బ తియ్యాలంటె ముందు ఆమె రెక్కలను విరిచేయాలి. అంటే ఆర్థిక మూలం మీద దెబ్బ కొట్టాలె. ఈ సూత్రాన్ని ఎంత బాగా మలుచుకుంటున్నరీ పురుషులు' నిట్టూర్చింది.
'నడక నేర్చుకున్నోళ్లకు అడుగులు వేయడం నేర్పాలనుకోవడం ఎంతటి అవివేకం. ఇంతటి కాపట్యాన్ని మనసులనే దాచుకుని పదిహేనేండ్లపాటు ఎట్ల స్నేహంగ మసలగలిగిండు.? ఇంకా నా మీద ప్రేమ ఒలకబోస్తున్నడనే మాయల కండ్లు మూసుకుని కూసున్ననా నేను' అని మనసులోనే నవ్వుకుంది.
'అబ్బా! తలనొప్పి షురూ అయినట్టుంది. ఇంత చారు తాగుదాం' అని ఆలోచనలు పక్కకు బెట్టి లేచి బాల్కనీలకు పోయింది.
మొహం కడుక్కొని వచ్చి, కిచెన్లకు దూరింది.
రెండు నిమిషాల్ల వేడి వేడి చారు సువాసనలు పీల్చుకుంట హాల్లకు వచ్చి కూసుంది. పొగలు కక్కుతున్న చారు ఆలోచనలు మరో దారిలకు నడిపించినరు.
'ఇట్లాంటి మనిషి ఇంక నా భవిష్యత్తుకు ఉపయోగపడతడా? తన బతుక్కు ఇన్నాళ్లూ నేనే నిచ్చెనగ మారిన. చక్కబెట్టుకున్నడు. మరి నాకు ఏమన్న ఉపయోగపడ్డడా? లేదు. సో.. ఫైనల్ డెసిషన్ తీసుకోవాలె.' ఆలోచిస్తున్నది.
'ఆంక్షల నడుమ బతకడమంటే మనం శవంతో సమానం. జునైద్‌కు ఇష్టం లేకపోతే పోనీ. నా బతుకును ఇప్పటికైనా తీర్చిదిద్దుకోవాలె. నేను జాబ్ చేయాలె. అంతే'
'నా ఉద్దేశం చెప్తే ఎంతగనం కొట్లాడ్తడో. కొట్లాడనీ. కొత్తేముంది? నేను మాత్రం నన్ను నేను కాపాడుకోవాలె. ఇంక నలుగురు నాలెక్క సదువుకొని ఉద్యోగం చేయాలె.'
ఈ ఆలోచన రాంగనే సబా కండ్లల్ల మెరుపు. ఎంతో బలమొచ్చినట్లనిపించింది. చిరునవ్వుతోటి మెల్లి మెల్లిగ చారును ఆస్వాదిస్తూ ఫేస్బుక్, వాట్సప్‌ల ద్వారా పాత కొలీగ్స్‌ను సెర్చ్ చేయడం, మెసేజెస్ చేయడం మొదలుపెట్టింది.